ఈట‌ల‌నే సీఎం కేండిడేట్‌? త్వ‌ర‌లోనే తెలంగాణ టూర్‌..

హుజురాబాద్ బైపోల్‌ 2023 అసెంబ్లీ ఎల‌క్ష‌న్స్‌కు రిహార్స‌ల్స్‌. హుజురాబాద్ ఎన్నికల త‌ర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించి బీజేపీని బ‌లోపేతం చేస్తా. కేసీఆర్ అహంకారానికి ప్ర‌జ‌లే ఘోరీ క‌డ‌తారు. ఇవీ కాషాయ కండువా క‌ప్పుకున్నాక తొలిసారి హుజురాబాద్ వ‌చ్చిన ఈట‌ల నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు. గ‌తవారం హుజురాబాద్ నుంచి వెళ్లేట‌ప్పుడు గుప్పెడు అనుచ‌రుల‌తో వెళ్లారు. బీజేపీలో చేరి తిరుగొచ్చేట‌ప్పుడు కాషాయ దండుతో క‌దిలొచ్చారు. ఈట‌ల వెనుక జ‌న ప్ర‌భంజ‌నం. ప‌దుల సంఖ్య‌లో కార్లు, వంద‌ల సంఖ్య‌లో బైకులు.. వేలాదిగా యువ‌కులు.. ఇప్పుడు ఈట‌ల ఓ వ్య‌క్తి కాదు.. కాషాయ శ‌క్తి.. కేసీఆర్‌పై పోరాడే యుక్తి.

ఈట‌ల హుజురాబాద్ ప‌ర్య‌ట‌న అనేక అంశాల్లో క్లారిటీ ఇచ్చేస్తోంది. రాజేంద‌ర్ వెంటే బీజేపీ నేత‌ల పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు, మండ‌లి మాజీఛైర్మ‌న్ స్వామిగౌడ్‌, బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు వివేక్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి.. ఇలా పెద్ద పెద్ద నేత‌లే ఈట‌ల వెంట ఉన్నారు. రేపేమాపో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ సైతం హుజురాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. 

వ‌చ్చిన జ‌నాన్ని, ల‌భించిన స్వాగ‌తాన్ని చూస్తే.. హుజురాబాద్‌లో ఈట‌ల స‌త్తా ఎంతో తేలిపోతుంది. ఆయ‌న ప‌ట్టు ఏమాత్రం స‌డ‌ల‌లేద‌ని తెలుస్తోంది. అధికార‌పార్టీ ఎంత‌గా బెదిరింపుల‌కు పాల్ప‌డినా.. జ‌నం జ‌న‌నేత వెంటే ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇదే ఇప్పుడు గులాబీ శిబిరంలో గుబులు రేపుతోంది. అభివృద్ధి ప‌నుల పేరుతో ఇప్ప‌టికే హుజురాబాద్‌లో 30 కోట్లు కుమ్మ‌రించినా.. ప్ర‌జ‌లకు క‌ళ్లెం వేయ‌లేక‌పోయారు. ఆర్థికంగా బాగా బ‌ల‌మున్న‌ ఈట‌ల సైతం అదే స్థాయిలో ఖ‌ర్చు చేస్తుండ‌టంతో పోటీ హోరాహోరీగా సాగుతోంది.

టీఆర్ఎస్ కోసం ఇప్ప‌టికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగి.. మండ‌లాల వారీగా బాధ్య‌త‌లు మీదేసుకుని ప‌ని చేసుకుపోతున్నారు. సొంత ఇలాఖాలో ఈట‌ల సింగిల్ హ్యాండ్‌గా న‌రుక్కొస్తున్నారు. భార్య జ‌మునారెడ్డి ఓవైపు, ఈట‌ల మ‌రోవైపు.. వారికి అండ‌గా అనుచ‌రులు, క‌మ‌ల‌నాథులు మోహ‌రించి కురుక్షేత్ర సంగ్రామానికి న‌గారా మోగించేశారు. 

జ‌స్ట్‌.. హుజురాబాద్‌తోనే ఆగేలా లేరు ఈట‌ల రాజేంద‌ర్‌. ఇదే ఊపుతో 2023లో కేసీఆర్‌ను గ‌ద్దె దించే వ‌ర‌కూ విశ్ర‌మించేది లేదంటున్నారు. ఇది అసెంబ్లీ పోరుకు రిహార్స‌ల్స్ అంటూ త్వ‌ర‌లోనే తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తానంటూ తొడ‌గొట్టారు ఈట‌ల రాజేంద‌ర్‌. ఆయ‌న మాట‌ల్లో అనేక మీనింగ్స్ తీస్తున్నారు విశ్లేష‌కులు. ఈట‌ల ఇప్పుడు స్వ‌తంత్రుడు కాదు. బీజేపీ స‌భ్యులు. ఓ పార్టీలో ఉన్న‌ప్పుడు పార్టీ లైన్ ప్ర‌కార‌మే న‌డుచుకోవాలి.. పార్టీ ఆదేశాల మేర‌కే ప‌ని చేయాలి.. పార్టీ అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను మాత్ర‌మే నెర‌వేర్చాలి.. సొంతంగా నిర్ణ‌యాలు తీసుకునేందుకు లేదు.. ఈట‌ల‌కు ఆ విష‌యం తెలియందీ కాదు.  మ‌రి, త్వ‌ర‌లోనే తాను తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించి బీజేపీని బ‌లోపేతం చేస్తాన‌నే మాట‌ల వెనుక మ‌ర్మ‌మేంట‌ని ఆరా తీస్తున్నారు. 

ఇప్ప‌టికే ఢిల్లీ పెద్ద‌ల‌తో సుదీర్ఘంగా మంత‌నాలు జ‌రిపిన ఈట‌ల‌కు ఆ మేర‌కు బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం నుంచి ఆదేశాలు అందాయా? అంటున్నారు. బీజేపీ హైక‌మాండ్ ఇషారాతోనే తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? అని అనుమానిస్తున్నారు. ఈట‌ల‌ను కేవ‌లం హుజురాబాద్ నేత‌గానే కాకుండా రాష్ట్ర స్థాయి లీడ‌ర్‌గా ప్ర‌మోష‌న్ ఇచ్చేసిన‌ట్టేనా? అంటే, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌తో స‌మాన స్థాయిని ఈట‌ల‌కు క‌ల్పించారా? 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇది రిహార్స‌ల్స్ అన్నారంటే.. ఆ అసెంబ్లీ సంగ్రామం సైతం ఈట‌ల నేతృత్వంలోనే సాగుతుంద‌ని సంకేతమా? ఆ లెక్క‌న‌.. బీజేపీ త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి కూడా ఈట‌ల రాజేంద‌రేనా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. బీజేపీ అధిష్టానం నుంచి వ‌చ్చిన హింట్‌తోనే ఈట‌ల అలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని.. రాబోయే కాలంలో క‌మ‌లం పార్టీకి కాబోయే కెప్టెన్ ఈట‌ల‌నే అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు. అందుకే ఆ జోరు.. ఆ హుషారు..