పార్లమెంట్ బాయ్‌కాట్ నెక్స్ట్.. రాజీనామాలేనా?

హుజూరాబాద్ ఓటమి తర్వాత, బీజేపీతో రాజకీయ ముప్పు తప్పదని నిర్ణయానికి వచ్చారో లేక ఇంకేదైనా కారణం వుందో ఏమో కానీ, తెరాస అధ్యక్షడు, ముఖ్యమంత్రి కేసీఆర్, ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని అస్త్రంగా చేసుకుని బీజేపీ టార్గెట్ కేంద్రంపై రాజకీయ యుద్దాన్ని ప్రకటించారు. అలాగే, ఇంతవరకు సమయానుకులంగా వ్యూహాన్ని మార్చుకుంటూ, విభిన్న రూపాల్లో  తెరాస నాయకత్వం యుద్దతంత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదటి రోజు నుంచే పార్లమెంట్ ఉభయ సభల్లో, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని తెరాస ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. 

అయితే కేంద్ర ఆహార శాఖ  మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ ఉభయ సభల్లో ఒకటికి రెండు సార్లు వివరంగా, విపులంగా సమాదానం  ఇచ్చారు.కానీ గోయల్ తెరాస సభ్యులు కోరుకున్నసమాధానం మాత్రం ఇవ్వలేదు. యాసంగి పంట విషయంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలతో సంప్రదించి ఒకే సారి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాదు  కేంద్ర గోయల్ తెలంగాణ ఎంపీలు ధాన్యం కొనుగోలు విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో కేంద్రం స్పష్టం చేయాలన్న తెరాస ఎంపీల ప్రశ్నకు సమాధానమిచ్చారు కేంద్రమంత్రి. వినియోగించే ధాన్యాన్నే కొనుగోలు చేస్తామన్న పీయూష్ గోయల్.. ఈ మేరకు సీఎం కేసీఆర్ తో కూడా మాట్లాడానని తెలిపారు. వానాకాలం పంట పూర్తిగా కొంటామని చెప్పారు. అయినా దీంతో కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, తెరాస ఎంపీలు శీతాకాల సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నామని తెరాస ఎంపీ కే.కేశవరావు ప్రకటించారు. ఈ సందర్భంగా కేకే చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి కేసేఆర్ కొత్తా ఆలోచనలకు అద్దం పడుతున్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి రాజకీయాలను మరోమారు ఉద్యమ పంథాలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే కేకే రాజీనామాల అంశాన్ని చూచాయగా చేశారని అంటున్నారు. ఏమైనా కేకే వ్యాఖ్యలు అనుమానాలకు ఆస్కారం కలిపిస్తున్నాయని అంటున్నారు.  

తెరాస ఆందోళనపై కేంద్రం స్పందించడం లేదని, కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా శీతాకాల సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నామని ఎంపీ కె.కేశవరావు స్పష్టం చేశారు. చట్టసభను బాయ్‌కాట్‌ చేయడం బాధకలిగించే విషయమేనని.. ఇలా చేయాలని ఎవరూ కోరుకోరని అన్నారు.అలాగే, 'కేంద్ర వైఖరి అర్థం చేసుకుని ప్రజా క్షేత్రంలోకి వెళ్లి పోరాడాలని నిర్ణయించుకున్నాం. రైతుల పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని మా పోరాటం కొనసాగుతుంది. తెరాస ప్రభుత్వం నూతన పంథాలో పోరాటం మొదలు పెడుతుంది” అన్నారు, అంతవరకు బానే వుంది, కానీ ఆవెంటనే కేకే, రైతుల కోసం రాజీనామా చేసే అంశాన్ని ఆలోచిస్తాం, అంటూ పేర్కొనారు. ఇలా కేకే తెరాస ప్రభుత్వం నూతన పంథాలో పోరాటం మొదలు పెడుతుందని,వెంటనే రాజీనామాల ప్రస్తావన తీసుకు రావడం, అలోచింప చేసే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

గతంలో ఉద్యమ సమయంలోనూ కేసీఆర్, ఉద్యమ వేడి తగ్గిన పలు సందర్భాలలో ప్రజా ప్రతినిధుల రాజీనామాలను రాజకీయ అస్త్రంగా ప్రయోగించారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో వీస్తున్న రాజకీయ ఎదురు గాలులను తట్టుకునేందుకు కేసీఆర్ మరోమారు రాజీనామా అస్త్రాన్ని బయటకు తీశారా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నాయి.