రేవంత్ రెడ్డే సూపర్ పవర్.. దిగొచ్చిన జగ్గారెడ్డి

ఇంతకు ముందంతా  ఒక లెక్క. ఇప్పట్నుంచి ఇంకో లెక్క. సీనియర్లు అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని ఏం మాట్లాడినా చెల్లుతుందనుకుంటే కుదరదు. సంగారెడ్డి ఎమ్మెల్యే, టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో టీ-పీసీసీ హోదాలో పార్టీ మీద తన పట్టు ఎంతుందో రేవంత్ రెడ్డి రుజువు చేసుకున్నారు. గతంలో టీ-పీసీసీ ప్రెసిడెంట్ల మీద ఎవరైనా ఎన్ని కామెంట్లయినా చేసుకునే వెసులుబాటు ఉండేది. దాన్ని ఆ పార్టీ నాయకులు కూడా అంతర్గత ప్రజాస్వామ్యం అంటూ ముద్దుపేరుతో పిలుచుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది. నోరుంది కదాని మాట్లాడితే అదే నోటితే క్షమాపణ చెప్పించడానికైనా వెనుకాడని ఓ సరికొత్త సంప్రదాయాన్ని ప్రమోట్ చేస్తున్నారు. 

వృద్ధ నాయకత్వం మీద ఎవరెన్ని విమర్శలు చేసినా తమకు కుర్చీ ఉంటే చాలనుకొని, మిగతావేవీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయా నాయకత్వాలు సర్దుకుపోయాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చింది యువ రక్తం.. రేవంత్ నాయకత్వం. పార్టీని ఆమూలాగ్రం ప్రక్షాళించాలనుకొన్న హైకమాండ్.. ఆయా రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ లకు తగినంత ప్రాధాన్యత కల్పిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రాలో ఓ వెలుగు వెలిగిన పార్టీగా వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోయిన ప్రభ నిలబెట్టుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది. సరికొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. హైకమాండ్ కు విధేయులు అన్న పేరుతో స్థానిక నాయకత్వానికి సమాంతరంగా ముఠాలను ప్రోత్సహించే సంప్రదాయానికి క్రమంగా పాతరేస్తోంది. 

ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డికి సమాచారం లేకుండా రేవంత్ రెడ్డి పర్యటించడంపై జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రేవంత్ ను కౌన్-కిస్కా అనే రేంజ్ లో ఆడుకున్నారు. తాను రేవంత్ కంటే సీనియర్నని, పార్టీలో ఒంటెత్తు పోకడలు పనికిరావని, తనను అవమానపరిస్తే సహించేది లేదనీ రేవంత్ మీద ఎగిరిపడ్డారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యేకంటే ముందే తాను హ్యాట్రిక్ ఎమ్మెల్యేనంటూ రేవంత్ ను కనీసం ఖాతరు కూడా చేయలేదు. తాను తల్చుకుంటే ఇప్పుడంటే ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరినా ఎవరూ అడిగేవారు ఉండరంటూ భారీ పొలిటికల్ ఫీలర్స్ వదిలారు. రేవంత్ వల్ల పార్టీ పడవ మునగక తప్పదంటూ రేవంత్ నాయకత్వంపై తీవ్రమైన శస్త్రాలు సంధించారు. 

ఈ వ్యవహారం కాస్తా కాంగ్రెస్ లో పెద్ద దుమారమే రేపుతుందని అంతా అనుకున్నారు. జగ్గారెడ్డికి హైకమాండ్ నుంచి షోకాజ్ నోటీస్ వస్తుందని, భారీ మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుందని మీడియాలో స్పెక్యులేషన్స్ నడిచాయి. కొన్నాళ్లపాటైనా సస్పెన్షన్ వేటు వేస్తారనుకున్నారు. అనుకున్నట్టుగానే పార్టీ హైకమాండ్ కూడా మాణికం ఠాకూర్ ను రంగంలోకి దించింది. సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేసి జగ్గారెడ్డి తప్పిదాన్ని ఒప్పుకునేలా చేసింది. తప్పంతా తనదేనని, రేవంత్ రెడ్డి పొరపాటు ఇసుమంతైనా లేదని జగ్గారెడ్డి చేత చెప్పించడంలో సక్సెస్ అయింది. బహిరంగంగా కామెంట్లు చేయడం తప్పేనని, ఇకపై ఎవరూ అలా మాట్లాడరాదంటూ మిగతా సీనియర్లకు కూడా జగ్గారెడ్డి సూచించడం విశేషం. మీడియాకు కూడా జగ్గారెడ్డి ఇవే మాటలు చెప్పడం కాంగ్రెస్ లో మారిన సంస్కృతికి అద్దం పడుతోంది. 

జగ్గారెడ్డి మీద వేటు పడటం ఖాయమనుకున్న వ్యవహారం కాస్తా ఒక్క  క్షమాపణతో సర్దుకుపోయింది. దీంతో పార్టీ మీద తనకెంత పట్టు ఉందో రేవంత్ రెడ్డి నిరూపించుకున్నట్టయింది. అంతేకాదు... హైకమాండ్ రేవంత్ కు ఎంత ప్రయారిటీ ఇస్తుందో కూడా ఇండైరెక్టుగా మిగతా నాయకులందరికీ ఈ ఒక్క దెబ్బతో కళ్లకు కట్టినట్టయింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ పట్టు పెరుగుతుండగా... అసమ్మతివాదులు క్రమంగా  దారికొచ్చే అవకాశం ఉందంటున్నారు. అదీగాక తాను పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత రేవంత్ నాయకులందరినీ వ్యక్తిగతంగా కలిసి అందరినీ కలుపుకొని పోతానని చెప్పారు. అదే సంప్రదాయాన్ని బాధ్యతలు చేపట్టాక కూడా కొనసాగిస్తూ తన పెద్దరికాన్ని పెంచుకుంటున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి ఎపిసోడ్ తో తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సూపర్ పవర్ అన్నది మరోసారి స్పష్టమైంది.