భారత్ లో ఏఐ సమ్మిట్.. ఎప్పుడో తెలుసా?
posted on Nov 24, 2025 8:51AM

భారత్ ఏఐ సమ్మిట్ కు ఆతిథ్యం వహించనుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోడీ కీలక ప్రసంగం చేయడంతో పాటు, పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జపాన్ ప్రధాని సనే టకాయిచిలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
అందరికీ న్యాయమైన, నాణ్యమైన భవిష్యత్ అనే అంశంపై ప్రసంగించిన మోడీ, టెక్నాలజీ వినియోగం ఆర్థిక కేంద్రంగా కాకుండా మానవ కేంద్రంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సర్వజనం హితాయ, సర్వజనం సుఖాయ అనే నినాదంతో భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుందని ప్రకటించారు. ఆ సదస్సుకు జీ20 దేశాలను ఆహ్వానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో పారదర్శకత, మానవ పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అరికట్టడం వంటి సూత్రాలతో ప్రపంచ ఒప్పందం అవసరమని మోడీ అన్నారు.
ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, ఏఐ వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్యా సహకారంపై చర్చించారు. అలాగే ఇటలీ, కెనడా, జపాన్ ప్రధానులతోనూ మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు.