జ‌గ‌న‌న్నా.. మ‌హిళ‌లూ మ‌నుషులే!.. పురుషులతో సమానులే!!

ఈ దుశ్శాస‌న‌, దుర్వినీతి లోకంలో... అంటూ ప్ర‌తిఘ‌ట‌న సినిమాలో పాట‌..విజ‌య‌శాంతి ఆవేశాన్ని, ఆవేదనను పెద్ద తెర‌ మీద చూసిన జనం కొంత‌మంది కొంగులు త‌డిపేరు, మ‌రికొంత‌మంది ఔరా అనుకున్నారు, ఇంకొంత మంది ఇది ఓవ‌రాక్ష‌నెహె! అన్నారు. కానీ అందులో స‌గం పైగా వాస్త‌వ‌మ‌న్న‌ది ఈ రోజుల్లో మ‌హిళ‌ల ప‌రిస్థితులపై ప‌రిశీల‌న చేసిన‌వారు అంటున్నారు. తెలుగువారు.. ఆస‌లా మాట‌కు వ‌స్తే భార‌త దేశంలో మ‌హిళల్ని ఎంతో గౌర‌విస్తారన్న‌ది విదేశీయుల మాట‌. అబ్బే అంత‌కాద‌ని అం టోంది ఆధునిక కాలం. 

అందుకు గొప్ప ఉదాహ‌ర‌ణ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్లో మహిళలపై జ‌రుగుతున్న దాడులు, హ‌త్యాకాండ‌ల జాబితా పెరుగు తూండ‌ట‌మే!  అస‌లు మ‌నం ఉన్న‌ది రాతియుగ‌మా, అత్యాధునిక కాల‌మా అన్న పెద్ద ప్ర‌శ్న అంద‌రం వేసుకోవాల్సివ‌స్తోంది. కాలంతోపాటు నీతి నియ‌మాలు మారుతూంటాయ‌న్న‌ది నిజ‌మా?  ఇటీవ‌లి ప‌రిస్థి తుల‌ను ప‌రిశీలిస్తే ప్ర‌తీ ఒక్క‌రూ నిజ‌మే అంటున్నారు. ప్ర‌తీ రోజు ఏదో ఒక ప్రాంతంలో మ‌హిళ‌ల మీద దాడి జ‌రుగుతూనే ఉన్న‌ది. పోలీసుల‌ను, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను తిట్టుకోవ‌డం త‌ప్ప ప్ర‌త్యేకించి జ‌రుగు తున్న న్యాయం మాత్రం శూన్యం. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇటీవ‌లి కాలంలో మ‌హిళ‌ల‌ప‌ట్ల అరాచ‌కాల జాబితాలో ఉన్న‌త స్థానంలో ఉన్న‌ద‌న్న‌ది మ‌హిళాలోకం ఆగ్ర‌హంతో అంటున్న మాట‌. ఎవ‌రు ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు, బ‌య‌టికి  వెళ్లిన  పిల్ల ఇంటి గుమ్మంలో క‌నిపించేవ‌ర‌కూ త‌ల్లి ఆకాశంమంతగా ఎదురుచూపుతో నిల‌బ‌డే ఉండ‌డం, భ‌యం భ‌యంగా తండ్రి  రోడ్ల‌న్నీ వెత‌క‌డం ... ఇది నిత్యం జ‌రుగుతున్న‌ది. 

చిత్ర‌మేమంటే, మహిళలపై జరిగిన దాదాపు అన్ని అత్యాచార,అఘాయిత్య ఘటనల్లోనూ వైసీపీ పార్టీకి సంబంధించిన‌వారే నిందితులుగా బ‌య‌ట ప‌డ‌టంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.  గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే ర‌క‌మైన దాడులు, హింస‌లు, హ‌త్య‌ల వెన‌క కూడా వైసీపీ వారి పాత్ర ఉంటోందన్నది మీడియా సాక్షిగా వెల్లవౌతున్న వాస్తవం. ప్ర‌భుత్వం, పోలీసు అధికారులు ఇటువంటి ఘటనలపై చర్యల సంగతి అటుంచి కనీసం కేసులు నమోదు చేయడానికి కూడా ముందుకు రాకపోవడం వైసీపీ అరాచక పాలనకు నిలువెత్తు నిదర్శనం. కంచే చేను మేస్తే అన్న సామెత  నిఖార్సుగా  ఇక్కడ స‌రిపోతోంది. ఎన్ని సాక్ష్యాలో మాయ‌మ‌వ‌డం, నిందితులు మ‌రింత బ‌రితెగించ‌డమూ నిత్యం చూస్తున్నాం, వింటు న్నాం.

