ప‌ద్మ‌విభూష‌ణ్ 'కృష్ణ ఎల్లా' గురించి ఈ విష‌యాలు తెలుసుకోవాల్సిందే?

కొవాగ్జిన్ తయారీ సంస్థ‌ భారత్ బయోటెక్‌కు సీఎండీ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లా. ఔషధ రంగంలో విశేష కృషి చేసిన వారిద్దరినీ సంయుక్తంగా పద్మవిభూషణ్ వరించింది. కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించడంతో వారిద్దరి కృషికి ప్రశంసలు దక్కినట్లయింది.

తమిళనాడులోని తిరుత్తణి దగ్గర ఓ పల్లెలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు కృష్ణ ఎల్లా. వ్యవసాయం మీద కృష్ణ ఎల్లకు మక్కువ ఎక్కువ. ఆ మక్కువతోనే ఆయన వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత చదువులు చదివారు. కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బేయర్ ఫార్మా అగ్రికల్చర్ విభాగంలో కృష్ణ ఎల్లా ఉద్యోగంలో చేరారు. స్కాలర్ షిప్ రావడంతో అమెరికాలో ఎమ్మెస్ చేసి, పీహెచ్ డీ కూడా చేశారు. ఆ తరువాత తిరిగి భారతదేశానికి రాకూడదని ఆయన అనుకొన్నారట.

అయితే..’ఏమన్నా చేసుకొందువు నీ ఇష్టం.. ఇండియాకు రమ్మన్న తల్లి మాట విని కృష్ణ ఎల్లా మాతృదేశానికి వచ్చేశారు. ఒక్క డాలర్ ధరకు వ్యాక్సిన్ తయారు చేస్తా అంటూ హైదరాబాద్ వచ్చి ఓ చిన్న ల్యాబ్ పెట్టుకొన్నారు కృష్ణ ఎల్ల. 12.5 కోట్ల అంచనాతో హెపటైటిస్ మందుల ప్రాజెక్టు ప్రపోజల్ పట్టుకొని పెట్టుబడి కోసం కృష్ణ ఎల్లా తిరిగారు. ఆయనను చూసి అందరూ నవ్వారు. చివరికి ఐడీబీఐ బ్యాంకు 2 కోట్లు రుణం ఇచ్చింది. నాలుగేళ్లు శ్రమించిన కృష్ణ ఎల్లా హైపటైటిస్ వ్యాక్సిన్ ను తయారు చేశారు. 1999లో ఏపీజే అబ్దుల్ కలాం వచ్చి ఆ వ్యాక్సిన్ ని మార్కెట్లోకి విడుదల చేయడం విశేషం.

ఆ తరువాత 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి బయోటెక్ నాలెడ్జ్ పార్క్ ఏర్పాటు గురించి చ‌ర్చించారు కృష్ణ ఎల్లా. ఆయన సలహాతో హైదరాబాద్ నగర శివార్లలోని శామీర్ పేట్ రహదారి దగ్గర జీనోం వ్యాలీ వెలిసింది. జీనోమ్‌ వ్యాలీ రూపకల్పన కోసం చంద్రబాబు నాయుడు బాగా కృషి చేశారు. ఆ వ్యాలీ నుంచి 60 శాతానికి పైగా పిల్లల వ్యాక్సిన్ లు ప్రపంచానికి ఎగుమతులు అవుతున్నాయి. 65 దేశాలకు 400 మిల్లియన్ డోసుల ఎగుమతులు చేసింది భారత్ బయోటెక్ సంస్థ.

క్రిష్ణ ఎల్లా భారత్ బయోటెక్ పేరుతో ముందు ఓ చిన్న ల్యాబ్ పెట్టుకున్నారు. దేశ భక్తితో పెట్టిన ఆ పేరుతో ఏర్పాటు చేసిన ఆ సంస్థ దేశం గర్వించేలా వందకు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకొంది. చికున్ గున్యా నుండి జికా వైరస్ వరకు ఎన్నో వ్యాక్సిన్ లు కనిపెట్టి.. వైరస్ ల మీద దండయాత్రే చేశారు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా. వారిద్దరి సారథ్యంలో భారత్ బయోటెక్ సంస్త రూపొందించిన వ్యాక్సిన్లలో 65 పేటెంట్లు సాధించాయి. 2011 బిజినెస్ లీడర్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ లో 2008లో ప్రధాని అవార్డును అందుకున్నారు.

కృష్ణ ఎల్లా కరోనా మహమ్మారి నియంత్రణకు తిరుగులేని వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను అభివృద్ధి చేశారు. భారత్ బయోటెక్ సంస్థ అతి తక్కువ ధరకే కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు. కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలమైపోతున్న సమయంలో ప్రధాని మోదీ భారత్ బయోటెక్ సంస్థను సందర్శించడం ఓ పెద్ద న్యూసే అయింది. 

హైదరాబాద్ పరిసరాల్లో 600 చదరపు కిలోమీటర్ల పరిధిలో జీనోం వ్యాలీ విస్తరించింది. ఐటి రంగానికి ధీటుగా వేలాది మందికి జీనోం వ్యాలీలో ఉపాధి లభిస్తోంది. ‘ఐ వాంట్ ఏపీ టు బీ నంబర్ వన్ ఇన్ బయోటెక్’ అని 2004 మార్చిలో చంద్రబాబు నాయుడు చెబితే కొంద‌రు న‌వ్వారు. ఇప్పుడా ఫ‌లితాలు చూస్తున్నారు. ఆ వ్యాలీలో విర‌బూసిన సంజీవ‌నే- కొవాగ్జిన్‌. ఆ టీకా సృష్టిక‌ర్త‌లు కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లాల‌కు ల‌భించిన గౌర‌వ‌మే- ప‌ద్మ‌విభూష‌ణ్‌.