20 ఏళ్లకే ముసలితనం!

ఎవరన్నా పెద్దవారు చురుగ్గా ఉంటే ‘అరవైలో ఇరవై’ ఏళ్లవాడిలా ఉన్నారంటూ పొగిడేస్తాము. కానీ ఇప్పటి తరాన్ని కనుక పరిశీలిస్తే ఇరవైలో అరవై ఏళ్లవాడిలా నిస్సారంగా మారిపోతున్నారని గుండెలు బాదుకోక తప్పదు. వైద్యరంగంలో ప్రతిష్టాత్మకమైన Johns Hopkins University పరిశోధనలో వెలుగు చూసిన విషయమిది...

 

ఏ పనీ చేయకుండా ఉండటం, ఒకవేళ పనిచేసినా కూడా ఒళ్లు అలవకుండా ఉండటం ఇప్పటి జీవనశైలి. దానినే మనం sedentary lifestyle అంటున్నాము. పోనీ ఒళ్లు అలవడం లేదు కదా అని వ్యాయామం అన్నా చేస్తున్నామా అంటే అదీ లేదు కదా! కాబట్టి వయసుని బట్టి మనుషుల శారీరిక శ్రమ ఏ తీరున ఉందో తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం 12,529 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. వీరందరినీ వయసుల వారీగా ఐదు విభాగాలుగా విభజించారు. 6- 11 ఏళ్లు, 12- 19 ఏళ్లు, 20- 29 ఏళ్లు, 31- 59 ఏళ్లు, 60- 84 ఏళ్లు అన్నవే ఆ విభాగాలు. వీరంతా రోజూ ఎన్ని కేలొరీలు ఖర్చు చేస్తున్నారో తెలుసుకొనేందుకు ఓ పరికరాన్ని అమర్చారు.

 

ఒక వారంరోజుల పాటు అభ్యర్థుల జీవనశైలిని గమనించిన పరిశోధకులకు ఆశ్చర్యకరమైన విషయాలు బోధపడ్డాయి. 60 ఏళ్లు పైబడినవారు ఒళ్లు కదపకుండా ఎంత బద్ధకంగా జీవిస్తున్నారో, 19 ఏళ్లవారు కూడా అంతే నిస్సారంగా ఉన్నారట. 20 నుంచి 29 ఏళ్లలోపు ఏదో కాస్త ఒంటిని కష్టపెట్టడం కనిపించింది. కానీ ఆ తర్వాత నుంచీ ఒంటికి అసలు శ్రమ అన్నదే తెలియకుండా జీవిచేస్తున్నారట. ఇక 35 ఏళ్లు దాటినవారి గురించైతే అసలు చెప్పనే అక్కర్లేదు! సాధారణంగా ఆడవారికంటే మగవారు ఎక్కువ శ్రమ చేస్తారని అనుకుంటాం. కానీ ఒక వయసు దాటిన తర్వాత అటు ఆడా, ఇటు మగా కూడా ఒంటికి ఎలాంటి పనీ కల్పించడం లేదనీ తేలింది.

 

పెద్దవారైన తర్వాత పని ఒత్తిడి వల్లనో, అలసట చేతనో, ఆనారోగ్యంతోనో శారీరిక శ్రమకి దూరంగా ఉంటున్నారే అనుకుందాం. కానీ 5 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు వారు కూడా ఒంటికి అలవనియ్యకపోవడం ఆశ్చర్యకరం. ప్రపంచ ఆరోగ్యం సంస్థ 5 – 17 ఏళ్ల పిల్లలు రోజులో కనీసం ఓ గంటపాటైనా బాగా అలసట కలిగేలా శ్రమించాలని పేర్కొంటోంది. కానీ 19 ఏళ్లు వచ్చేసరికి... మగపిల్లలలో 50 శాతం మంది, ఆడపిల్లలలో 75 శాతం మంది ఎలాంటి శ్రమా లేకుండా గడిపేస్తున్నారట.

 

ఈ రీసెర్చిలో అమెరికాకు చెందిన వ్యక్తులే పాల్గొన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా బహుశా ఇలాంటి గణాంకాలే నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మన దేశంలో ఆటలకి సమయాన్ని కేటాయించకుండా, కేవలం చదువుకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడాన్ని గమనిస్తే.... 19 ఏళ్లు ఏం ఖర్మ! బహశా పదేళ్ల వయసులోనే మన పిల్లలు వృద్ధులతో సమానంగా నిస్తేజంగా మారిపోతూ ఉండవచ్చు.

- నిర్జర.