రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల పై ట్రంప్ ప్రకటన నిజమేనా?
posted on Oct 22, 2025 5:01PM

అమెరికా అధ్యక్షుడు చేసే ప్రకటనలు చాల సార్లు ప్రపంచాన్ని అయోమయానికి గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ఆయన భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని పదే పదే చెప్పుకున్నారు. ఆయన అలా చెప్పుకున్న ప్రతి సారీ బారత్ ఖండిస్తూనే వచ్చింది. అయినా ట్రంప్ తన వైఖరి మార్చుకోలేదు. ఇప్పుడు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల విషయంలో కూడా ట్రంప్ అదే తీరున వ్యవహరిస్తున్నారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని ట్రంప్ గతంలో కూడా ప్రకటించారు. ఆ సందర్భంగా భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది కూడా, భారత్ వినియోగదారుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని చమురు ఎక్కడ నుంచి కొనుగోలు చేయాలన్నది పూర్తిగా తమ అభీష్టమనీ ఇండియా స్పష్టం చేసింది. అయినా కూడా ట్రంప్ మరో6సారి రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసేసుకుందని ఆయన ఏకపక్షంగా ప్రకటన చేసేశారు. ఇకపై భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కోనుగోలు చేయబోదని ట్రంప్ చెప్పేశారు. వైట్ హౌస్ లో దీపావళి వేడుకల సందర్భంగా ఆయనీ విషయం తెలిపారు. తాను భారత ప్రధాని నరేంద్రమోడీతో ఫోన్ లో సంభాషించాననీ, ఆ సందర్భంగా భారత్ నిర్ణయాన్ని మోడీ తనకు చెప్పారనీ ట్రంప్ అంటున్నారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇండియా నుంచి ఇంత వరకూ స్పందన రాలేదు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు భారత్, అమెరికాలు చిత్తశుద్ధితో కలిసి పని చేస్తున్నాయన్న ట్రంప్.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఇప్పటికే భారత్ చాలా వరకూ తగ్గించిందని.. ఈ తగ్గింపున భవిష్యత్ లోనూ కొనసాగిస్తుందని ట్రంప్ చెప్పారు.
ట్రంప్ భారత ప్రధాని మోడీకి ఫోన్ చేయడం వరకూ వాస్తవమే. ఎందుకంటే తనకు ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్ కు మోడీ బుధవారం (అక్టోబర్ 22) ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆ సందర్భంగా రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించడం లేదా నిలిపివేయడంపై మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో ట్రంప్ ప్రకటనలో విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి.