జేసీ హైడ్రామా.. పెద్దారెడ్డికి మైండ్‌బ్లాంక్‌.. తాడిప‌త్రిలో ర‌చ్చ రంబోలా..

తాడిప‌త్రి మున్సిప‌ల్ కార్యాల‌యంలో 24 గంట‌ల పాటు హైడ్రామా. మునుపెన్న‌డూ లేనంత ఉత్కంఠ‌. ఛైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి రాత్రంతా ఆఫీసులోనే తిష్ట వేశారు. అక్క‌డే తిన్నారు. అక్క‌డే ప‌డుకున్నారు. ఉద‌యం లేచాక అక్క‌డే ప‌ళ్లు తోముకున్నారు. అక్క‌డే స్నానం చేశారు. మీడియా హ‌ల్‌చ‌ల్ చేసింది. రాష్ట్రం ఉలిక్కిప‌డింది. అధికారుల ఓవ‌రాక్ష‌న్‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీరుపై విమ‌ర్శ‌లు. వైసీపీ పాల‌కుల ప‌రువంతా పోయింది. జేసీకి విప‌రీత‌మైన మైలేజ్ వ‌చ్చింది.

అప్ప‌ట్లో వైఎస్సార్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న తీరుకు వ్య‌తిరేకంగా మైసూరారెడ్డి ఇలానే రోడ్డుపైనే కాల‌కృత్యాలు తీర్చుకొని నిర‌స‌న తెలప‌డంతో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప‌రువు మంట‌గ‌లిచింది. సేమ్ టు సేమ్‌.. ఇప్పుడు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అదే స్ట్రాట‌జీ ఫాలో అయి.. మున్సిప‌ల్ కార్యాల‌యంలోనే రాత్రంగా మ‌కాం వేసి.. ఉద‌యాన్నే అక్క‌డే కాల‌కృత్యాలు తీర్చుకోవ‌డంతో.. ఇటు పాల‌కులు, అటు స‌హాయ నిరాక‌ర‌ణ చేసిన అధికారులు అంతా అవాక్క‌య్యారు. క‌ట్ చేస్తే.. మున్సిప‌ల్ ఉద్యోగులంతా ఇప్పుడు కాళ్ల బేరానికి వ‌చ్చారు. మీరు చెప్పిన‌ట్టే స‌మావేశం ఏర్పాటు చేస్తామంటూ చేతులు క‌ట్టుకొని.. ఛైర్మ‌న్ జేసీ ముందు త‌ప్పుఒప్పుకుని చెంప‌లేసుకున్నంత ప‌ని చేశారు. 
   
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిని మున్సిపల్‌ కమిషనర్‌ నర్సింహప్రసాద్‌ కలిశారు. సోమవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో జేసీని కమిషనర్‌ కలిశారు. మంగళవారం అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఆ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ హోదాలో  సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులు గైర్హాజరై ఈరోజు రావాలని ఆహ్వానించడంపై జేసీ మండిపడ్డారు. 

కొన్ని రోజులుగా తాడిప‌త్రిలో జేసీ వ‌ర్సెస్ పెద్దారెడ్డి పొలిటిక‌ల్ వార్ ఓ రేంజ్‌లో న‌డుస్తోంది. అధికార పార్టీ ఎత్తుల‌కు పైఎత్తులు వేస్తూ.. తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్‌తో పాటు, రెండో వైస్ ఛైర్మ‌న్ ప‌ద‌వులు కూడా టీడీపీ కైవ‌సం చేసుకోవ‌డం ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మింగుడుప‌డ‌టం లేదు. అందుకే కాబోలు.. జేసీ ఏర్పాటు చేసిన స‌మావేశానికి అధికారులెవ‌రూ హాజ‌రు కాకుండా.. త‌న అధికార బ‌లాన్ని ప్ర‌యోగించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఆ ఎపిసోడ్ అనేక మ‌లుపులు తిరిగి.. జేసీ విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించేవర‌కూ దారి తీసింది. 

మున్సిపల్‌ ఛైర్మన్‌ హోదాలో అధికారులు, సిబ్బందితో సోమవారం ఉదయం 10.30 గంటలకు సమీక్షా సమావేశం ఉంటుందని కమిషనర్‌తో సహా అందరికీ శనివారమే జేసీ ప్రభాకర్‌రెడ్డి సమాచారం ఇచ్చారు. అదే సమయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్‌ సిబ్బందితో కలిసి కరోనా వైరస్‌ మూడో దశపై అవగాహన ర్యాలీ, సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అధికారులు జేసీ మీటింగ్‌కు వెళ్ల‌కుండా చేశారు. అధికారుల కోసం సోమ‌వారమంతా ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్లతో కలిసి కమిషనర్‌ ఛాంబర్‌లో ఎదురు చూశారు. కానీ, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యేతో సమీక్ష ముగిసిన అనంతరం అటు నుంచి అటే ఇళ్లకు వెళ్లిపోవడం, కమిషనర్‌ నరసింహప్రసాద్‌ మధ్యాహ్నం నుంచి సెలవుపై వెళుతూ ఇతరులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలియడంతో ఛైర్మన్‌ జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కార్యాలయానికి వచ్చే వరకు కదిలేది లేదంటూ కార్యాలయంలోనే భీష్మించుకు కూర్చున్నారు.

సాయంత్రం 4.30 గంటలకు కొందరు అధికారులు కార్యాల‌యానికి రాగానే జేసీ ప్రభాకర్‌రెడ్డి వంగి వంగి వారికి న‌మ‌స్క‌రిస్తూ.. రండి బాబు రండి అంటూ ఎద్దేవా చేశారు. అధికారులు సమాధానం చెప్పలేక సందిగ్థంలో పడిపోయారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కమిషనర్‌ సెలవుపై ఎలా వెళతారని, ఛైర్మన్‌ ఆదేశాలను కాదని సిబ్బంది ఎలా గైర్హాజరవుతారని ప్రశ్నిస్తూ 26 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 26మంది మున్సిప‌ల్ సిబ్బంది క‌నిపించ‌డం లేదంటూ రాత్రి పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశారు. కమిషనర్‌ వచ్చేదాకా కార్యాలయంలోనే ఉంటానంటూ.. రాత్రి అక్కడే భోజనం చేసి, అక్క‌డే ప‌డుకున్నారు. ఉదయం సైతం అక్క‌డే ప‌ళ్లు తోముకోవ‌డం, స్నానం చేయ‌డం.. ఆ దృశ్యాలు ప్ర‌కంప‌ణ‌లు సృష్టించ‌డంతో పాల‌కులు ఖంగుతిన్నారు. ఇంకా ఆల‌స్యం చేస్తే మ‌రింత డ్యామేజ్ అవుతుంద‌నుకున్నారో ఏమో.. క‌మిష‌న‌ర్ న‌ర్సింహ‌ప్ర‌సాద్ మున్సిప‌ల్ కార్యాల‌యానికి త‌ర‌లివ‌చ్చి.. స‌మావేశం ఏర్పాటు చేస్తానంటూ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిని ఆహ్వానించి న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. జేసీకి వ్య‌తిరేకంగా సోమ‌వారం ఉద్యోగులు మీటింగ్‌కు వెళ్ల‌కుండా సైడ్ చేసి పంతం నెగ్గించుకున్న‌ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి.. తెల్లారేస‌రిక‌ల్లా దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా షాక్ ఇచ్చారు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి. ఇలా వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో తాడిప‌త్రిలో జేసీదే ప‌దే ప‌దే అప్ప‌ర్ హ్యాండ్ అవుతుండ‌టంతో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి దిక్కుతోచ‌ని దుస్థితి.