బీజేపీ జెండా.. సొంత ఎజెండా!.. ఈట‌ల రూటే సెప‌రేటా?

జై ఈట‌ల‌.. జై జై ఈట‌ల‌.. నినాదాల‌తో హుజురాబాద్ మారుమోగిపోతోంది. నియోజ‌క‌వ‌ర్గ‌మంతా కాషాయ సంద‌డితో హోరెత్తిపోతోంది. హుజురాబాద్ అంతా ఈట‌ల అనుచ‌రుల హంగామా న‌డుస్తోంది. రాజేంద‌ర్ సైతం జోరు మీదున్నారు. ఆయ‌న వెంట బీజేపీ ద‌ళ‌మంతా ఉంది. కేసీఆర్‌పై ఒంటికాలిపై లేస్తున్నారు. ఘోరీ క‌డ‌తా బిడ్డా అంటూ ఖ‌త‌ర్నాక్ వార్నింగ్‌లు ఇస్తున్నారు. త‌న‌ స‌త్తా ఎంటో చూపిస్తానంటూ స‌వాల్ చేస్తున్నారు. ఈట‌ల‌ మాట‌ల‌కు ఈలలు.. కేక‌లు.. హుజురాబాద్‌లో ఇప్పుడంతా ధూం ధాం పాలిటిక్స్‌.. 

అంతా బాగుంది. ఈట‌ల హంగామా జ‌బ‌ర్ద‌స్త్‌గుంది. అయితే, కాషాయ జెండాలైతే క‌నిపిస్తున్నాయి కానీ, బీజేపీ ఊసే వినిపిస్త లేద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రోజంతా కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు.. ఈట‌ల‌పై ప్ర‌శంస‌లు.. ఇదే జ‌రుగుతోంది. కార్య‌క‌ర్త‌ల నోటి నుంచి జై ఈట‌ల‌.. జైజై ఈట‌ల.. ఇదే నినాదం. మ‌ధ్య మ‌ధ్య‌లో గుర్తొస్తే జై బీజేపీ స్లోగ‌న్‌. అంతే కానీ.. బీజేపీకి ఓటేయండి.. బీజేపీని ఆద‌రించండి.. బీజేపీని గెలిపించండి.. అనే డైలాగే రావ‌ట్లేద‌ని చెబుతున్నారు. ఈట‌ల చుట్టూనే రాజ‌కీయం న‌డుస్తోంది కానీ, అందులో బీజేపీ ప్రాధాన్య‌త అతి త‌క్కువ‌గా ఉంటోంద‌ని అంటున్నారు. ఈట‌ల‌ను గెలిపించండి.. కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి.. ఇదే ప్ర‌చార ఎజెండాగా ఉంటోంది. ఈట‌ల సంగ‌తి స‌రే.. మ‌రి బీజేపీ మాటేమిటి? మోదీ ప్ర‌స్తావ‌న ఏది? కేంద్ర ప‌థ‌కాల ఊసేది? అని అడుగుతున్నారు ఈట‌ల కోసం హుజురాబాద్‌లో మ‌కాం వేసిన క‌రుడుక‌ట్టిన‌ బీజేపీ శ్రేణులు.  