వూరు ఏద‌యినా, ప్రాంతం ఏద‌యినా, రాష్ట్రంలో వైసీపీ కీచకుల అల‌జ‌డి, భ‌యోత్పాల సృష్టి మాత్రం ఆగ‌డం లేదు. ఆ మ‌ధ్య విశాఖ‌ప‌ట్నం పి.ఎం.పాలెం పోలీసు స్టేష‌న్‌లో ప‌ని చేయ‌డానికి ఒక మ‌హిళ‌ను పిలిచి  బూతులు తిట్టి అవ‌మానించిన ఎస్ ఐ మీద ఎలాంటి చ‌ర్యా తీసుకోలేద‌ని టిడిపి నేత అనంత ల‌క్ష్మి ఆరోపించారు. అసలు ఆ సంఘ‌ట‌న‌పై క‌మిష‌న‌ర్ కు ఫిర్యాదు చేసినా కూడా ఆయ‌న ప‌ట్టించు కోలేద‌న్నారు. అలాగే  వైసీపీలో కాల‌కేయులు త‌యార‌య్యా ర‌ని తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు అనిత ఆగ్ర‌హించారు. మ‌చిలీప‌ట్నం విఓఏ నాగ‌ల‌క్ష్మి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వ నిర్వాక మేన‌ని ఆరోపించారు. వైసీపీ నాయ‌కుడు గ‌రిక‌పాటి న‌రసింహారావు వేధింపుల కార‌ణంగా మాన‌సిక ఒత్తిడికి గుర‌యి ఆమె ఆత్మ‌హ‌త్య‌చేసుకుంద‌న్నారు. వైసీపీ మూడేళ్ల పాల‌న‌లో క‌నీసం 1500 మంది మ‌హిళ‌లు దాడుల‌కు, అత్యాచారాలకు గురై మానసిక ఒత్తిడితో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆమె అన్నారు. కానీ ఇంత దారుణాలు జ‌రుగుతున్నా, వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం నిమ్మ‌కు నీరెత్తి న‌ట్టు ఉండ‌టం,  చ‌ర్య‌లు తీసుకోవడం అనే మాటే ఎత్తక పోవడం  దారుణ‌మ‌న్న‌ది ప్ర‌జ‌లు గుర్తించారు. అస‌లు దాడులు, హింసా త్మ‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం వైసీపీ రాజ‌కీయ డీఎన్ఏలోనే ఉందనడానికి ఈ సంఘటనలే నిదర్శనమని ప‌రిశీల‌కులు అంటున్నారు. 
  
ఎన్నిక‌ల స‌మ‌యంలో సాధార‌ణంగా అన్ని ప్రాంతాల్లోనూ దాడులు, కొట్లాట‌లు,  అక్క‌డ‌క్క‌డా  ఒక‌టి రెండు హ‌త్య‌లు జ‌ర‌గ‌డం విన్నాం, చూస్తున్నాం గాని ఇటువంటి అరాచ‌క ప్ర‌భుత్వ పాల‌న‌, మ‌హిళ‌ల‌ను ప‌నిగ‌ట్టుకుని టార్గెట్ చేసి వేదించే పాల‌న ఎప్పుడూ ఎక్క‌డా లేద‌ని ప్ర‌తిప‌ప‌క్షం టీడీపి మండిప‌డు తోంది.   మ‌హిళ‌ల‌పై దాడులు, వేధింపులు, అత్యాచారాలు ఏకంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరిగిపోవ‌డ‌ం దారుణమ‌న్న‌ది ప్ర‌జాసంఘాల మాట‌.