సీబీ‘ఐ‘ కన్ను కొడుతుందా? జగన్ టీమ్ లో కలవరమేనా? 

భీకరంగా యుద్ధం జరుగుతుంటే.. ఉన్న సేనాధిపతిని వెనక్కు రమ్మని..ఆ ప్లేసులో మరో కొత్తవారిని పంపిస్తే ఆ యుద్ధం పరిస్దితి ఎలా ఉంటుంది? బ్యాంకు రాబరీ జరిగి.. దొంగలు సొమ్ముతో పరార్ అవుతుంటే.. పట్టుకోవాల్సిన పోలీస్ ఆఫీసర్ తనకు జ్వరం వచ్చిందని సెలవు పెడితే ఎలా ఉంటుంది? వివేకా హత్య కేసులో సీబీఐ ఆఫీసర్ ని కీలక సమయంలో బదిలీ చేస్తే...అలాగే ఉంటుంది. జగన్ బెయిల్ రద్దు చేయమని రఘురామ పిటిషన్ పై సీబీఐ కోర్టు డెడ్ లైన్ పెట్టినా గడువు అడిగి మరీ 26న అఫిడవిట్ ఫైల్ చేస్తామని చెప్పి.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి జ్వరం వచ్చిందని మళ్లీ వాయిదా వేయమని అడిగితే అలాగే ఉంటుంది.సీబీఐలోని ’ఐ‘ కి తేడా వచ్చినట్లుంది. ఆ కన్ను మూసుకుపోయిందా లేక కండ్లకలక వచ్చిందా..లేక కన్నుకొడుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. 

11 ఛార్జిషీట్లు ఒక ఎత్తయితే... ఇప్పుడు సీబీఐ విచారణ చేస్తున్న వివేకా హత్య కేసు, జగన్ బెయిల్ రద్దు చేయమని రఘురామ వేసిన పిటిషన్ ఈ రెండూ మరో ఎత్తయ్యాయి. ఎందుకంటే వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని.. అక్కర్లేదని..ఆపాలని తెగ ప్రయత్నించినా..చెల్లి సునీత పట్టుదలతో సీబీఐ విచారణ తప్పలేదు. మరి అందులో ఏ నిజాలు బయటపడతాయని అంతగా భయపడ్డారో తెలియదు గాని.. ఇప్పుడు మరింత భయపడుతున్నారని అందరూ అనుకున్నారు. క్లైమాక్స్ కొచ్చిందిలే అనుకుంటున్న సమయంలో జరుగుతున్న ట్విస్టులు.. అనుమానాలు పెంచేస్తున్నాయి.. అసలు వారిని తప్పించి కొసరువారిని ఇరికించి.. పెద్దలకు రిలాక్సేషన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా అనే డౌట్ వచ్చేస్తోంది.

సీబీఐ తరపున ఈ విచారణ చూస్తున్న అధికారి సుధాసింగ్ ని బదిలీ చేసేశారు. ఎంతలా అంటే ఆమెకు కనీసం తెలియను కూడా తెలియదు. మేడమ్ వాచ్ మెన్ రంగయ్య సాక్ష్యం నమోదు చేయించే పనిలో బిజీగా ఉండగా.. పై నుంచి ఈ ఉత్తర్వులు వదిలారు. అంటే ఆ అధికారి పైవాళ్లు చెప్పిన మాట వినలేదా.. లేక ఇక్కడ నుంచి విన్నపాలు అందుకుని.. అసలు వ్యక్తులను బయటపడేయాలనుకుంటుందా అనే కామెంట్లు వినపడుతున్నాయి. మరి కొత్త ఆఫీసర్ రామ్ కుమార్ ఏం చేస్తారో చూడాలి.

ఇక రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణ చివరికి వచ్చేసింది.అసలు 26వ తేదీ అటో ఇటో తేలిపోతుందనుకున్నారు. ముందు మీ ఇష్టం మీరే నిర్ణయం తీసుకోండని ధర్మాసనానికి చెప్పిన సీబీఐ మళ్లీ మనసు మార్చుకుని రాతపూర్వకంగా అపిడవిట్ ఫైల్ చేస్తామని చెప్పింది.  చెప్పి గడువు అడిగింది. తీరా ఆ గడువు అయిపోయాక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి జ్వరమొచ్చింది కాబట్టి మళ్లీ టైమ్ అడిగితే 30వ తేదీకి వాయిదా వేశారు. ఇక్కడ కూడా సీబీఐ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. వారు జగన్ బెయిల్ రద్దు చేయొద్దని రాసివ్వలేరు.. రఘురామ లేవనెత్తిన పాయింట్లు కరెక్ట్ కాదని కూడా చెప్పలేదు.. అలా అని బెయిల్ రద్దు చేయమని కూడా రాసివ్వలేకపోతుందా? అందుకే వాయిదాలు కోరుతుందా? లేక పై స్థాయిలో నెగోషియేషన్స్ నడుస్తున్నాయా? అవి తేలేవరకు సీబీఐ నివేదిక ఇవ్వదా అనే కామెంట్లు వినపడుతున్నాయి. ఏమైనా సీబీఐ అనేది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఎవరుంటే వారి మాటలు వినే తొత్తు సంస్థగా మారిపోయిందని..స్వతంత్రత కోల్పోయిందనే విమర్శలు పెరుగుతున్నాయి.