కౌశిక్ రెడ్డి మాయ చేశారా? మోసపోయారా? బ్లాక్ మెయిల్ చేశారా? 

పోనీ టైముకు గోలీలు ఇచ్చిండా... అంటే అదీ లేక పాయె. కారెక్కి పట్టుమని పక్షం రోజులు అయినా  కాకుండానే కౌశిక్ రెడీ ఎమ్మెల్సీ అయి కూర్చున్నారు. నిజంగా  కౌశిక రెడ్డి అదృష్టమే అదృష్టం. ఎప్పుడో ఎక్కడో ఏ నక్కతోకో  తొక్కే ఉంటారు. అందుకే ఒక్క పైసా ఖర్చు లేదు, చిటికెడు చెమటోడ్చింది లేదు.  అయినా ఆయనకు అతి చిన్నవయసులో పెద్దల సభలో సీటొచ్చింది. ఎమ్మెల్యే కాలేక ఎమ్మెల్సీ అయిన మహాజాతకుడు కౌశిక్ రెడ్డి. అయితే కేసీఆర్ అనే రాజకీయ మాత్రికుడి మాయాజాలంలో ఇలాంటివి క్వయిట్ కామన్ , అత్యంత సహజం అంటున్నారు ఆయనను చాలా దగ్గరగా చూసిన, చూస్తున్న సన్నిహితులు. అంతే కాదు, కేసీఆర్ పగ, ద్వేషం కంటే ప్రేమే ఎక్కువ ప్రమాడం అనే మాట కూడా వినవస్తోంది.  

కేసీఆర్ అవసరం అయితే కాళ్ళు, కాదంటే జుట్టు పట్టుకుంటారు. కాళ్ళు పట్టిన పెద్దాయన అవసరం తీరిపోతే.. అదే కాలితో ఒక్క తన్నుతన్ని తరిమేస్తారు. నరేంద్ర మొదలు ఈటల వరకు ఇలాంటి ఉదంతాలు అనేకం కనిపిస్తాయి. నిజానికి, ఇలా ఓడ మల్లయ్య బోడి మల్లయ థియరీ వంట పట్టించుకున్న నాయకులు ఇంకా చాలా మందే ఉంటారు. కానీ. ఈ విద్యలో కేసీఆర్ అందరికంటే మరో నాలుగాకులు ఎక్కువ చదివారు. అయితే, అదేమిటో గానీ, కౌశిక్ రెడ్డిలాంటి, బచ్చాలే కాదు,మాజీ పీసీసీ చీఫ్ డీఎస్, అంతటి ఉద్దండులు కూడా కేసీఆర్ మాయలోపడి మోసపోతూనే ఉన్నారు. చివరకు చాటుగా చింతించి చెంపలు వేసుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. 

కౌశిక్ రెడ్డి విషయాన్ని పక్కన పెట్టి, గతంలోకి   డీఎస్ వ్యధలోకి వెళితే ... దేశంలో కాంగ్రెస్ ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో, ప్రియర్ అప్పాయింట్మెంట్ లేకుండా 10 జనపథ్ (సోనియా గాంధీ నివాసం) లోకి వెళ్లి  సోనియా గాంధీని నేరుగా కలిసే అవకాశం, అర్హత ఉన్న కొద్ది మంది నాయకులో డీఎస్ ఒకరు.అంతటి ఉద్దండ నాయకుడు,జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం ఉన్న నాయకుడు. కేసీఆర్ బుట్టలో యిట్టె పడిపోయారు. కేసీఆర్ ఇంటి కొచ్చి పిలిచారని వెళ్లి కారెక్కి కూర్చున్నారు. కారులోనే కాదు, రాజ్యసభలో కూడా సీటీయడంతో అంతటి డీఎస్ కూడా కేసీఆర్ మాయవలలో పడిపోయారు. ఆ తర్వాత ఏమి జరిగిందో వేరే చెప్పనక్కరలేదు.ఇంటికొచ్చి కారెక్కించుకున్న అదే కేసీఆర్ అప్పాయింట్మెంట్ కోసం డీఎస్ గంటలు కాదు రోజుల తరబడి వెయిట్ చేసిన సందర్భాలున్నాయి. అప్పాయింట్మెంట్ ఉన్నా గంటలు గంటలు పడిగాపులు పడి అవమాన భారంతో క్రుంగిపోయిన సందర్భాలూ ఉన్నాయి.ఇక ప్రస్తుత పరిస్థితి అయితే చెప్పనే అక్కరలేదు.ఆయన తెరాసలో ఉన్నారో లేరో ఆయనకే తెలియదు. 

ఇక కౌశిక్ రెడ్డికి పట్టిన అదృష్టం గురించి సోషల్ మీడియాలో చాలా చిత్ర విచిత్ర  కామెంట్లు ట్రోల్ అవుతున్నాయి. సోషల్ మీడియా విషయాన్ని పక్కన పెడితే, తెరాస సీనియర్ నాయకులు అయితే, ఇది నిజమా, కలా... కేసీఆర్ మాయా అని విస్తుపోతున్నారు. రోజులు, వారాలు, నెలలు కాదు ఏళ్ల తరబడి ప్రగతి భవన్ గేటు పట్టుకుని వేళ్ళాడుతున్న తమకు దక్కని అవకాశం నిన్న గాక మొన్న వచ్చిన కౌశిక్ రెడ్డికి ఎలా దక్కిందని చాలా చాలా ఆశ్చర్య పోతున్నారు. కౌశిక్ రెడ్డిలో కేసీఆర్ ఏమి చూశారు? ఎందుకు, ఆయన్ని నెత్తికి ఎత్త్తుకున్నారు, అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. తెరాస మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ నాయకురాలు బొడిగె శోభ అన్నట్లుగా కౌశిక రెడ్డికి ఏదైనా ప్రత్యేక యోగ్యతా, అర్హత ఉందంటే, అది నిన్న మొన్నటిదాకా తెరాసని కేసీఆర్’ను తిట్టిపోయడం, మానుకోట రాళ్ల యుద్ధంలో  ఆంధ్రా పాలకుల పక్షాన నిలిచి, తెలంగాణ ఉద్యమ కార్యకర్తలఫై రాళ్ళు రువ్వడం, ఈ అర్హతలు చూసే కేసేఆర్, కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేశారా, అని అడుగుతున్నారు. కావచ్చు, అప్పట్లో తనను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన తలసాని, ఎర్రబెల్లి లాంటి ఏదరినో మంత్రులు చేసిన కేసీఆర్,  తెలంగాన ఉద్యమకారులను రాళ్ళతో కొట్టినందుకు కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉండవచ్చును. 

మరో వైపు కేసీఆర్ ను కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే టికెట్ కోసం బ్లాక్మెయిల్  చేశారని,  2018 ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ తనతో కుదుర్చుకున్న ఒప్పందం, చేసిన ఆర్థిక సహాయం మొదలు ఇటీవల తెరాస ముఖ్యనేతలు తనతో జరిపిన రాయబేరాల వరకు అన్నిటినీ ఆడియో, వీడియో సాక్షాధారాలతో బయట పెడతానని బెదరించడం వల్లనే..  కేసీఆర్ తాత్కాలిక సంధిలో భాగంగా ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చి ఉంటారని కొందరు ఉహాగానం చేస్తున్నారు. అయితే అసలు నిజం ఏమిటి, అనేది ఇప్పుడే తేలదు. హుజురాబాద్ ఉప ఎన్నిక కథ ముగిసిన తర్వాతగానీ, కౌశిక్ రెడ్డి ఏ బ్రాండ్ తో  కేసీఆర్ ను ఇంప్రెస్స్ చేశారో తెలియదు అంటున్నారు. కౌశిక రెడ్డి బోడి మల్లయ్య కావడానికి అట్టే కాలం పట్టదని కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది. 

తెరాస నాయకులు అయితే ఈటల విషయంలో కేసీఆర్ తప్పు వెంట తప్పు చేస్తున్నారని, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెయ్యి అబద్ధాలు అడ వలసి వస్తుంది, అలాగే, కేసీఆర్, ఈటలను బర్తరఫ్ చేయడం అనే తొలితప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇంకా ఇంకా తప్పటడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఎన్నికలకు ముందే కేసీఆర్ తప్పుల లెక్క శిశుపాలుని నెంబర్ (101)కు చేరినా ఆశ్చర్య పోనవసరం లేదంటున్నారు. అయితే  ఎప్ప్పుడైనా కేసీఆర్ ను తక్కువగా అంచనా వేయడం తగదని, 101 తప్పులు చేసి కూడా తప్పించుకునే నేర్పు ఆయనకు ఉందని అంటున్నారు. ఎవరు ఏమన్నా, ఏమనక పోయినా  ఆయన మహామహా నాయకుల నుంచి మాములు జనం అందరినీ, విపక్షాల దృష్టిలో మోసం చేస్తూనే ఉన్నారు. గొర్రె కసి వాడినే నమ్ముతుందని ఊరికే అన్నారా...