పయ్యావులను టార్గెట్ చేశారా? ఎందుకేంటి?

జగన్ సర్కార్    తెలుగుదేశం సీనియర్ నాయకుడు,  ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ను టార్గెట్ చేసిందా? అందుకే ఆయనకు భద్రత ఉపసంహరించిందా? అంటే పయ్యావుల మాత్రం ఔననే అంటున్నారు. కావాలనే ప్రభుత్వం తన భద్రతకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.

పొరుగు రాష్ట్రాల్లో ఉండే వారకి భద్రత కల్పించనంటున్న జగన్ సర్కార్ తెలంగాణలో నివసిస్తున్న వైసీపీ నేతలకు ఎలా, ఎందుకు భద్రత కల్పిస్తోందో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాననీ, ప్రభుత్వఆర్థికఅరాచకత్వాన్ని ప్రశ్నిస్తున్నననే జగన్ తనను టార్గెట్ చేశారని పయ్యావుల ఆరోపించారు. భద్రత పెంచాలని కోరినా ఇంత వరకూ పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వానికి చెందిన తప్పులను ఎత్తి చూపుతున్నందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఓ సీనియర్ అధికారే స్వయంగా తనకు తెలిపారని కూడా పయ్యావుల అన్నారు. గన్ లైసెన్స్ కు అప్లై చేసుకుంటే ఆల్ ఇండియా పర్మిట్ అంటూ నాలుగు నెలల నుంచీ తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. నక్సల్స్ నుంచి తన కుటుంబానికి ముప్పు ఉందని, ఇప్పటికే తన నియోజకవర్గంలో నక్సల్స్, మాజీ మిలిటెంట్ల కదలికలు పెరిగాయని, ఆ విషయం తెలిసి కూడా తనకు భద్రత కల్పించడం లేదని ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

అయితే పోరాటాలలో రాటు తేలిన తనను ప్రభుత్వం బెదరించి లొంగదీసుకోవడం సాధ్యం కాదని అన్నారు. తాను ప్రస్తావిస్తున్న అంశాలూ, రాస్తున్న లేఖలు జగన్ సర్కార్ కు ఇబ్బంది కలిగిస్తున్నందునే తనను సర్కార్ టార్గెట్ చేసిందని పయ్యావుల అన్నారు.