రేపోమాపో హుజురాబాద్ నోటిఫికేష‌న్‌.. బీజేపీ స్కెచ్.. కేసీఆర్ అల‌ర్ట్‌.. ఈటల జంప్!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. రేపోమాపో హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాబోతోంద‌ట‌. ఈ మేర‌కు ఢిల్లీ నుంచి లీకులు వ‌స్తున్నాయి. సీఎం కేసీఆర్‌కు పై నుంచి స‌మాచారం అందింద‌ట‌. ఈట‌ల చెవికీ ఆ మెసేజ్ రీచ్ అయిందే. అందుకే, ఆ ఇద్ద‌రు నేత‌లు వెంట‌నే అల‌ర్ట్ అయ్యారు. కేసీఆర్ ప‌రుగున వాసాల‌మ‌ర్రిలో వాలిపోయి.. ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించేశారు. అటు, కాలికి స‌ర్జ‌రీ అయింది.. 10 రోజులు రెస్ట్ అవ‌స‌ర‌మ‌న్నా విన‌కుండా.. ఈట‌ల రాజేంద‌ర్ ఆసుప‌త్రి నుంచి నేరుగా హుజురాబాద్‌కు ప‌రుగులు పెట్టారు. వాళ్లిద్ద‌రి దూకుడు అలా ఉంటే.. ఇటు కాంగ్రెస్ సైతం నిద్ర‌మ‌బ్బు నుంచి మేల్కొని.. కేండిడేట్ సెల‌క్ష‌న్ స్పీడ‌ప్ చేసింది. ఇలా తెలంగాణ‌లో బైపోల్ వార్ ఒక్క‌సారిగా వేడెక్కి.. రాజ‌కీయ హ‌డావుడి అమాంతం పెరిగిపోయింది. 

బుధ‌వారం సీఎం కేసీఆర్ స‌డెన్‌గా త‌న ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రికి వెళ్ల‌డం ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం. నాగార్జున సాగ‌ర్‌కు వెళ్లిన‌ట్టే.. వాసాల‌మ‌ర్రిలో కూడా ప‌ర్య‌టిస్తారేమో అనుకున్నారంతా. కానీ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు సీఎం కేసీఆర్‌. అది పేరుకే వాసాల‌మ‌ర్రి ప‌ర్య‌ట‌న అయినా.. ఆయ‌న టూర్ అంతా ద‌ళితుల చుట్టూనే తిరిగింది. ద‌ళితవాడ‌లో ఇంటింటికీ కాలిన‌డ‌క‌న వెళ్లి ప‌రిశీలించారు. వారి మంచిచెడ్డ‌లు అడిగి తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత ద‌ళితుల‌తోనే ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. మిగ‌తా కులాల వారినెవ్వ‌రినీ ఆ మీటింగ్‌కి రానివ్వ‌లేదు. కొంద‌రు వాసాల‌మ‌ర్రి వాసులు గొడ‌వ చేసినా.. వారిని లోనికి అనుమ‌తించ‌లేదు. అప్పుడు కూడా ఎవ‌రికీ అనుమానం రాలేదు. ఆ మీటింగ్‌లో మాట్లాడుతూ.. స‌డెన్‌గా ద‌ళిత‌బంధు ప‌థ‌కం వాసాల‌మ‌ర్రి నుంచే ప్రారంభిస్తున్న‌ట్టు.. ఇప్పుడు.. ఈ గంట‌నుంచే ద‌ళిత‌బంధు ప్రారంభం అయిపోయిన‌ట్టు.. ప్ర‌క‌టించేశారు సీఎం కేసీఆర్‌. తర్వాత కొన్ని గంటల్లోనే దళిత బంధుపై జీవో ఇచ్చేశారు, 76 ద‌ళిత కుటుంబాల‌కు  త‌లా 10ల‌క్ష‌లు అకౌంట్లో జ‌మ చేసేశారు.  

అంతా ఆశ్చ‌ర్యం. అంద‌రిలోనూ సందేహం. ద‌ళిత‌బంధు స్టార్ట్ అయిపోయిందా.. అని గిల్లి మ‌రీ చూసుకున్నారు కొంద‌రు. హుజురాబాద్‌లో క‌దా ప్రారంభం కావాల్సింది? వాసాల‌మ‌ర్రిలో ఎందుకు మొద‌లు పెట్టారు? ల‌క్ష కోట్ల ప‌థ‌కాన్ని అంత సింపుల్‌గా, ఎలాంటి హంగామా లేకుండా.. అలా ఎలా ప్రారంభించేశారు? కేసీఆర్‌ ఇలా ఎలా చేశారు? అంటూ అనేక అనుమానాలు. ఆ ప్ర‌శ్న‌ల‌న్నిటిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వ‌స్తోంది. అస‌లు గుట్టు ర‌ట్ట‌వుతుంది. హ‌మ్మా.. కేసీఆర్ ఇంత‌టి ఎత్తుగ‌డ వేశారా? దాని వెనుక ఇంత పెద్ద రీజ‌న్ దాగుందా? అని తెలిసి అంతా నోరెళ్ల బెగుతున్నారు. రేపోమాపో హుజురాబాద్ బైపోల్‌కు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ జారీ చేస్తుంద‌నే ప‌క్కా స‌మాచారం కేసీఆర్‌కు వ‌చ్చింద‌ట‌. అదే జ‌రిగితే.. షెడ్యూల్ వెలువ‌డితే.. ఇంకా ప్రారంభం కాని ద‌ళిత‌బంధును ఆపేయ‌డం ఖాయం. అది కేసీఆర్‌కు అస‌లుకే ఎస‌రు తెస్తుంది. అందుకే, వెంట‌నే ద‌ళిత‌బంధును స్టార్ట్ చేసేస్తే.. ఆన్ గోయింగ్ ప‌థ‌కం కింద చూపించొచ్చు. అప్పుడు హుజురాబాద్ నోటిఫికేష‌న్ వ‌చ్చినా.. ద‌ళిత బంధుకు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. ఇదంతా హుజురాబాద్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాబోతోంద‌నే లీకుల‌తోనే కేసీఆర్ ఇలా స్కెచ్ వేశార‌ని అంటున్నారు. 

కేసీఆర్ తీసుకురాబోతున్న‌ ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ఎలాగైనా అడ్డుకోవడానికి బీజేపీ పెద్ద‌లు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. స‌డెన్‌గా హుజురాబాద్ నోటిఫికేష‌న్ జారీ చేయ‌డానికి ఈసీ సిద్ద‌మ‌వ‌డం అందులో భాగ‌మేనంటున్నారు. ఆ విష‌యం ప‌సిగ‌ట్టే సీఎం కేసీఆర్ ద‌ళిత‌బంధును సింపుల్‌గా, ఎలాంటి హ‌డావుడి లేకుండా, అప్ప‌టిక‌ప్పుడు స్టార్ట్ చేసేశారు. దీంతో.. కంగుతిన్న క‌మ‌ల‌నాథులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. వెంట‌నే మేట‌ర్ ఈట‌ల చెవిలో వేసేశారు. అటు ఈసీ నోటిషికేష‌న్‌, ఇటు ద‌ళితబంధు.. విష‌యం తెలిసి ఈట‌ల రాజేంద‌ర్ ఆసుపత్రి బెడ్ మీద‌నుంచి నేరుగా హుజురాబాద్ ప‌య‌న‌మయ్యారు. కాలి గాయం అలానే ఉన్నా.. ఆరోగ్యం కుద‌టప‌డ‌కున్నా.. డాక్ట‌ర్లు వారించినా.. డోంట్‌కేర్ అంటూ.. స‌మ‌యం లేదంటూ.. ఆల‌స్యం అయితే అస‌లుకే మోసం వ‌స్తుందంటూ.. కంగారు కంగారుగా ఈట‌ల మ‌ళ్లీ రంగంలోకి దిగిపోయారు. 

కేసీఆర్‌, ఈట‌ల ఇలా హ‌డావుడి ప‌డుతుంటే.. కాంగ్రెస్ మాత్రం హుజురాబాద్ విష‌యంలో త‌న‌ న‌త్త‌న‌డ‌క‌లో ఇప్పుడిప్పుడే వేగం పెంచుతోంది. తాజాగా, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేసి స‌మీక్ష నిర్వ‌హించారు. స‌రైన అభ్య‌ర్థిని ఎంపిక చేసే బాధ్య‌త‌ను దామోద‌ర రాజ‌న‌ర్సింహా, పొన్నం ప్ర‌భాక‌ర్‌లకు అప్ప‌గించారు. తాము త‌గ్గైనా.. ఈట‌ల‌ను గెలిపించైనా.. కేసీఆర్‌ను ఓడించేలా రాజ‌కీయ జూదం ఆడుతున్న‌ట్టుంది కాంగ్రెస్‌పార్టీ. అందుకేనేమో.. హుజురాబాద్ విష‌యంలో మొద‌టినుంచీ అంత దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం లేదు రేవంత్‌రెడ్డి. 

ఇలా మూడు పార్టీలు జోరుతో.. రేపోమాపో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌నే లీకుల‌తో.. తెలంగాణ రాజ‌కీయం మ‌రోసారి వేడెక్కింది. అప్ప‌ట్లో కొడంగ‌ల్ ఎన్నిక‌లా.. ఇప్పుడు హుజురాబాద్ ఎల‌క్ష‌న్ మ‌ళ్లీ స్టేట్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. చూడాలి.. ఎవ‌రి వ్యూహాలు, ఎవ‌రి ఎత్తుగ‌డ‌లు ఎలా ఉంటాయో.. ఓట‌ర్లు ఎవ‌రి వైపు ఉంటారో..