ముందస్తుకు మరో సంకేతం?.. కేసీఆర్ నోట దళిత బంధు మాట..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్’కు మళ్ళీ ఇన్నాళ్ళకు దళిత బంధు గుర్తుకు వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తెర మీదకు తెచ్చిన పథకాని, ఎన్నికలు అయిపోగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అటక ఎక్కించారు. ముందు 2021 నవంబర్ 4 వరకు ఎన్నికల కోడ్’ను అడ్డుపెట్టుకుని,ఆ తర్వాత ఏకారణం చెప్పకుండానే, ప్రభుత్వం దళిత బందు అమలును నిలిపేసింది. గడచిన రెండున్నర నెలలుగా, ప్రభుత్వ పెద్దలు  ఆ మాట తీయకుండా మౌనంగా ఉండిపోయారు. ప్రభుత్వం, అధికార పార్టీ మాత్రమే కాదు ప్రతిపక్షాలు కూడా ఎందుకనో గానీ ఆ ఊసే ఎత్తలేదు. 

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు 2021 నవంబర్ 2 న వచ్చాయి. నవంబర్ 4నుంచి హుజూరాబాద్’లోనే కాదు రాష్ట్రంలో ఎంపిక చేసిన నియోజక వర్గాలు / మండలాల్లో కూడా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి  చెప్పారు. డిసెంబర్‌లోపే హుజురాబాద్‌తో పాటు నాలుగు ఎంపిక చేసిన మండలాల్లో దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. మార్చిలోపు అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో వంద మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసి, ఒక్కొక్కరికీ పది లక్షల రూపాయలచొప్పున   ఇస్తామన్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత, కథ అడ్డం తిరిగిందనో, మరెందుకో కానీ, దళిత బందు విషయంలో సర్కార్ సైలెంట్ అయిపోయింది. అయినా విపక్షాలు పథకం ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. ఆందోళనలు చేస్తామని ప్రకటించిన హుజూరాబాద్’ లో గెలిచిన తెరాస రెబెల్ లీడర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా మౌనంగా ఉండిపోయారు. మీడియా, జనం కూడ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని కూడా దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమీ, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి అమలు కాని హామీల జాబితాలో చేర్చేశారు అనుకునంరో ఏమో కానీ, ఏక్కడా దళిత బంధు దగా ముచ్చట వినిపించలేదు.  

అయితే, అందరూ మరిచి పోయిన పథకాన్ని ముఖ్యంత్రి కేసీఆర్ ఇప్పుడు తెర మీదకు తెచ్చారు. పథకం అమలుకు సంబందింఛి జిల్లా కల్లెక్టర్లు, సంబందిత  అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ హడావిడి ఔఇతె మొదలైంది. ఇదే విషయంగా మంత్రి గంగుల అధికారాలతో   వర్చువల్’ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో యూనిట్‌కు 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయమని సీఎం కేసీఆర్‌ అధికారులను అదేశించారు.లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్‌నే ఎంపిక చేయాలన్నారు. ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు ఆమోదించాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్లు కేటాయించామని … ఈ నిధుల్లో ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు. మిగతా నిధులను విడతల వారీగా విడుదల చేస్తామని ప్రకటించారు. 

అయితే, అత్యంత బలమైన ఎన్నికల అస్త్రంగా భావించిన ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా, అంబుల  పోదిలోంచి ఈ అస్త్రాన్ని ఎందుకు పైకి తీశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళక తప్పని పరిస్థితి తరుముకోస్తోందా, ఆ ఆలోచనతోనే ముఖ్యమంత్రి ముందుగా దళిత బందు అస్త్రాన్ని సిద్దం చేసుకుంటున్నారా? లేక దళితబందు దగాకు 100 రోజులు పూర్తవుతున్న నేపధ్యంలో, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున  ఆందోళనకు సిద్డంవుతున్న సమాచారం అంది, ముందుగానే ముఖ్యమంత్రి మేలుకున్నారా? అంటే అదీ ఇదీ రెండూ కావచ్చని, అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో దళిత బందు పథకాన్ని అమలు చేయడం అయ్యే పని కాదని తెరాస నాయకులే అంటున్నారు. ఒక విధంగా ముఖ్యమంత్రి తేనేతుట్టను కదిలిస్తున్నారని, పార్టీ నాయకులు ప్రైవేటు టాక్ ‘లో ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.