అసెంబ్లీ బహిష్కరణ జగన్ యూటర్న్.. కారణమేంటంటే?

సింహం సింగిల్ గా వస్తుంది. పులివెందుల టైగర్. మాట తప్పడు, మడమ తిప్పడు.. ఇవీ జగన్ తనకు తానుగా తగిలించుకున్న భుజకీర్తులు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ప్రజల ముందు దీనంగా సెంటిమెంట్ పండించి, తండ్రిని కోల్పోయాను, బాబాయ్ హత్యకు గురయ్యారు.. కోడి కత్తితో తనపై హత్యాయత్నం జరిగిందంటూ జనాలను నమ్మింది 2019 ఎన్నికలలో ఓట్లు దండుకుని అధికార పగ్గాలు అందుకున్న జగన్.. ఆ తరువాత తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపించారు. క్రమం తప్పకుండా బటన్లు నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సోమ్ములు వేస్తున్నానని చెప్పుకుంటూనే.. మోయలేని పన్నుల భారం మోపి, చివరాఖరకు చెత్త మీద కూడా పన్ను వేసి జనం నడ్డి విరిచారు. తన ప్రభుత్వ విధానాలలో తప్పులను ఎత్తి చూపిన వారిని నానా రకాలుగా వేధించారు. కోవిడ్ సమయంలో వైద్యులకు కనీసం మాస్కులు కూడా సరఫరా చేయడం లేదని నిలదీసిన వైద్యుడిపై పిచ్చివాడన్న ముద్ర వేసి ఆయన చావుకు కారణమయ్యారు. ఇక ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులు, వేధింపులు, కేసులు, అరెస్టుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్లుగా జగన్ పాలన సాగింది. సరే ఐదేళ్ల పాటు తమ ఆగ్రహాన్ని పంటి బిగువున భరించిన ఏపీ జనం.. 2024 ఎన్నికలలో జగన్ కు ఆయన స్థానం ఏమిటొ చూపారు. కనీసం ప్రతిపక్ష నేతగా కూడా  అర్హత లేదని ఆయన సహా ఆయన పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలను మాత్రమే ఇచ్చి బుద్ధి చెప్పారు. 2024 ఎన్నికలకు ముందు కూడా జగన్ గులకరాయి దాడి అంటూ సానుభూతి డ్రామాలకు తెరతీసినా జనం పట్టించుకోలేదు. అయితే అంతటి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తరువాత కూడా జగన్ తీరు మారలేదు. 
తనకు 40 శాతం ఓట్లు వచ్చాయనీ, జనం తనను తిరస్కరించలేదనీ చెప్పుకున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే ఘోర పరాజయం పాలయ్యానంటూ మరోసారి సెంటిమెంట్ ప్లే చేద్దామని చూశారు. 
ఇవన్నీ పక్కన పెడితే.. జనం ‘ఛీ’దరించుకుని.. కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితం చేసినా.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ హఠం చేస్తూ అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు సైతం వెళ్లారు. గతంలో తాను అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా పోవడానికి ఓ ఐదుగురు  ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంటే చాలు అంటూ అసెంబ్లీ వేదికగా తాను చేసిన ప్రసంగాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించి మరీ.. తనకు లేని, రాని ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదని ప్రతిజ్ణ సైతం చేశారు. అయితే అసెంబ్లీ నిబంధలనలు తెలిసి వచ్చిన తరువాత.. ప్రతిపక్ష హోదా మాట దేవుడెరుగు.. ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతుందని అవగతమైన తరువాత.. సింహం, పులి, మాట, మడమ వంటి మాటలన్నిటికీ చెల్లు చీటి పాడేసి అసెంబ్లీకి హాజరు కావడానికి రెడీ అయిపోయారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం (ఫిబ్రవరి 24) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందీ హాజరౌతారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాలకు జగన్ డుమ్మా కొడితే ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ క్లారిటీ ఇచ్చిన తరువాత.. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఫరవాలేదు... ఉన్న శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకుంటే చాలన్న భావనకు జగన్ వచ్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే జగన్ తన అడ్డాగా చెప్పుకునే కడప జిల్లాలలోనే ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఏడు అసెంబ్లీ స్థానాలలో  పరాజయం పాలైంది. సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. దీంతో ఆయన ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టుపట్టి అసెంబ్లీని బహిష్కరిస్తే ఏదో సామెత చెప్పిన చందంగా ప్రతిపక్ష హోదా రాకపోగా, ఉన్న శాసనసభ సభ్యత్వం కూడా పోతుందన్న క్లారిటీ రావడంతో దిమ్మదిరిగి బొమ్మ కనిపించినట్లైంది. దీంతో బుద్ధిగా కనీసం అటెండెన్స్ కోసమైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు ఇవే.   ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం తరువాత  సభ వాయిదా పడుతుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ ఏ అంశాలు చర్చించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. 

ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని  వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. సాధారణంగా అసెంబ్లీ జరుగుతూంటే అన్ని పార్టీల నేతలు .. తమ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహిస్తాయి. అయితే జగన్ అలాంటిదేమీ నిర్వహించలేదు. తానేం చెబితే తన పార్టీ ఎమ్మెల్యేలు అది చేసి తీరాలన్నది జగన్ హుకుం.  అందుకే వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హారరౌతున్నారని సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో చెప్పేశారు. అంతే. ఇన్ని రోజులూ ఎందుకు హాజరు కాలేదు. కారణమేంటి అన్న ప్రశ్నలు ఇప్పడు వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతున్నాయి. వాటిని బయటకు చెప్పే ధైర్యం, ఒక వేళ చెప్పినా సమాధానం దొరకుతుందన్న నమ్మకం వారిలో లేదు. 

సరే అసెంబ్లీకి హాజరవ్వాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందీ సభకు హాజరౌతారు. అయితే వారు సెషన్ మొత్తం సభకు వస్తారా? మొక్కుబడిగా గవర్నర్ ప్రసంగానికి హాజరై.. ఆ తరువాత మళ్లీ డుమ్మా కొట్టేస్తారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.  కేవలంఅనర్హతా వేటు పడకుండా ఒక్క రోజు మాత్రం సభకు హాజరై ఆ తరువాత ఇక మళ్లీ ఇప్పట్లో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu