జగన్ మోహన్ రెడ్డికి కొత్త సమస్యలు

 

ఉస్మానియా ఆసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంటే, అతనికి మరికొన్ని కొత్త కష్టాలుకూడా ఎదురవుతున్నాయి. తన భార్య భారతిని, తల్లి విజయమ్మను ఆసుపత్రిలో తనకు సహాయంగా ఉంచాలని కోరుతూ అతను సీబీఐ కోర్టుకి పెట్టుకొన్న విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. అతనిని కలవాలని వచ్చిన అతని భార్య భారతిని పోలీసులు లోనకి అనుమతించక పోవడంతో, ఆమె చాలా ఆందోళనకు గురయ్యారు. ఇక, జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని వస్తున్న వార్తలతో ఆసుపత్రి వద్దకు చేరిన వైకాపా కార్యకర్తలు, నేతలు కూడా చాల ఆందోళనతో, ఆవేశంతో ఉన్నారు.

 

వీటికి తోడు, జగన్ మోహన్ రెడ్డి తెలంగాణాను వ్యతిరేఖిస్తూ నిరాహార దీక్ష చేస్తున్నాడనే ఆగ్రహంతో ఉన్న తెలంగాణావాదులు అతనికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స చేయడానికి తాము అంగీకరించమని, అతనిని వెంటనే వేరే ఆసుపత్రికి తరలించాలని కోరుతూ ఆసుపత్రి ముందు ధర్నాలకు సిద్దపడుతుండటంతో, ఆసుపత్రి వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారింది.

 

బహుశః వైద్యులు కూడా వారి ఒత్తిళ్లకు లొంగినందునో ఏమో తమ ఆసుపత్రిలో అతనికి వైద్యం చేసేందుకు తగిన వైద్య పరికరాలు లేని కారణంగా అతనిని నీమ్స్ ఆసుపత్రికి తరలించడం మేలని వైద్యులు సూచించడంతో, పోలీసులు అతనిని మరికొంత సేపటిలో నీమ్స్ తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కానీ నీమ్స్ ఆసుపత్రి వద్ద కూడా అతనికి అదే పరిస్థితి ఎదురయితే అప్పుడు పోలీసులు ఏమి చేస్తారనేది మరో ప్రశ్న.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu