తిరుపతిలో భారీగా దొంగ ఓటర్లు! రిగ్గింగ్ కు వైసీపీ ప్లాన్?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అధికార పార్టీ దౌర్జాన్యాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి భారీగా దొంగ ఓటర్లను తిరుపతికి తరలించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చిత్తూరు నుంచి బస్సులు, కార్లు, సుమోల్లో వేలాది మందిని అధికార పార్టీ నేతలు తరలించారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకుని.. రిగ్గింగ్ చేసుకోవాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఓ మంత్రికి చెందిన ఫంక్షన్ హాల్ దగ్గర ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ఓటర్లను దాచిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. స్థానిక టీడీపీ నేతలు పీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గరకు వెళ్లాలని చూసినా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు అక్కడే భైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దొంగ ఓట్లు వేయించేందుకే వైసీపీ నేతలు ఇతర ప్రాంతాల నుంచి జనాలకు తీసుకొచ్చారని మండిపడుతున్నారు. వాళ్లందరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలింగ్ కు ముందు 36 గంటల ముందు నుంచి బయటి వ్యక్తులు నియోజకవర్గంలో ఉండటానికి వీల్లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాని తిరుపతి పరిధిలో మాత్రం పోలింగ్ రోజునే వేలాది మంది బయటి ప్రాంత వ్యక్తులు తరలిరావడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.కొన్ని ప్రాంతాల్లో విపక్ష పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రాకుండా అడ్డుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

కడప రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల్లో ఉన్న వ్యక్తులు తిరుపతిలో హల్ చల్ చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ ఆరోపించారు. దొంగ ఓట్లతో పాటు రిగ్గింగ్ చేసుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.తిరుపతి ఉప ఎన్నికపై ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వైసీపీ అక్రమాలను అడ్డుకోవాలని ఆయన లేఖలో కోరారు. దొంగ ఓటర్లను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారని, వాళ్లందరిని వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.