దావోస్ లో జగన్, కేటీఆర్ ఏమి చర్చించారు?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్  ఇద్దరూ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్’లో ఉన్నారు. అక్కడే ఆ ఇద్దరూ ప్రత్యేకంగా సమావేసమయ్యారు. ఇరుగు పొరుగు రాష్టాలకు చెందిన ఇద్దరు ముఖ్యనాయకులు మరో దేశంలో కలిసి నప్పుడు కలిసి మాట్లాడుకోవడం, ఒకరిని ఒకరు ఆత్మీయంగా పలకరించుకోవడం పెద్దగా చెప్పుకోవలాసిన విషయం కాదు. అందులో విశేషం లేక పోవచ్చును.కానీ,వుందని అంటున్నారు. 
ఎందుకంటే, ఈ మధ్య కాలంలో, ఈ మధ్య  కాలమని ఏముంది లెండి, మొదటి నుంచి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య గొప్ప సయోధ్య ఎప్పుడూ లేదు. స్నేహ, దాయాది బంధం అంతగా లేదు, ప్రస్తుతం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల నాయకుల మధ్య  మాటల యుద్ధం నడుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్’ను చులకన చేసి మాట్లాడడం తెలంగాణ మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలకు అలవాటుగా మారి పోయింది. 

ముఖ్యంగా మంత్రి కేటీఆర్’  ఈ మధ్యనే  ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థతి అద్వాన్నంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో రోడ్లు లేవు, విద్యుత్ లేదు, మౌలిక సదుపాలు అసలే లేవని, ఎవరో మిత్రుడు చెప్పినట్లు చెప్పి, పొరుగు రాష్ట్రాన్ని చులకన చేశారు. అఫ్కోర్స్, ఏపీలో పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నమాట నిజం. అందులో రెండో అభిప్రాయానికి తావులేవు. అయితే, తెలంగాణలో పరిస్థితులు అంతకంటే గొప్పగా ఉన్నాయా అంటే, లేదు. సరే అది వేరే విషయం ...కేటీఆర్  నోరు జారి నాలుక కరుచుకున్నారు.  సారీ చెప్పారు. 

అయితే, ఇప్పుడు దావోస్’లో ఆ ఇద్దరూ యాదృచ్చికంగా కలిశారా, ముందుగా అనుకునే కలుసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, రాజకీయ వ్యూహంలో భాగంగా ఒకరిపై ఒకరు కాసింత ఘాటు విమర్శలు చేసుకున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, అధికార తెరాస, వైసీపీ పార్టీల మధ్య రాజకీయ సంబంధాలు, ఇచ్చి పుచ్చుకోవడాలు సజావుగానే సాగుతున్నాయని, రెండు పార్టీలలో ఎప్పటి నుంచో వినవస్తోంది.  రాజకీయ ఉమ్మడి వ్యూహంలో భాగంగానే ఇద్దరు ముఖ్యమంత్రులు  ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే, దావోస్’లో కేటీఆర్, జగన్ రెడ్డి కులుసు కోవడం రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి, ఆ ఇద్దరు ముఖ్య నాయకులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనుసరించ వలసిన ఉమ్మడి ఎన్నికల వ్యూహం పైనే చర్చించారని రాజకీయ వరగాల్లో చర్చ జరుగుతోంది.

ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు  వారిపై ఉన్న కేసులను తిరగ దోడడం మొదలు, ఆ ఇద్దరి ఆర్థిక ములాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యూహరచన చేశారని తెలుస్తోంది. అందుకే కేటీఆర్, కావాలనే జగన్ రెడ్డి తో సమావేశం ‘గొప్పగా’ జరిగిందని ట్వీట్’ చేశారు. ఆ ఇద్దరి మధ్య యాదృచ్చికంగా సమావేశం జరిగుంటే, కేటీఆర్ ట్వీట్ చేయవలసిన అవసం లేదు, చేసినా, “నా సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి  జగన్ రెడ్డితో సమావేశం గొప్పగా జరిగింది”, అని అంత గొప్పగా, విశేషణాలను చేరుస్తూ, ఫోటోలు జత చేసి మరీ ట్వీట్  చేయవలసిన అవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. 

అదలా ఉంటే, ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు, గౌరం తెచ్చిన నేపధ్యంలో రాష్ట్ర విభజన తర్వాత కూడా, చంద్రబాబు సృష్టించిన బ్రాండ్ ఇమేజ్’తో హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. అదే విధంగా రాష్ట్ర విభజన అనంతరం తొలి ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఎన్నో దేశాలు తిరిగి పెట్టుబడులు ఆకర్షించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించారు. ఫలితంగా, ఇంతవరకు ఉభయ తెలుగు రాష్ట్రాలు విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ముందువరసలో నిలిచాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

 కేంద్ర పారిశ్రామిక అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం తాజా నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,37,188 కోట్ల  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే అందులో 37.46 శాతం ( రూ.37,188 కోట్లు)తో కర్ణాటక ప్రధమ స్థానంలో వుంది. అలాగే, 26.78 శాతం (రూ.64.24 కోట్లు) తో మహా రాష్ట్ర రెండవ స్థానంలో వుంది. గత సంవత్సరం వరకు టాప్ 10 స్టేట్స్’లో ఉన్న ఏపీ, తెలంగాణ ఈ సంవత్సరం ఆ స్థానాన్ని కోల్పోయాయి. ఈ సంవత్సరం తెలంగాణ 2.73 శాతం  (రూ.11,965 కోట్లు)తో దక్షిణాది రాష్టాలో కర్ణాటక, తమిళనాడు తర్వాత మూడవ స్థానానికి దిగజారింది,. ఆంధ్రప్రదేశ్ 0.38 శాతం ( రూ.1.682 కోట్లు) తో మరింత కింది జారిపోయింది.  అవును మరి అంతర్జాతీయ వాణిజ్య సదస్సులోనూ రాజకీయ ప్రత్యర్ధులను ఓడించే ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తూ, రాజకీయాలే సర్వస్వం అనుకుంటే పెట్టుబడులు రావు సరికదా, వచ్చినవీ వెనక్కి పోతాయి,.ఇప్పుడు ఉభే తెలుగు రాష్ట్రాలలో అదే జరుగుతోంది.