జనాలకు జగన్ మరో షాక్.. ఈ బాదుడు మాములుగా లేదుగా! 

ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మరో బాదుడుకు రంగం సిద్ధమవుతోంది.  పాత వాహనాలపై గ్రీన్‌ట్యాక్స్‌ విధించాలని అధికారులు  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రవాణా వాహనాలు ఏడేళ్లు దాటితే రూ.4వేలు, పదేళ్లు దాటితే రూ.5వేలు, పన్నెండేళ్లు దాటితే రూ.6వేలు చొప్పున గ్రీన్‌ట్యాక్స్ వసూలు చేస్తారు. మోటార్ సైకిల్ పదిహేనేళ్లు దాటితే రూ.2వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.5వేలు, కార్లు, జీపులు పదిహేనేళ్లు దాటితే రూ.5వేలు, ఇరవై ఏళ్లు దాటితే రూ.10వేల చొప్పున పన్నులను వేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం కోసం రవాణాశాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. హరిత పన్నును రద్దు చేయాలని రవాణా రంగం ప్రతినిధులు కోరుతున్నారు.  

ఖజానా ఖాళీ కావడంతో ఎక్కడెక్కడ పన్నులు వేయాలా అని ఆలోచిస్తున్న జగన్ సర్కార్ .. రవాణాశాఖ అధికారుల ప్రతిపాదనలను వెంటనే ఆమోదించే అవకాశాలున్నాయి. కొన్ని రోజులుగా జనాలపై భారాలు మోపుతూనే ఉంది వైసీపీ ప్రభుత్వం. ఇంటి పన్నులు పెంచింది. చెత్తకు పన్ను వసూల్ చేస్తోంది. లిక్కర్ పైనా ట్యాక్సులు పెంచుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. దేశంలో పెట్రోల్, డీజిల్ రేటు ఎక్కువగా ఉన్న టాప్ రాష్ట్రాల్లో ఏపీ ఉంది. 

ఇటీవల ఎక్సైజ్ ట్యాక్ తగ్గించిన కేంద్రం.. రాష్ట్రాలు తమ పరిధిలోని వ్యాట్ తగ్గించాలని సూచించింది. కేంద్రం సూచనతో బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై కొంత వ్యాట్ తగ్గించాయి. కాని జగనన్న సర్కార్ మాత్రం పైసా కూడా తగ్గించలేదు. తాజాగా గ్రీన్ ట్యాక్స్ విధించాలని చూస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. చమురు ధరలతోనే తమకు చుక్కలు కనిపిస్తున్నాయి.. ఇంకా గ్రీన్ ట్యాక్స్ తో మరింత భారం పడుుతుందని గగ్గోలు పడుతున్నారు.