సమైక్య కాదు.. రాజకీయ శంఖారావం!

 

జగన్ శనివారం హైదరాబాద్‌లో పెట్టిన సభకు ‘సమైక్య శంఖారావం’ అని కాకుండా ‘రాజకీయ శంఖారావం’ అని పెడితే కరెక్ట్‌గా సూటయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ సభని నిర్వహిస్తున్నామని చెబుతూ వచ్చిన వైకాపా అసలు ఉద్దేశాలు జగన్ మాట్లాడిన మాటల్లో బయటపడ్డాయి. జగన్ మాట్లాడిన మాటలన్నీ తనకున్న రాజకీయ ఉద్దేశాలను బయటపెట్టే విధంగా వున్నాయే తప్ప జగన్ సమైక్యవాదం కోసం పాటుపడతాడన్న నమ్మకం కాస్తంత కూడా ప్రజల్లో కలిగించలేకపోయాయి.

 

రాష్ట్రంలో తన పార్టీ మనుగడకి ప్రధాన అడ్డంకిగా వున్న తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయడానికే జగన్ తన ప్రసంగంలో సగం సమయాన్ని కేటాయించాడు. శంఖారావంలో జగన్ మాటలు వింటే చంద్రబాబు అంటే జగన్ ఎంత భయపడుతున్నాడో అర్థమవుతోంది. అసలు ఈ రాష్ట్రంలో విభజన చిచ్చు రేపి, తెలుగుజాతిని నిట్టనిలువుగా చీల్చే ప్రయత్నాలకు బీజం వేసింది కేసీఆర్. తెలుగుజాతి సమైక్యతకు భంగం కలిగించిన ప్రధాన వ్యక్తి కేసీఆర్‌ని సమైక్య శంఖారావ సభలో జగన్ పల్లెత్తు మాట కూడా అనకపోవడం వారిమధ్య కుదిరిన విభజన ఒప్పందానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

టీఆర్ఎస్‌తో ‘‘నువ్వక్కడ-నేనిక్కడ-మనిద్దరం సోనియాగాంధీ ఇంటి ముంగిట’’ అనే అవగాహనికి వచ్చిన జగన్‌కి ‘సమైక్యం’ అనే మాట మాట్లాడే హక్కు లేదన్న అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఎలక్షన్లలో ఎక్కువ సీట్లు సాధిస్తే తెలంగాణ వచ్చేస్తుందని తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్‌కి, ఎక్కువ పార్లమెంట్ సీట్లు సాధిస్తే కేంద్రంలో మన కనుస్నల్లో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే జగన్‌కి తేడా ఏమీ లేదంటున్నారు. ఈ ఇద్దరూ నడిపే రాజకీయాలు ఓట్లు, సీట్ల కోసమే తప్ప ప్రజల కోసం కాదనే వాస్తవం మరోసారి బయట పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

సమైక్య శంఖారావ సభ ద్వారా జగన్ తెలుగు జాతికి ‘‘నా పార్టీని 30 పార్లమెంటు సీట్లలో గెలిపించండి. ఆ సీట్లతో కేంద్రంతో బేరానికి దిగి నామీద వున్న కేసులన్నీ ఎత్తివేయించుకోవడానికి సహకరించండి’’ అనే సందేశాన్ని ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికలకు ముందే విభజన ప్రమాదం ముంచుకొస్తోంది మొర్రో అని జనం మొత్తుకుంటూ ఉంటే, ఆ విషయం పక్కనపెట్టి, విభజన తర్వాత జరిగే ఎన్నికలలో 30 పార్లమెంట్ సీట్లలో గెలిపించండని జగన్ జనాన్ని కోరడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu