సంక్రాంతికి కాసుల పండుగ‌.. డ‌బ్బులే డ‌బ్బులు...

మూడు రోజుల పండుగ సంక్రాంతి. పండ‌గ పేరుతో క‌న‌క‌మ‌హాల‌క్ష్మి తాండ‌వం చేసింది. కొత్త బ‌ట్ట‌లు, కొత్త సినిమాలు, పిండి వంట‌లు, కోడి పందేలతో.. జ‌నం పండ‌గ చేసుకున్నారు. చికెన్, మ‌ట‌న్‌, మందు.. విప‌రీతంగా తిని-తాగారు. ప‌నిలో ప‌నిగా.. ప్ర‌భుత్వాలు సైతం కాసుల పండుగ చేసుకున్నాయి. పండుగంతా ఆంధ్రాలో ఉంటే.. తెలంగాణ స‌ర్కారుకు అధికా రాబ‌డి రావ‌డం ఇంట్రెస్టింగ్ పాయింట్‌. అదెలాగంటే....

పండ‌గ‌కు హైద‌రాబాద్ దాదాపు ఖాళీ. న‌గ‌ర‌వాసులు పెద్ద సంఖ్య‌లో ఏపీ బాట ప‌ట్టారు. రైల్స్ సంఖ్య అంతంత‌మాత్ర‌మే కావ‌డంతో.. ఎక్కువ మంది బ‌స్సుల్లోనే త‌ర‌లివెళ్లారు. ఇక‌, ఏపీఎస్ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల పేరుతో టికెట్ రేట్లు పెంచి దోపిడీకి దిగ‌డం.. ప్రైవేట్ బ‌స్సులు వేల‌కు వేలు వ‌సూలు చేయ‌డంతో.. తెలంగాణ ఆర్టీసీకి డిమాండ్ పెరిగింది. పాత రేట్ల‌తోనే పండ‌గ‌కు స్పెష‌ల్ బ‌స్సులు వేయ‌డంతో.. అంతా టీఎస్ఆర్టీసీ బ‌స్సుల కోసం ఎగ‌బ‌డ్డారు. ఇక తెలంగాణ జిల్లాల‌కూ బ‌స్సులు ర‌ద్దీగా న‌డిచాయి. కేవ‌లం ఈ సంక్రాంతి సీజ‌న్‌లోనే ప్ర‌త్యేక బ‌స్సుల ద్వారా 55 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించార‌ని ప్ర‌క‌టించింది తెలంగాణ ఆర్టీసీ. ఆ మేర‌కు ఏకంగా 107 కోట్ల ఆదాయం వ‌చ్చిప‌డింది. ఇంకేం.. టీఎస్ఆర్టీసీకి కాసుల పంటే.

మ‌రోవైపు, సంక్రాంతి సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించడంతో టోల్‌ప్లాజాలకు భారీగా ఆదాయం సమకూరింది. తెలంగాణ‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు వెళ్లేందుకు పలు జాతీయ రహదారులను దాటాలి. రాష్ట్ర పరిధిలో 28 ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలు ఉన్నాయి. పండుగ మూడు రోజుల్లో టోల్‌గేట్ల ద‌గ్గ‌ర‌ 11.72 కోట్ల ఆదాయం వ‌చ్చింది.