గంగమ్మ ఒడికి బాలాపూర్ గణనాథుడు
posted on Sep 6, 2025 8:06PM

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బాలాపూర్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఉదయం మండపం నుంచి మొదలైన భారీ శోభాయాత్ర చార్మినార్, ఎంజే మార్కెట్ మీదుగా అప్పర్ ట్యాంక్ బండ్‌కు చేరుకుంది. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు క్రేన్ నంబర్ 12 వద్దకు చేరుకోగా విగ్రహానికి భాగ్య నగర ఉత్సవ సమితి సభ్యులు పూజలు చేశారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు హుస్సేన్ సాగర్‌లో బాలాపూర్ గణేశుడిని నిమజ్జన ప్రక్రియ పూర్తయింది.
మరోవైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్‌కు భారీగా గణనాథులు, భక్తులు తరలి వస్తున్నారు. సచివాలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు బాలాపూర్ నిమర్జన ఏర్పాట్లను సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహరా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా బాలాపూర్ గణేశ్ లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాటలో లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి లడ్డూను రూ.35 లక్షలకు దక్కించుకున్నాడు. బాలాపూర్ గణనాథుడి లడ్డూను దక్కించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.30.01 లక్షలు పలికిన విషయం తెలిసిందే.
సాయంత్రం వాతావరణం చల్లబడటంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది.నగరవ్యాప్తంగా ఉన్న వేలకొద్దీ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు రహదారులపై బారులు తీరారు. దీంతో హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. మహగణపతితో పాటు అనేక వినాయక విగ్రహాలు ఒకేసారి దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. 'గణపతి బప్పా మోరియా' నినాదాలతో గణపయ్యను కీర్తిస్తూ నినాదాలు చేశారు. 'జై జై గణేశా... బై బై గణేశా' అంటూ ఏకదంతునికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ అపుర్వ ఘట్టాన్ని వేలాది మంది ప్రజలు స్వయంగా వీక్షించగా.. కోట్లాది మంది టెలివిజన్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రత్యక్షంగా చూసి పరవశించిపోయారు