భారం

 

ఒక కాలేజీలో రెండు గ్రూపులు ఉండేవి. అవి ఎప్పుడు చూసినా తగాదాలలో మునిగితేలుతూనే ఉండేవి. ఎవరో ఒకరి తల పగలకుండా నెల గడవడం కష్టంగా ఉండేది. లెక్చరల్లు, అధికారులు ఆఖరికి ప్రిన్స్‌పాల్స్ కూడా వీటిని చూసీ చూడకుండా సాగిపోయేవారు. చివరికి ఓ ప్రిన్స్‌పాల్‌ రానేవచ్చాడు. వారంపాటు కాలేజీని పరిశీలించాక ఆయనకు విషయం అర్థమైపోయింది. ఒక రోజు, ఆ రెండు గ్రూపులవారినీ కాలేజీ హాల్లో సమావేశపరిచాడు.


ప్రిన్స్‌పాల్‌ తమకి ఏదో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి వెళ్లిపోతాడనీ, ఆ కాసేపు ఓపిక పడదామనీ, అంతా సరదాగా కూర్చున్నారు. కానీ ప్రిన్స్‌పాల్‌ తన ఉపన్యాసం మొదలుపెట్టలేదు సరికదా, తన ముందు ఉన్న టేబుల్‌ మీద పెట్టిన నీళ్ల గ్లాసుని చేతిలోకి తీసుకున్నాడు.


‘ఈ గ్లాసు చాలా బరువు ఉంటుంది కదా!’ అని అడిగాడు ప్రిన్స్‌పాల్.

‘నీళ్ల గ్లాసు బరువుండటం ఏంటి? అసలు దాన్ని మనం అలా తాగి ఇలా అవతల పెట్టేస్తాం కదా!’ అన్నాడు ఓ కుర్రాడు.

‘ఒకవేళ బరువే కొలవాలనుకుంటే, మహా అయితే ఓ వంద గ్రాములు ఉంటుందేమో!’ అన్నాడు ఇంకో కుర్రాడు.

‘ఇప్పుడు మీరు ఫిజిక్స్‌ పాఠం చెప్పబోతున్నారా!’ అని ఎగతాళిగా అడిగాడు మరో కుర్రాడు.

ప్రిన్స్‌పాల్‌ ఈ వ్యాఖ్యలేవీ పట్టించుకోలేదు ‘అయితే ఈ గ్లాసు పెద్దగా బరువు ఉండదని మీరంతా ఒప్పుకుంటున్నారు కదా! మరి ఇదే గ్లాసుని కాసేపు పట్టుకుంటే...’

‘ఎప్పుడెప్పుడు కింద పెట్టేద్దామా అనిపిస్తుంది’ అని వెనుక బెంచీలోంచి జవాబు వినిపించింది.

‘మరి కింద పెట్టేసే అవకాశం ఉన్నా రోజంతా అలాగే పట్టుకుని ఉంటే...’ రెట్టించాడు ప్రిన్స్‌పాల్‌.

‘చెయ్యి చచ్చుబడిపోతుంది. చూసేవాళ్లకి మనం పిచ్చివాళ్లమని అనిపిస్తుంది,’ మరో విసురైన జవాబు వచ్చింది.

‘ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే కదా!’ అన్నాడు ప్రిన్స్‌పాల్‌ నిదానంగా.

 
ప్రిన్స్‌పాల్‌ తమని పిచ్చివాళ్లతో పోల్చడంతో ఒక్కసారిగా కుర్రవాళ్ల మొహాలన్నీ ఎర్రబారాయి. కానీ ఆయన అదేమీ పట్టించుకోకుండా ఇలా చెప్పుకొచ్చాడు ‘అహంకారం, కోపం, ఆశ... ఇవన్నీ మనిషికి సహజమే! వాటిని అవసరమైనప్పుడు ఇలా తీసి వాడుకుని, అలా పక్కన పెట్టేస్తే సరిపోతుంది. కానీ అలా కాకుండా నిరంతరం మనతోనే మోసుకుంటూ పోతే మన వ్యక్తిత్వానికే ప్రమాదం వస్తుంది. అహం మదంగా మారుతుంది; కోపం ద్వేషంగా పరిణమిస్తుంది; ఆశకి అంతులేకుండా పోతుంది. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే! మీ భవిష్యత్తునీ, మీ తల్లిదండ్రుల ఆశలనీ పణంగా పెట్టి ఆధిపత్యం కోసమో, ద్వేషాన్ని చల్లార్చుకోవడం కోసమో మీరు పడుతున్న గొడవలు... మీ జీవితాలనే నాశనం చేస్తున్నాయి. కావాలంటే ఒక్క క్షణం మీరే ఆలోచించుకుని చూడండి,’ అంటూ నిదానంగా ఆ హాల్లోంచి వెళ్లిపోయాడు.

విద్యార్థులంతా ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. వాళ్లు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు..... 

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)


- నిర్జర.