ఇలాంటి ప‌రిణామం ఇంత‌కు ముందెప్పుడూ చూడ‌లేద‌ని అంటున్నారు క‌మ‌ల‌నాథులు. బీజేపీ ఎప్పుడైనా పార్టీ సిద్ధాంతాలపైనే న‌డుస్తుంది. మోదీ వ‌చ్చిన‌ప్పటి నుంచీ సీన్ మారిపోయింది. మోదీ బొమ్మ‌తోనే, న‌మో నామ‌జ‌పంతోనే క‌మ‌ల‌నాథులు ఎన్నిక‌ల‌కు వెళుతున్నారు. అది కార్పొరేట‌ర్ ఎన్నికైనా స‌రే.. మోదీకే మీ ఓటు అన‌డం వారికి బాగా అల‌వాటైపోయింది. ఏ ప్ర‌సంగ‌మైనా జై శ్రీరాం నినాదంతోనే ముగియాలి. ఏ ఎల‌క్ష‌న్ అయినా.. కేంద్ర ప‌థ‌కాల‌ను ఏక‌రువు పెట్టాలి. నిధుల‌న్నీ కేంద్రమే ఇస్తోంది.. రాష్ట్రం గొప్ప‌లు పోతోంది అంటూ ఊద‌ర‌గొట్టాలి. ఇటీవ‌ల జ‌రిగిన దుబ్బాక‌, జీహెచ్ఎమ్‌సీ, నాగార్జున‌సాగ‌ర్ ఎన్నిక‌ల్లో అదే జ‌రిగింది. ఇక దుబ్బాక ఉప ఎన్నిక‌లోనైతే బీజేపీకి-టీఆర్ఎస్‌కి హోరాహోరీ స‌వాళ్లు-ప్ర‌తిస‌వాళ్లు న‌డిచాయి. కేంద్ర నిధుల‌పై పెద్ద ఎత్తున రాద్దాంత‌మే జ‌రిగింది. హుజురాబాద్‌లోనూ దుబ్బాక ఎపిసోడ్  రిపీట్ అవుతుంద‌ని అనుకున్నారంతా. కానీ, అక్క‌డ‌ జ‌రుగుతోంది వేరు. ఈట‌ల వ‌ర్సెస్ కేసీఆర్ న‌డుస్తోంది. ఎక్క‌డా బీజేపీ ప్ర‌స్తావ‌న రాక‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈట‌ల‌కు అన్యాయం జ‌రిగింది.. కేసీఆర్ అరాచ‌క‌వాది.. ఈట‌ల‌ను గెలిపించండి.. టీఆర్ఎస్‌ను ఓడించండి.. ఇదే ప్ర‌చారం. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈట‌ల ఎక్క‌డా కేసీఆర్ అవినీతిని కానీ, ప్ర‌భుత్వ లొసుగులు కానీ, అక్ర‌మాల చిట్టా కానీ బ‌య‌ట‌కు తీయ‌డం లేదు. ద‌శాబ్దాలుగా కేసీఆర్ వెంట ఉన్న ఈట‌ల‌కు అలాంటి విష‌యాలేమీ తెలీవ‌నుకోవాలా? లేక‌, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌యోగించ‌డానికి కావాల‌నే దాస్తున్నారా? మ‌రేదైనా కార‌ణ‌ముందా? అనే అనుమాన‌మూ వ‌స్తోంది. ఇలా, పైకి జెండా మాత్రం బీజేపీది.. ఎజెండా మాత్రం ఈట‌ల‌ది అనే విమ‌ర్శ మొద‌లైపోయింది. 

ఈట‌ల తీరుపై బీజేపీ పెద్ద‌లు అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. పార్టీ కంటే ఎవ‌రూ ఎక్కువ కాద‌ని అంటున్నారు. మోదీ ప్ర‌స్తావ‌న తేకుండా.. బీజేపీ నినాదాలు వినిపించ‌కుండా.. ఈట‌ల త‌న సొంత ఎజెండా అమ‌లు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. బీజేపీకి క‌మ‌లం గుర్తు.. మోదీ ఫోటో.. ఈ రెండే ముఖ్యం. ఎంత‌టి నాయ‌కుడైనా స‌రే.. ఈ రెండింటి ముందు డ‌మ్మీనే. అందుకే, వార్డు మెంబ‌ర్‌గా పోటీ చేసే వారు కూడా మోదీకే మీ ఓటు అని అడుగుతుంటారు. కిష‌న్‌రెడ్డి, కె.ల‌క్ష్మ‌ణ్‌, బండి సంజ‌య్‌లాంటి వాళ్లు సైతం ఏనాడు వారి సొంత‌ ప్ర‌స్తావ‌న చేయ‌కుండా.. బీజేపీ ఇమేజ్‌తోనే పాలిటిక్స్ చేస్తుంటారు. అలాంటిది.. నిన్న‌కాక మొన్న వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్‌.. బీజేపీ జెండా ప‌ట్టుకొని.. త‌న సొంత ఎజెండా అమ‌లు చేస్తున్నారంటూ క‌మ‌ల‌నాథులు కాక మీదున్నారు. ముందుముందు కూడా ఇలానే ఉంటే.. ఈట‌ల‌తో బీజేపీకి ఏం లాభం అన్న ప్ర‌శ్న త‌లెత్తుతుంద‌ని అంటున్నారు. అయితే, ఇప్పుడే బ‌య‌ట‌ప‌డిపోతే అది పార్టీకి న‌ష్టం చేస్తుంద‌ని.. ముందైతే ఈట‌ల‌ను గెల‌వ‌నిచ్చి.. ఆ త‌ర్వాత ఆయ‌న్ను పార్టీ లైన్‌లోకి తీసుకురావ‌చ్చ‌ని బీజేపీ పెద్ద‌ల అభిప్రాయంలా క‌నిపిస్తోంది. ఈట‌ల‌ ఇంకా బీజేపీ శైలి రాజ‌కీయానికి అల‌వాటుప‌డ‌లేద‌ని.. ముందుముందు అంతా స‌ర్దుకుంటుంద‌ని అంటున్నారు.