పరామర్శ పేర రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాట..మారని జగన్ తీరు!
posted on Jan 11, 2025 8:12AM
తిరుమలలో తొక్కిసలాట ఘటనను రాజకీయం చేసేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. సొంత మీడియా ద్వారా, తన సోషల్ మీడియా బ్యాచ్ ద్వారా అసత్య ప్రచారం చేస్తూ హద్దులు మీరి ప్రవర్తించడంతో పాటు.. ప్రజలు లాగి లెంపకాయ కొట్టినా తన బుద్ధి మారలేదనీ.. మారదని మరోసారి నిరూపించుకున్నారు. జగన్ అహంకారానికి తోడు వైసీపీ నేతల వెకిలి చేష్టలతో తిరుపతి ఘటనలో బాధితుల పరామర్శించే సమయంలో వారు ప్రవర్తించిన తీరు ప్రజల్లో ఆగ్రహాన్నికలిగించింది.
కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా దురదృష్టవశాత్తూ తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందటం బాధాకరమైన విషయమే. అయితే, ఘటన జరిగిన వెంటనే టీటీడీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యాయి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. వారికి మెరుగైన వైద్యం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. టీటీడీ సభ్యులు, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారుల సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ, జేఈవోలను ట్రాన్స్ ఫర్ చేశారు. విచారణ అనంతరం మరి కొందరిపై కూడా వేటు పడే అవకాశాలున్నాయి. మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతోపాటు.. వారికి కుటుంబాల్లోని ఒకరికి టీటీడీలో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరుపట్ల భక్తులు, రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేసింది. అయితే, జగన్ మాత్రం తిరుపతి ఘటనను రాజకీయం చేసేందుకు నానా ప్రయత్నాలూ చేసి అడ్డంగా దొరికిపోయారు.
ఏదైనా విషాద ఘటనలు జరిగినప్పుడు బాధితులను పరామర్శించే సమయంలో అధికారుల సూచనలు పాటించాలి. హంగూ ఆర్భాటం లేకుండా బాధితులను పరామర్శించి అసలేం జరిగిందనే విషయాలను తెలుసుకోవాలి. కానీ, జగన్ మోహన్ రెడ్డి రూటే సపరేటు. ఊహించని ఘటనలో బాధితులుగా మారి గాయాలతో ఇబ్బందులు పడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి జగన్ హద్దులు మీరి ప్రవర్తించారు. ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం నుంచే బాధితులను పరామర్శించేందుకు తిరుపతికి జగన్ వస్తున్నారంటూ విస్తృత ప్రచారం చేశారు. స్థానిక వైసీపీ క్యాడర్ భారీ సంఖ్యలో తరలిరావాలంటూ సందేశాలు పంపించారు. దీనికితోడు అధికారులు ఇచ్చిన సమయం కంటే జగన్ ఆలస్యంగా తిరుపతి చేరుకున్నారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ అక్కడే ఉన్నారు. కాస్త వేచి ఉండాలని అధికారులు సూచించినా జగన్, వైసీపీ నేతలు వారిని లెక్కచేయకుండా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లారు. జగన్ తోపాటు దాదాపు పది మంది వైసీపీ నేతలు ఆస్పత్రి సిబ్బంది వారించినా లెక్కచేయకుండా తొసుకుంటూ లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో కొందరి సెలైన్ బాటిల్స్ కూడా పక్కకు తోసేశారు. ఐసీయూలోకిసైతం తోసుకెళ్లే ప్రయత్నం చేశారు. బాధితులను పరామర్శ పేరుతో జగన్, ఆయన బ్యాచ్ చిన్నపాటి రాజకీయ యాత్ర చేశారు.
.webp)
జగన్ రెడ్డి రాజకీయం ఎంత నీచాతినీచంగా ఉంటుందో ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ప్రజలందరూ చూశారు. తల్లిని, చెల్లినిసైతం పార్టీని నుంచి గెంటేసి, వారికి రావాల్సిన ఆస్తినిసైతం ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో తల్లి, చెల్లిపై విషప్రచారం చేయించారు. సొంత బాబాయ్ హత్య విషయంలోనూ హంతకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలిచారు. వారిని తన పక్కనే తిప్పుకున్నారు. రాజకీయాలకోసం ఎంతకైనా దిగజారిపోయే జగన్ రెడ్డికి గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకూడా ఇవ్వకుండా ప్రజలు గట్టి బుద్ధిచెప్పారు. అయినా ఆయన బుద్ధి మారలేదు. తిరుపతి ఘటనలో క్షతగాత్రులను పరామర్శించే విషయంలోనూ జగన్ తనకు రాజకీయ లబ్ధి వినా మరేం పట్టదనీ, ప్రజలూ, వారి బాధల గురించి పట్టింపే లేదనీ మరో సారు రుజువు చేసుకున్నారు. జగన్ పరామర్శకు వెళ్లేందుకు కొద్ది నిమిషాల ముందే ఒకరిద్దరు వైసీపీ నేతలు 18మంది బాధితులకు తెల్ల కవర్లు ఇచ్చారు. జగన్ వస్తున్నారు, ఆయన వచ్చిన సమయంలో చంద్రబాబు కారణంగానే తిరుపతి ఘటన జరిగిందని చెప్పాలంటూ సూచించారు. బాధితులకు తెల్ల కవర్లు ఇచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో వెలుగులోకి వచ్చాయి. మరోవైపు.. జగన్ మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యతనిచ్చాడు.
తిరుపతి ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. టీటీడీ బోర్డులోని కొందరు సభ్యులు తమవంతుగా సహాయం అందజేసేందుకు ముందుకొచ్చారు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన జగన్ రెడ్డికి నిజంగా ఘటన పట్ల బాధకలిగి ఉంటే మృతుల కుటుంబాలకు తన వంతుగా సాయం ప్రకటించి ఉండాలి. కానీ అలాంటిదేమీ చేయకుండా కేవలం ఘటనను రాజకీయం చేసేందుకు మాత్రమే జగన్ ప్రయత్నించారు. బాధితుల పరామర్శ సమయంలో జగన్, వైసీపీ నేతల తీరును టీవీల ద్వారా వీక్షించిన ప్రజలు.. జగన్ పరామర్శకు వెళ్లావా.. రాజకీయ యాత్రకు వెళ్లావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.