అమ్మో జ‌గ‌న‌న్నో!.. కొత్త జిల్లాల వెనుక ఇంత స్కెచ్ ఉందా?

అయ్యేది కాదు.. పొయ్యేది కాదు, అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేనే తుట్టెను కదిల్చింది. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయకపొతే కొంపలేవో మునిగి పోతునట్లు, ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆగమేఘాల మీద  ‘ఆన్లైన్’ లో ఆమోదం తెలిపింది. అయితే, ఇది అయ్యేది కాదు. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా గణనకు 2020 జనవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు గ్రామాలు, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదంటూ ఫ్రీజింగ్‌ (నిషేధ) ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్రం జరీ చేసినప్రీజింగ్ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కూడా ‘ఫ్రీజింగ్’ మోమో జారీ చేసింది. దీంతోనే జిల్లాల ఏర్పాటు ప్రక్రి య అధికారికంగా నిలిచిపోయింది. 

అంటే దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు  కొత్త జిల్లల ఏర్పాటు కుదిరే పని కాదు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన గారి 40 మంది సలహాదారులకు తెలియదా? ఈ మేరకు కేబినెట్‌ నోట్‌’ను ఆన్లైన్’లో  సర్క్యులేట్ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు తెలియదా, ఆన్లైన్’లోనే ఆమోదం తెలిపిన మంత్రులకు తెలియదా అంటే అందరికీ తెలుసు. నిజానికి, ఇది కొత్త ట్రిక్ కాదు, గతంలోనూ ప్రయోగించి ఫెయిల్ అయిన పాత ట్రిక్కునే ప్రభుత్వం మళ్ళీ మరో మరో పైకి తీసింది. 

నిజానికి, గతంలోనూ అప్పటి చిక్కులోంచి బయటపడేందుకు, ప్రజలదృష్టిని రియల్ ఇష్యూస్ నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఇదే ట్రిక్ ప్లే చేసింది. ఇటీవల రాష్ట్రంలోని అనేక ప్రాంతలను వరదలు ముంచెత్తిన సమయంలో ముఖ్యమంత్రి ప్యాలెస్ గడప దాటలేదు. ప్రజలను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి తీరును విపక్షాలు విమర్శించాయి. రోమ్ చక్రవర్తి ఫిడేలు రాగాలను గుర్తు చేసి దెప్పి పొడిచాయి. బాధిత ప్రజలు ఆందోళన వ్యక్తపరిచారు. ఆ సమయంలో అమరావతిలో జరిగిన ఎంపీల సమావేశంలో, ముఖ్యమంత్రి ‘కొత్తజిల్లాల అంశాన్ని ప్రస్తావించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు. ఆ తర్వాత ఆ విషయం మరిచి పోయారు. అంతకు ముందు పంచాయతీ ఎన్నికల సమయంలోనూ కొత్త జిల్లాల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అయితే, అప్పటి ఎన్నికల అధికారి రమేశ్‌ కుమార్‌ ‘సెన్సస్‌’ డైరెక్టర్‌ ఇచ్చిన ఫ్రీజింగ్‌ ఉత్తర్వులు ఉండగా, ఎన్నికల సమయంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేయడానికి వీల్లేదని అప్పటి సీఎ్‌సకు లేఖరాశారు. దీంతో ఆ ప్రక్రియను ఆపేశారు. ఫ్రీజింగ్‌ ఉత్తర్వులను ఇప్పటికీ కేంద్రం వెనక్కి తీసుకోలేదు. కరోనా కారణంగా జన గణన పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఇప్పట్లో అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

అయినా ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని ఇప్పుడు ఎందుకు తెర మీదకు, తెచ్చింది? ఇదేమీ వెయ్యి డాలర్ల ప్రశ్న కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ దిక్కు చూసినా అష్టమ దిక్కే కనిస్తోంది. ఓ వంక, ఉద్యోగులు,ఉపాధ్యాయులు రోడ్లెక్కేందుకు సిద్ధమయ్యారు. పీఆర్సీ విషయంలో అన్యాయం జరిగిందని ఆగ్రహంతో ఉన్నారు. సమ్మె నోటీసు ఇచ్చారు. అయినా, ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, ఉద్యోగుల డిమాండ్స్ ఆమోదిస్తే, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పి, ఉద్యోగులను బూచిగా చూపించి ప్రజలను రెచ్చ గొట్టే ప్రయత్నం ప్రభుత్వం, అధికార పార్టీ చేశాయి. అయితే, తాతకు దగ్గులు నేర్పడం కుదిరే వ్యవహారం కాదని గుర్తు చేస్తూ ఉద్యోగులు, మాకసలు పీఆర్సీనే వద్దు,జీతం ఒక్క రూపాయి పెంచనూ వద్దు, పీఆర్సీ ఇస్తామంటున్న పది వేల కోట్ల రూపాయలను కూడా పేద ప్రజల సంక్షేమానికే ఖర్చు చేయండి, మాకు పాత జీతాలే ఇవ్వండి, అనే సరికి సర్కార్ పని కుడితిలో పడిన ఎలుకల మారింది. ఉద్యోగులను మోసం చేద్దామనుకుంటే అసలుకే మోసం వచ్చిందని అధికార పార్టీ అసంతృప్తులు అంటున్నారు.  

మరో వంక గుడివాడ కాసినో వివాదం ముదిరి పాకన పడుతోంది. మంత్రి కొడాలి నానీ, పూటకో అడుగు పక్కకు వేస్తున్నారు. ప్రభుత్వం మెడకు గుదిబండగా మారుతున్నారు, అనే మాట వినవస్తోంది. కాసినో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. నానీ, గత ‘చరిత్ర; చిట్టా  మొత్తం బయటకు వస్తోంది. ఇంత కాలం అంతగా వినిపించని ఆయన భూకబ్జాలు,అవినీతికి   సంబందించిన అనేక ఆరోపణలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇవిగాక ఇంకా గా  నిగూడంగా ఉన్న చిక్కు ముళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని మరో మారు తెరమీదకు తెచ్చింది. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గానీ, మరొకరు కానీ, ‘చీటింగ్ ఈజ్ ది సీక్రెట్ అఫ్ మై సక్సెస్’ అనుకుంటే అన్ని సందర్భాలో అది సాధ్యం కాదు. ఇప్పుడు, ఇది కూడా అంతే .. అంటున్నారు.