లెక్కా? తిక్కా? ప‌వ‌న్‌కి క్లారిటీ ఉందా? బీజేపీ మైండ్‌గేమ్ ఆడుతోందా?

లెక్క‌లేనంత తిక్కున్నా.. దానికో లెక్కుంద‌నేది సినిమా డైలాగ్‌. మ‌రి, రాజ‌కీయాల్లోనూ సేమ్ స్ట్రాట‌జీ అప్లై అవుతుందా? తిక్క వ‌ర‌కూ ఓకే కానీ, లెక్కే మిస్ మ్యాచ్‌ అవుతోందా? ప‌వ‌న్ పాలిటిక్స్ ఫ్యాన్స్‌నే క‌న్ఫ్యూజ‌న్‌కి గురి చేస్తున్నాయా? ఇలా జ‌న‌సేన రాజ‌కీయ విధానాల‌పై అనేక ప్ర‌శ్న‌లు.. అంత‌కు మించి అనుమానాలు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాస్త క్లారిటీగానే ఉన్నారు. ఏది ఏమైనా బీజేపీతో పొత్తు కంటిన్యూ చేస్తున్నారు. తిరుప‌తి సీటు త‌మ‌కు రాకున్నా.. బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. తెలంగాణ విష‌యం వ‌చ్చే స‌రికే అంతా ఆగ‌మాగం. బీజేపీతో పొత్తు ఉన్న‌ట్టా?  లేన‌ట్టా? ఏమీ అర్థం కాదు. ఓసారి స‌పోర్ట్ చేస్తారు. మ‌రోసారి క‌టీఫ్ చెబుతారు. మ‌ళ్లీ ఓచోట దోస్తీ క‌డ‌తారు. మ‌రోచోట చేతులెత్తేస్తారు. తెలంగాణ‌లో జ‌న‌సేన లెక్క‌.. తిక్క తిక్క‌గా ఉందంటున్నారు విశ్లేష‌కులు. 

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన‌.. ప‌క్క‌నే ఉన్న వ‌రంగ‌ల్‌లో మాత్రం క‌మ‌ల‌నాథుల‌కు హ్యాండ్ ఇచ్చింది. ఇలా, తెలంగాణ‌లో వ‌రుస‌గా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒక్కోసారి.. ఒక్కోచోట.. ఒక్కో విధంగా.. రాజ‌కీయం చేస్తుండ‌టం.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డ‌మే అనే విమ‌ర్శ వినిపిస్తోంది. జ‌న‌సైనికులు మాత్రం త‌మ అధినేత ఏమి చేసినా దానికో లెక్క ఉంటుందంటూ పార్టీ స్టాండ్‌కు క‌ట్టుబ‌డి ప‌ని చేస్తున్నారు.

గ్రేట‌ర్‌లో బీజేపీకి బేష‌ర‌తు మ‌ద్ద‌తిచ్చింది జ‌న‌సేన‌. క‌మ‌ల‌నాథుల కోరిక మేర‌కు పోటీ నుంచీ త‌ప్పుకుంది. జీహెచ్ఎమ్‌సీలో బీజేపీకి పెద్ద సంఖ్య‌లో సీట్లు రావ‌డానికి జ‌న‌సైనికుల స‌హ‌కారం లేక‌పోలేదు. గ్రేట‌ర్‌లో గెలిచామ‌న్న అహంకారంతో తెలంగాణ బీజేపీ త‌మ‌ను త‌క్కువ చేసి చూస్తోందంటూ ఆ త‌ర్వాత జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆఖ‌రి నిమిషంలో స్టాండ్ మార్చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. బీజేపీని కాద‌ని.. ప‌రోక్షంగా, బ‌హిరంగంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థి వాణీదేవికి మ‌ద్ద‌తు ప‌లికారు. వాణీదేవి గెలుపున‌కు జ‌న‌సేన ఉడ‌తా భ‌క్తి సాయం చేసిందంటున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో దాదాపు త‌ట‌స్థంగా ఉంది జ‌న‌సేన‌.

క‌ట్ చేస్తే.. అంత‌లోనే వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈసారి జ‌న‌సేన స్టాండ్ ఎలా ఉండ‌బోతుందోన‌ని అంతా ఆస‌క్తిగా చూశారు. తెలంగాణ జిల్లాల్లోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. హోరాహోరీగా జ‌రిగే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌తీ ఓటూ కీల‌క‌మే. అలాంటిది.. జ‌న‌సేన ఆ రెండు చోట్ల రెండు విధానాలు పాటిస్తోంది. ఖ‌మ్మంలో బీజేపీతో పొత్తుపెట్టుకుంది జ‌న‌సేన‌. వ‌రంగ‌ల్‌లో మాత్రం పొత్తు-గిత్తూ జాన్తా నై అంది. అదేంటి? ఖ‌మ్మంకో రూల్‌. వ‌రంగ‌ల్‌కు మ‌రో రూలా? అస‌లు, జ‌న‌సేన‌కు ఓ స్ప‌ష్ట‌మైన పొలిటిక‌ల్ విధాన‌మంటూ ఉందా? అనే డౌట్ తెలంగాణ‌వాదుల్లో.

