రఘురామ విచారణ ఓకే .. బట్ కండీషన్స్ అప్లై.. హైకోర్టు

నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజును రాజద్రోహం కేసులో తప్ప ఇతర సెక్షన్లపై నమోదైన కేసుల్లో  విచారణ జరుపుకోవచ్చని ఏపీ సీఐడీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే.. కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. రఘురామను హైదరాబాద్ లో మాత్రమే విచారించాలని అది కూడా దిల్ కుషా ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన ఎంచుకున్న న్యాయవాది సమక్షంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని సూచించింది. విచారణ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరించాలని కండీషన్ పెట్టింది.

ఈ కేసులో ఇతర నిందితులు ఏబీఎన్, టీవీ-5లతో కలిపి ఎంపీ రఘురామను విచారించాలనుకుంటే మాత్రం 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు సూచించింది. విచారణ కోసం రఘురామను సీఐడీ కార్యాలయానికి పిలిపించకూడదని కండిషన్ పెట్టింది. విచారణ సందర్భంగా కేవలం కేసుకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే విచారించాలని, ఇతర అంశాల గురించి ప్రశ్నించకూడదని సూచించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. రఘురామకు వై- కేటగిరి భద్రత ఉన్నందున విచారణ నిర్వహించే గది బయట భద్రతా సిబ్బందిని అనుమతించాలని సూచించింది.

నిజానికి వైసీపీ అభ్యర్థిగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటరీ స్థానం నుంచి రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో గెలిచారు. అయితే.. ఆ తర్వాత వైసీపీతో ఆయనకు ఎందుకు చెడిందో ఏమో గానీ.. ప్రతిరోజూ వైసీపీ సర్కార్ చర్యల్ని, సీఎం జగన్ ను, ఆ పార్టీ నేతలు మరీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ‘రచ్చబండ’ పేరుతో మీడియా సమావేశం పెట్టి మరీ ఏకి పారేస్తున్నారు. దీంతో ఏపీ సీఐడీ సమోటోగా కేసు స్వీకరించి తనపై ఐపీసీ సెక్షన్ 124 ఏ ప్రకారం రాజద్రోహం, 152 ఏ కింద రెండు సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, 505, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందని, ఆ కేసును కొట్టేయాలని రఘురామ హైకోర్టును ఆశ్రయించారు.

గతంలో ఏపీ పోలీసులు తనను అరెస్ట్ చేసిన సందర్భంగా భౌతికంగా   హింసించారని, తనకు ప్రాణ హాని ఉందని ఎంపీ రఘురామ కోర్టుకు విన్నవించారు. దీంతో రఘురామను ఆన్ లైన్ లో విచారించడం సాధ్యమా? కాని పక్షంలో ఏదైనా సురక్షిత ప్రదేశాన్ని సూచించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. నిజానికి తనను అరెస్ట్ చేసి, శారీరకంగా హింసించిన తర్వాత రఘురామ  వైసీపీ సర్కార్ పైన, సీఎం జగన్ పైనా మరింతగా రెచ్చిపోయి విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రఘురామపై ట్విట్టర్ వేదికగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇద్దరు ఎంపీల మధ్యా ట్వీట్ల వార్ నడుస్తోంది. ఒక సందర్భంలో వారిద్దరి మధ్య ట్వీట్ల వార్ వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకు కూడా దారితీసింది.

జగన్ సర్కార్ చేస్తున్న తప్పిదాలు, ఆర్థికంగా ఏపీని దివాళా తీయించిన వైనంపై రఘురామ కొన్ని ఆధారాలతో సహా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రఘురామకృష్ణరాజు సంసద్ టీవీ చర్చలకు పిలవొద్దంటూ కొద్ది రోజుల క్రితం విజయసాయి రెడ్డి పార్లమెంట్ సెక్రటరీకి లేఖ రాశారు. వైసీపీకి కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున కానీ రఘురామ ప్రాతినిధ్యం వహించడం లేదని ఆ లేఖలో విజయసాయి పేర్కొన్నారు. అంతకు ముందు పార్టీకి, జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న రఘురామను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడని ప్రకటించాలని లోక్ సభ స్పీకర్ ను ఆ పార్టీ   ఎంపీలు కోరారు. అయితే.. వారి విజ్ఞప్తికి స్పీకర్ ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వ తీరుపైనా విమర్శలు చేస్తున్న  రఘురామపై పార్టీ  సస్పెన్షన్ వేటు వేయడానికి వైసీపీ అధిష్టానానికి ఉన్న అడ్డంకి ఏమిటనేది మాత్రం బయటికి చెప్పకపోవడం గమనార్హం.

చివరికి రఘురామపై రాజద్రోహం, సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ కేసులను సీఐడీ తనపై కుట్రపూరితంగా పెట్టిందని, వాటిని కొట్టి వేయాలంటూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా రఘురామను హైదరాబాద్ లోనే విచారించాలని, రాజద్రోహం మినహా ఇతర సెక్షన్ల విషయంలో విచారణ చేసుకోవచ్చని సీఐడీని ఆదేశించింది.