కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తానంటూ జగన్ పిటిషన్!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మళ్లీ మొదటికి వచ్చారు.  కోర్టుకు ఆదేశాలను ధిక్కరిస్తానంటూ ఏకంగా కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల లండన్ పర్యటనకు  కోర్టు అనుమతి ఇచ్చిన సందర్భంగా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని షరతు విధించింది. అప్పుడు ఆ షరతుకు ఓకే అన్న జగన్.. ఇప్పుడు దానిని ఉల్లంఘించడానికి రెడీ అయిపోయి..

కోర్టు షరతును ఉల్లంఘిస్తాను అనుమతి ఇవ్వండి అంటూ హైదరాబాద్ సీబీఐ  కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో తాను కోర్టుకు హాజరు కాలేనని పేర్కొంటూ, ఒక వేళ ఆయన తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు అయితే.. అందుకు ప్రత్యేక మైన భద్రతా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందనీ, అది తనకు ఇష్టం లేదు కనుకనే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనీ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.   అయితే ఇక్కడ ఆయన ఎంత వితండ వాదం చేస్తున్నారంటే.. కోర్టుకు హాజరు కావడం అన్నది ఆయన ఇష్టాయిష్టాలకు సంబంధించిన విషయంగా చెబుతున్నారు. న్యాయవ్యవస్థ అంటే తనకు లెక్కలేదన్నట్లుగా ఆయన పిటిషన్ ఉంది. నిజంగా ఆయన కోర్టు హాజరు సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయాల్సి ఉంటే ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వ ఏర్పాట్ల విషయంలో ఆయన ఇష్టాయిష్టాలతో సంబంధం ఏముంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పుష్కరంపైగా బెయిలుపై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఆ బెయిలు షరతులను సైతం ఉల్లంఘిస్తుండటం పట్ల న్యాయ నిపుణులలో సైతం విస్మయం వ్యక్తం అవుతోంది. పైగా తాను హాజరు కాను కనుక అవసరం అనుకుంటే కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే హాజరౌతానంటూ ఆ పిటిషన్ లో కోర్టుకే బంపరాఫర్ ఇచ్చారు.  ఇక్కడే న్యాయనిపుణులు ఆయన పరామర్శల పేరిట దర్జాగా రాజకీయయాత్రలు చేస్తున్నప్పుడు అడ్డు రాని భద్రత.. కోర్టుకు హాజరు కావడానికే అడ్డువచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu