ఒత్తిడిని దూరం చేసే మార్గాలు

ఈ రోజుల్లో ఒత్తిడి లేనిది ఎవరికి? ఈ పోటీ ప్రపంచంతో పరుగులెత్తే జీవితంలో అందరూ ఒత్తిడికి లోనయ్యేవారే! కొంతవరకూ ఈ ఒత్తిడి అవసరమే కూడా! కానీ తలకెత్తుకున్న ఒత్తిడి ఓ పట్టాన దిగిరాకపోతే మాత్రం కష్టం. మనసుకి భారమైన ఒత్తిడితో శరీరానికి కూడా నష్టం. ఏ జీవితం కోసమైతే మనం ఇంతగా ఒత్తిడికి లోనవుతున్నాయో, ఆ జీవితాన్నే నరకంగా మార్చేసే రోగాలన్నీ ఒత్తిడితో వచ్చేస్తాయి. అందుకే అనవసరమైన ఒత్తిడిని నివారించుకునేందుకు, తరుణోపాయాలను కూడా వెతుక్కోవాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని ఇవిగో...

 

రాసుకుని పక్కన పెట్టేయండి!

చిత్రంగా అనిపించినా, ఈ చిట్కా తప్పకుండా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మనం ఏదన్నా సమస్యని ఎదుర్కొన్నప్పుడు దాని గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాము. దాని పరిష్కరించడం కోసమో, దాన్నుంచి బయటపడటం కోసమో మన మెదడు తెగ వేడెక్కిపోతూ ఉంటుంది. అందుకనే ఇక ఈ సమస్య గురించి ఇప్పుడు, ఇంతకుమించి ఆలోచించి ఉపయోగం లేదనుకున్నప్పుడు దాన్ని ఒక చోట రాసుకుని పక్కన పెడితే సరిపోతుంది. ఆ సమస్యను మర్నాడు చూసుకుంటే సరిపోతుంది.

 

అంకెలూ పనిచేస్తాయి

అంకెలు లెక్కపెట్టడం అనే ఆలోచన పాతచింతకాయ పచ్చడిలా కనిపించవచ్చు. కానీ ఒకో అంకె లెక్కపెట్టేకొద్దీ మరింత నిదానంగా ఊపిరి తీసుకోవడం అనే ప్రక్రియను జోడిస్తే, ఒత్తిడి ఇట్టే మాయమవుతుందట. అలా నిదానంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల నిండా ప్రాణవాయువు చేరుతుంది. దీని వల్ల రక్తపోటులో అప్పటికప్పుడే మార్పులు గమనించవచ్చునంటున్నారు వైద్యలు. ఇలా పీల్చుకునే ఊపిరిని నోటి ద్వారా వదలడం వల్ల మరింత ఉపయోగం ఉంటుందని అంటున్నారు.

 

ఊహకు రెక్కలివ్వండి

ప్రకృతికీ ప్రశాంతతకూ అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి కళ్ల ముందుంటే తల్లి ఒడిలో ఉన్నంత భరోసా ఉంటుంది. అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు వీలైతే కాస్త పచ్చని వాతావరణంలో తిరిగేందుకు ప్రయత్నించండి. అదీ కాదంటే కిటికీలోంచి బయట ఉన్న ప్రకృతిని గమనించండి. అది కూడా వీలుకాకపోతే, ఒక్క నిమిషం కళ్లు మూసుకొని మీరు ప్రకృతి ఒడిలో ఉన్నట్లు భావించుకోండి. కొండలూ, మబ్బులూ, జలపాతాలూ, పక్షులూ, చెట్లూ... అన్నీ మీ కళ్ల ఎదుటే ఉన్నట్లుగా ఊహించుకోండి. మీలోంచి ఒత్తిడి ఎలా మాయమవుతుందో చూడండి!

 

కండరాలకు విశ్రాంతినివ్వండి!

మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం కూడా ఒత్తిడికి లోనవుతుంది. కండరాలన్నీ బిగుసుకుంటాయి. తల భారంగా మారిపోతుంది. కండరాలను బిగించి వదలడం, మెడని అటూ ఇటూ తిప్పడం వంటి చిన్నపాటి వ్యాయామాలతో శరీరం కాస్త తేలికపడుతుంది. చేతులకీ, మెడకీ చేసుకునే చిన్నపాటి మసాజ్ వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఏదన్నా యోగాసనంలో కాసేపు కూర్చునే అలవాటు ఉన్నా ప్రయోజనమే!

 

నీటిలో గడపండి

నీటికీ మన శరీరానికీ అవినాభావ సంబంధం ఉంది. నీరు తగలగానే మన శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకనే స్నానమో, కాళ్లూ చేతులూ కడుక్కోవడమో చేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఒత్తిడి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మొహం మీద నీళ్లు చల్లుకోవడం, షవర్ కింద కాసేపు నిల్చోవడంతో మనసు తేలికపడుతుంది. ఇంకా మాట్లాడితే ఈత కొట్టే అవకాశం, అలవాటు ఉంటే కనుక ఒత్తిడి ఆ ఈతకొలనులోనే మాయమైపోతుంది.

 

ఒత్తిడి అనేది వ్యక్తిగతమైనది. కాబట్టి ఎవరి అనుభవానికీ, ఆలోచనకూ తగినట్లుగా ఒత్తిడిని నివారించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు తమకి ఇష్టమైన సంగీతాన్ని వింటూ ఒత్తిడిని మర్చిపోతే, మరికొందరు కాసేపు స్నేహితుల మధ్య గడిపి ఒత్తిడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎవరు ఏ పద్ధతిని అనుసరించినా, ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం మాత్రం... మనకూ, మన కుటుంబానికీ చాలా అవసరం!