బందరు వైసీపీలో పీక్స్ కు వర్గ పోరు

బందర్ వైసీపీలో వర్గ పోరు పీక్స్ కు చేరింది. ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నానిల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోయేంత స్థాయిలో వైరం కొనసాగుతోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా పేర్ని నాని, బాలశౌరి తమ మధ్య విభేదాల్ని పబ్లిగ్గానే బయటపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బందరు పోర్టు పనుల విషయంలో కూడా ఇరువురూ పోటాపోటీగా పరస్పర  విరుద్ధ ప్రకటనలు చేశారు. పేర్ని నాని, బాలశౌరి మధ్య ఆధిపత్య పోరుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు   తీవ్ర అయోమయంలో, గందరగోళంలో పడిపోతున్నారు.

2022 డిసెంబర్ లోనే బందరు పోర్టు పనులు ప్రారంభం అవుతాయని స్థానిక ఎంపీ  బాలశౌరి గతంలో ప్రకటించారు. అయితే.. ఆ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా   పేర్ని నాని బుధవారం(నవంబర్ 30)న మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో పోర్టు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారన్నది ఆ ప్రకటన సారాంశం. డిసెంబర్ 21న మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన అని ఎంపీ బాలశౌరి ఎందుకు అన్నారో తనకు తెలియదని నాని ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో వారిరువురి మధ్యా పవర్ పొలిటికల్ వార్ ఏ రేంజ్ లో ఉందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం ఆమోదం లభించిందనే ఆనందంలో బాలశౌరి ఉబ్బితబ్బిబ్బై పోర్టు పనుల ప్రారంభం గురించి తొందరపడిన కోయిలలా ముందే చెప్పేవారంటూ  సెటైర్ వేయడం గమనించదగ్గ అంశం.

కొద్ది రోజుల క్రితం మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి పర్యటనను పేర్ని నాని ముఖ్య అనుచరుడైన కార్పొరేటర్ అస్ఘర్ అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇనకుదురుపేటలోని ముస్లిం శ్మశానవాటిక అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్థానికులు కోరడంతో అక్కడికి బాలశౌరి వెళ్లినప్పుడు.. తనకు చెప్పకుండా తన డివిజన్ లో ఎంపీ పర్యటించడం సరికాదని కార్పొరేటర్ అస్ఘర్ అడ్డుకునేందుకు యత్నించారు. బాలశౌరి వెనుదిరిగి వెళ్లిపోవాలంటూ తన అనుచరులను మోహరించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కార్పొరేటర్ అస్ఘర్.. పేర్ని నాని ముఖ్య అనుచరుడు కావడంతో ఆ ఆందోళన వెనుక పేర్ని నాని హస్తం ఉందని బాలశౌరి వర్గం అప్పట్లోనే విమర్శిలు చేసింది. ఆరోపణలు గుప్పించింది. 

ఎంపీ బాలశౌరి కూడా పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు. ప్రత్యర్థి పార్టీ టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో వారానికోసారైనా మాట్లాడకపోతే పేర్ని నానికి నిద్రపట్టదని బాలశౌరి దుమ్మెత్తి పోశారు. సొంత పార్టీ ఎంపీ అయిన తననే మచిలీపట్నం రానివ్వకుండా పేర్ని నాని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు నీ జాగీరా? అని పేర్ని నానిని బాలశౌరి నిలదీశారు. ఇకపై బందరులోనే ఉంటా.. ఎవరేం చేస్తారో చూస్తా, ఎంపీ అంటే ఏంటో తెలిసివచ్చేలా చేస్తా అంటూ బాలశౌరి నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.

ఒకప్పటి ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం బందరులో మ్యూజియం, ఆడిటోరియం నిర్మించేందుకు ఎంపీ బాలశౌరి ప్రయత్నించారు. అయితే.. ఆ రెండు పనులు జరిగితే బాలశౌరికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అనే భయంతో పేర్ని నాని అడ్డుపడ్డారనే ప్రచారం కూడా స్థానికంగా జరుగుతోంది.

జగన్ కు పెద్ద పాలేరునని స్వయంగా ప్రకటించుకున్నా తన మంత్రి పదవి ఊడిపోవడానికి కారణం ఎంపీ వల్లభనేని బాలశౌరి అనే డౌట్ పేర్ని నానికి ఉందంటారు. సొంత సామాజికవర్గాన్ని హేళన చేసినా నానికి మంత్రి పదవి నిలబడలేదు. పేర్ని నానిని   సొంత సామాజికవర్గం కూడా దగ్గరికి రానివ్వడం లేదు. ఇలా రెండు విధాలా తనను భ్రష్టుపట్టించింది బాలశౌరి అనే ఆగ్రహం పేర్ని నానికి ఉందంటారు. బాలశౌరికి సీఎం జగన్ తో వ్యాపార భాగస్వామ్యం ఉందని పేర్ని నానికి తెలుసు. అందుకే బహిరంగంగా ఆయనను విమర్శించరు కాని ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ గా బాలశౌరిని బందరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించరు. అసలు బందరులో బాలశౌరి కాలు పెట్టనివ్వకుండా వెనక నుంచి అంతా చక్కబెట్టేస్తుంటారని పార్టీ శ్రేణులే అంటుంటాయి.

వచ్చే ఎన్నికల్లో ఎంపీ బాలశౌరి బందరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే పేర్ని నానిని భయం వెంటాడుతోందని, ఆ క్రమంలోనే బాలశౌరికి వ్యతిరేకంగా నాని పావులు కదుపుతూనే.. మరో పక్కన ఎంపీకి వ్యతిరేకంగా స్థానికంగా ఆందోళనలు, ఆరోపణలు, విమర్శలు చేయిస్తున్నారని పార్టీ శ్రేణుల్లోనే ఒక చర్చ అయితే జరుగుతోంది. దాంతో పాటు నియోజకవర్గంలోని మొత్తం తన సొంత సామాజికవర్గాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు పేర్ని నాని ప్రయత్నిస్తున్నారని, అది బాలశౌరికి నచ్చడం లేదని చెబుతున్నారు.

మొత్తానికి పేర్ని నాని, బాలశౌరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని, ఒకరు నంది అంటే ఇంకొకరు పంది అంటారనేది బందరులో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యంగా మారింది. ఒకే పార్టీలో ఉన్నా.. ఒకే సామాజికవర్గానికి చెందినా.. పేర్ని నాని- వల్లభనేని బాలశౌరి మధ్య ఇంతలా వైరం కొనసాగుతుండడం గమనించదగ్గ విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.