కాంగ్రెస్ లోకి వలసల జోరు.. ఆగస్టులో రాహుల్ తెలంగాణ పర్యటన!

తెలంగాణలో వలసల రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకూ టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటాపోటీ రాజకీయం నడుస్తోందని అంతా భావించారు. అయితే ఆ రెండు పార్టీలనూ మించి కాంగ్రెస్ లోకి వలసలు పోటెత్తుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకూ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలే కాదు పరిశీలకులు సైతం చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఈ జోరు కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.

అందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో అంటే ఆగస్టులో మరో సారి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ కుమారుడు అయిన కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ లో రాహుల్ పర్యటన విజయవంతమైన సంగతి తెలిసిందే. వరంగల్ రైతు డిక్లరేషన్ కు భారీ స్పందన రావడంతో ఈ సారి సిరిసిల్ల సభలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రవేశపెట్టాలన్ని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. సిరిసిల్ల బహిరంగ సభ పై ఏఐసీసీ పెద్దలతో పీసీసీ చీఫ్ రేవంత్ చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

సిరిసిల్ల సభను బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభను మించి విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.  ఇలా ఉండగా నేడో రేపో తెరాస సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

అలాగే బీజేపీ వరంగల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొడేటి శ్రీధర్ కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. వీరిరువురూ  కాంగ్రెస్ కీలక నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి, పాలమూరు మాజీ ఎమ్మెల్యే ఏర్రశేఖర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు కూడా రాహుల్ సమక్షంలో  కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.