ప్రపంచ ఇంధన మార్కెట్‌లో భారత్ సంచలనం.. రాబోయే దశాబ్దపు వృద్ధిలో సింహభాగం ఇండియాదే!

posted on: Jun 9, 2026 4:11PM

ప్రపంచ దేశాల్లో పారిశ్రామిక, ఆర్థిక రంగాలు శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో ఇండియా అత్యంత కీలకమైన శక్తిగా అవతరిస్తోంది. వచ్చే దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగే కన్స్యూమర్ ఆయిల్ డిమాండ్‌లో దాదాపు యాభై శాతం వాటాను ఇండియా ఒక్కటే దక్కించుకోనుందని  అంతర్జాతీయ ఇంధన నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాల వినియోగం, పారిశ్రామిక అవసరాల రీత్యా భారత్‌లో ఇంధన వినియోగం మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. ఈ పరిణామాలు గ్లోబల్ ఎనర్జీ సెక్టార్‌లో సరికొత్త మార్పులకు కారణమవుతున్నాయి.

రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ రోస్‌నెఫ్ట్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ) ఇగోర్ సెచిన్ ఇటీవల జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో భారత ఇంధన మార్కెట్ సామర్థ్యంపై కీలక విశ్లేషణ చేశారు. ఆయన అంచనాల ప్రకారం.. రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా చమురు అవసరాలు పెరగడానికి భారతదేశమే ప్రధాన చోదక శక్తిగా మారనుంది. అలాగే అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) నివేదికలను పరిశీలిస్తే, వచ్చే పదేళ్లలో దేశీయ చమురు వినియోగం దాదాపు 44 శాతం మేర వృద్ధి చెంది, రోజుకు సుమారు 8 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

రష్యా నుంచి రికార్డు స్థాయి దిగుమతులు.. మారిన వ్యూహాత్మక సమీకరణాలు

గడచిన కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో..  ఇండియా తన చమురు దిగుమతుల వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు పశ్చాత్త్య దేశాలు లేదా అరబ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడిన  ఇండిమా, ప్రస్తుతం రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్‌ను సేకరిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం భారత మొత్తం ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా రికార్డు స్థాయిలో 38 శాతానికి చేరుకుంది. ప్రారంభంలో తక్కువ ధరలకే లభించిన  రష్యన్ చమురు, కాలక్రమేణా రెండు దేశాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి దారితీసింది.

అయితే..  ఈ వ్యాపార సంబంధంలో చమురుపై చెల్లిస్తున్న ప్రీమియం ధరలు ఏకంగా 425 శాతం మేర పెరగడం గమనార్హం. ఇదివరకు డిస్కౌంట్ ఆయిల్‌గా ఉన్న సరఫరా, ఇప్పుడు ఇరు దేశాల మధ్య ప్రత్యేక మార్కెట్ ధరల పరిధిలోకి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో సాంప్రదాయకంగా అమెరికా నుండి జరిగే ముడిచమురు దిగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా యూఎస్ ఆయిల్ దిగుమతుల శాతం కనిష్ట స్థాయికి పడిపోవడం అంతర్జాతీయ ఇంధన రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పును సూచిస్తోంది.

సెయింట్ పీటర్స్‌బర్గ్ ఫోరమ్‌లో పుతిన్ మద్దతు.. ఆంక్షల వ్యూహం విఫలం

ఇటీవల నిర్వహించిన సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ సార్వభౌమాధికారం,  విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలు విధిస్తున్న ఆంక్షల బెదిరింపులు భారత ఆర్థిక పురోగతిని ఏమాత్రం అడ్డుకోలేవని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ..  ఎలాంటి బాహ్య ఒత్తిళ్లనైనా తట్టుకుని నిలబడే సామర్థ్యాన్ని చాటుకుందని   కొనియాడారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వబోవని, అవి తిరిగి సదరు దేశాలకే నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు.

రోస్‌నెఫ్ట్ అధినేత ఇగోర్ సెచిన్ సైతం ఇదే సదస్సులో భారత విద్యుత్ రంగాన్ని ప్రస్తావించారు. రాబోయే దశాబ్ద కాలంలో ప్రపంచ విద్యుత్ వినియోగ వృద్ధిలో 15 శాతం వాటాను ఇండియా  కైవసం చేసుకోనుందని తెలిపారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే భారతదేశ విద్యుత్ డిమాండ్ దాదాపు 80 శాతం వృద్ధి చెంది..  సుమారు 3,000 టెరావాట్-అవర్స్ స్థాయికి చేరుకుంటుందని, ఇది ప్రస్తుత యూరోపియన్ యూనియన్ మొత్తం వినియోగానికి సమానమని వివరించారు.

హోర్ముజ్ జలసంధి సంక్షోభం – అంతర్జాతీయ సరఫరా గొలుసుకు ముప్పు

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన  హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న రాజకీయ,  సైనిక ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మార్గంలో ఏ విధమైన అంతరాయం ఏర్పడినా కేవలం చమురు రంగానికే కాకుండా ప్రపంచ ఆహార భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎరువుల ధరలు సుమారు 60 శాతం మేర పెరగడం గమనార్హం. చమురు మరియు ఎరువుల రవాణా నిలిచిపోతే అది ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది.

ఈ రకమైన అంతర్జాతీయ సరఫరా సమస్యలు తలెత్తినప్పుడు భారత్ వంటి భారీ వినియోగ దేశాలు ప్రత్యామ్నాయ వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ రవాణా స్వేచ్ఛా సూత్రాలకు భంగం వాటిల్లితే, రవాణా ఖర్చులు మరియు ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరిగిపోయి, చివరికి ఆ భారం సాధారణ వినియోగదారులపై పడే అవకాశం ఉంది. అందువల్ల వ్యూహాత్మక నిల్వలను (స్ట్రాటజిక్ రిజర్వ్స్) పెంచుకోవడం దేశానికి అత్యంత ఆవశ్యకం.

ఆర్థిక వృద్ధి,  పర్యావరణ లక్ష్యాల మధ్య సమతుల్యత

భారతదేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి రేటుకు అనుగుణంగా ఇంధన అవసరాలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా పర్యావరణ పరిరక్షణ,  నెట్-జీరో (కార్బన్ ఉద్గారాల తగ్గింపు) లక్ష్యాలను చేరుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఒకవైపు అంతర్జాతీయ ఇంధన సంస్థల అంచనాల ప్రకారం చమురు ఆధారిత ఇంధన వినియోగం భారీగా పెరుగుతుండగా, మరోవైపు సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన, మరియు గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భారత్ పెట్టుబడులను ముమ్మరం చేస్తోంది.

రాబోయే రోజుల్లో సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూనే, పారిశ్రామిక రంగానికి అవసరమైన నిరంతర విద్యుత్ మరియు చమురు సరఫరాను అందించడం భారత ఇంధన విధాన రూపకర్తలకు ఒక పరీక్షగా మారనుంది. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు వల్ల ప్రస్తుతానికి దేశీయ మార్కెట్ స్థిరంగా ఉన్నప్పటికీ, కేవలం ఒకే వనరుపై భారీగా ఆధారపడటం సుదీర్ఘ కాలంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఏదేమైనా, రాబోయే దశాబ్ద కాలంలో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ గమనాన్ని శాసించే ప్రధాన శక్తిగా భారతదేశం నిలవబోతోందనేది జగమెరిగిన సత్యం.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...