దావోస్ లో జగన్ ఈగలు తోలుకుంటున్నారు.. తెలంగాణ మంత్రి పువ్వాడ సెటైర్లు

ఒక వైపు ఏపీ సీఎం జగన్ దావోస్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యి తమ మధ్య విభేదాలు లేవనీ, స్నేహం మాత్రమే ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తుంటే తెలంగాణ మంత్రులు మాత్రం ఏపీ సీఎం జగన్ పై సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలతో రెచ్చిపోతున్నారు. దావోస్ లో ఆయన ఈగలు తోలుకుంటున్నారంటూ జోకులు వేసుకుంటున్నారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేటీఆర్ దావోస్ పర్యటన వల్ల తెలంగాణకు పెట్టుబడుల వరద పోటెత్తుతోందని అన్నారు. అలా అని ఊరుకోకుండా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదనీ, దాంతో ఏపీ సీఎం దావోస్ లో ఈగలు తోలుకుంటూ కాలక్షేపం చేస్తున్నారనీ సెటైర్లు వేశారు.

పువ్వాడ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కేటీఆర్ కూడా ఏపీలో విద్యుత్, నీటి కోరత గురించీ, రోడ్ల అధ్వాన స్థితి గురించీ చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య దాదాపు చిచ్చు పెట్టినంత పని చేశాయి. ఏపీ మంత్రులు తెలంగాణ పరిస్థితులపై విమర్శలు చేశారు. అప్పట్లోనే ముందస్తు ఎన్నికల ప్రిపరేషన్ లో భాగమే ఈ డ్రామా అంటూ రాజకీయ పరిశీలకుల్లో టాక్ నడిచింది. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్యా సెంటిమెంట్ రెచ్చగొట్టి ఎన్నికలలో లబ్ధి పొందే వ్యూహంలో భాగమే కేటీఆర్ వ్యాఖ్యలన్న విశ్లేషణలూ వచ్చాయి.

ఆ తరువాత కేటీఆర్ తన మాటలను వెనక్కు తీసుకున్నారు. అది వేరే సంగతి. ఇప్పుడు దావోస్ లో ఇరువురూ భేటీ అయ్యారు. అపూర్వ సహోదరుల్లా అలింగనాలు చేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు.  ఆ ఫొటోలు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుండగానే తెలంగాణ మంత్రి జగన్ పై దారుణమైన సెటైర్లు వేశారు. ఆయన దావోస్ పర్యటన పెద్ద వైఫల్యంగా అభివర్ణించారు. పువ్వాడ చెప్పింది వాస్తవమే అయినా పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిపై అలాంటి వ్యాఖ్యలు ఆయనంతట ఆయన స్వయంగా, స్వచ్ఛందంగా చేసి ఉంటారా అన్నదే పరిశీలకుల సందేహం.

నిజమే దావోస్ ఆర్థిక సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. అసలెవరూ ఏపీ గ్యాలరీని సందర్శించడానికే రావడం లేదు. అక్కడ ఎలాంటి కార్యక్రమాలూ జరగడం లేదు. మరి వైసీపీ వాళ్లు సామాజిక మాధ్యమంలో చేస్తున్న పోస్టుల సంగతేమిటంటారా. జగన్ వెళ్లి కలిసి వారితో దిగిన ఫొటోలు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి కూడా ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నది ఏపీలో విపక్షాలు చేస్తున్న విమర్శలు. ఇప్పుడు పువ్వాడ వ్యాఖ్యలను బట్టి అది వాస్తవమేనని అర్ధమౌతుంది. వాస్తవమే అయినా పువ్వాడ వ్యాఖ్యల వెనుక టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారన్నది పరిశీలకుల విశ్లేషణ.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంగా టీఆర్ఎస్ తెలంగాణలో గట్టిపోటీని ఎదుర్కొంటుని భావిస్తున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉందనీ, తెలంగాణలో అభివృద్ధి పరుగులు తీస్తోందనీ చెప్పుకొనేందుకే టీఆర్ఎస్ పెద్దలు తమ నేతల చేత ఇటువంటి ప్రకటనలు చేయిస్తున్నారని అంటున్నారు.

 అదే సమయంలో ఈ వ్యాఖ్యలు ఏపీలో కూడా సెంటిమెంటును రెచ్చగొట్టి తమ ‘రాజకీయ మిత్రుడు’ జగన్ కు ఎన్నికలలో లబ్ధి చూకూరుతుందని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా వాస్తవం..వాస్తవమేననీ, అది స్వరాష్ట్రంలో విపక్షాలు చెప్పినా, పొరుగు రాష్ట్రంలోని అధికార పక్షం నేతలు చెప్పినా వాస్తవమే.  పొరుగు రాష్ట్రం వారు ఎత్తి చూపారని ఏపీలో తెలంగాణకు వ్యతిరేకంగా సెంటిమెంటు ప్రజ్వరిల్లి రాజకీయ లబ్ధి చేకూరుతుందని భావించడం భ్రమేనని పరిశీలకులు అంటున్నారు.