జ‌న‌సేన‌నే క‌న్ఫ్యూజ్ అవుతోందా?  లేక‌, బీజేపీనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో గేమ్స్ అడుతోందా? అనే చ‌ర్చ కూడా న‌డుస్తోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఇంటికెళ్లి మ‌రీ మ‌ద్ద‌తు అడిగారు క‌మ‌ల‌నాథులు. మంచి మాట‌లు చెప్పి పోటీ నుంచీ విత్‌డ్రా చేశారు. తీరా గెలిచాక, అవ‌స‌రం తీరాక‌.. లైట్ తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గ్రాడ్యుయేట్స్ ఓట్లే కాబ‌ట్టి.. అవి ఎలాగూ త‌మ‌కే ప‌డ‌తాయ‌నే ధీమాతో.. ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోలేదు. అదే ఆయ‌న‌కు కాలింది. లాస్ట్ మిన‌ట్‌లో బీజేపీకి ఝ‌ల‌క్ ఇచ్చి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. 

అక్క‌డి వ‌ర‌కూ ఓకే. మ‌రి, ఆ త‌ర్వాతైనా దోస్తీ కొన‌సాగిందా అంటే అదీ లేదు. సాగ‌ర్ బైపోల్‌లో  ఒక‌రిని ఒక‌రు పట్టించుకోలేదు. అదే, కార్పొరేష‌న్ ఎల‌క్ష‌న్స్ వ‌చ్చే స‌రికి మ‌ళ్లీ ఈక్వేష‌న్ మారిపోయింది. వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో బీజేపీకి బ‌లం ఉండ‌టం, కాక‌తీయ యూనివ‌ర్సిటీ ఉండ‌టంతో విద్యార్థి యూనియ‌న్లు యాక్టివ్‌గా ఉండ‌టం, గ‌తంలో వ‌రంగ‌ల్ లో ఓసారి బీజేపీ ఎమ్మెల్యే గెల‌వ‌డం.. విద్యావంతులు అధికంగా ఉండే ప్రాంతం కాబ‌ట్టి బీజేపీకి అనుకూల‌త ఉండ‌టం.. ఇలా అనేక కార‌ణాల‌తో జ‌న‌సేన‌ను ట‌చ్ కూడా చేయ‌లేదు క‌మ‌ల‌నాథులు. అదే ఖ‌మ్మం విష‌యం వ‌చ్చే స‌రికి.. వ‌రంగ‌ల్ లాంటి అద‌న‌పు అనుకూల‌త‌లేమీ లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ జ‌న‌సేన మ‌ద్ద‌తు అనివార్య‌మైంది. ఖ‌మ్మంలో ఆ రెండు పార్టీల పొత్తు పొడిచింది. 

ఇలా.. బీజేపీ మైండ్‌గేమ్‌తోనే జ‌న‌సేన గంద‌ర‌గోళానికి గురైతోంద‌ని విశ్లేషిస్తున్నారు. ఆ విష‌యం ప‌సిగ‌ట్ట‌లేని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. క‌మ‌ల‌నాథుల‌కు అవ‌స‌రానికి ప‌నికొచ్చే పావులా మారుతున్నార‌ని అంటున్నారు. క‌మ‌ల వ్యూహంతో గాజుగ్లాసు ముక్క‌ల‌వుతోంద‌ని.. అందుకే ఎల‌క్ష‌న్‌ను బ‌ట్టీ, ప్రాంతాన్ని బ‌ట్టీ జ‌న‌సేన స్ట్రాట‌జీ మారిపోతోంద‌ని.. ఇదంతా క‌మ‌ల మాయే కానీ.. ప‌వ‌న్ లెక్కో.. తిక్కో.. కాద‌ని అనేవారూ లేక‌పోలేదు. అవ‌స‌రం లేనిచోట ప‌వ‌న్‌ని ప‌ట్టించుకోకుండా ఆయ‌న‌కు తిక్క రేపి.. అవ‌స‌రం ఉన్న‌చోట ఆయ‌న్ను మ‌చ్చిక చేసుకొని.. బీజేపీ మైండ్‌గేమ్ అడుతోంద‌నేది కొంద‌రి మాట‌.