సిగిరెట్‌ మానడం తేలికే!

‘మనిషి తల్చుకుంటే సాధించలేనిది ఏదీ లేదు’... వగైరా వగైరా వాక్యాలు మనం చాలానే వింటూ ఉంటాము. వినడానికి కాస్త అతిగా ఉన్నా, వాటిలో తప్పేమీ లేదని మనకి తెలుసు. అందుకే సిగిరెట్‌ మానడం కూడా ఏమంత కష్టం కాదని తేల్చేస్తున్నారు పెద్దలు. కావాలని అంటించుకున్న వ్యసనం, పొమ్మంటే పోకుండా ఉంటుందా! పోయేదాకా పొగపెడితే సిగిరెట్టైనా పారిపోకుండా ఉంటుందా! కాకపోతే చిన్నపాటి జాగ్రత్తలు పాటించేస్తే సరి...

ప్రణాళిక ఏర్పరుచుకోండి:
సిగిరెట్టుకి దూరం కావాలి అని నిర్ణయించుకోగానే, ఒక ప్రణాళికను ఏర్పరుచుకోండి. కనీసం ఒక నెల రోజులన్నా మీరు సిగిరెట్టుకి దూరంగా ఉండేందుకు ఏమేం చేయాలో నిర్ణయించుకోండి. మీ నిర్ణయాన్ని కుటుంబసభ్యులతో సహా మీ సన్నిహితులందరికీ తెలియచేయండి. మీరు ఏమాత్రం మీ లక్ష్యం నుంచి దూరమైనా, వాళ్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు. పొగకు దూరమైనప్పుడు మీ శరీరంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి? వాటిని మీరు ఎలా ఎదుర్కోవాలి? ఇలా ఎన్నాళ్లు ఓపిక పట్టాలి?... వంటి విషయాలన్నింటి మీదా ఒక అవగాహనను ఏర్పరుచుకోండి.

వ్యాపకం
మీరు ఉద్వేగంగా ఉన్నప్పుడో లేక ఖాళీగా ఉన్నప్పుడో సిగిరెట్‌ తాగాలని నోరు పీకేయడం సహజం. అందుకనే ఏదో ఒక వ్యాపకాన్ని అలవర్చుకోండి. సిగిరెట్ తాగాలని మీ నోటికి అనిపించినప్పుడల్లా చూయింగ్‌ గమ్‌ నమలడమో, మంచి నీరు తాగడమో చేయండి. చేతులతో వీడియో గేమ్ ఆడటమో, రాయడమో చేయండి. అదీ ఇదీ కాకుంటే కాసేపు ధ్యానం చేయండి లేదా ఓ నాలుగడుగులు అలా వీధి చివరిదాకా వెళ్లిరండి. మొత్తానికి సిగిరెట్‌ తాగడం తప్ప మరేదన్నా పనికొచ్చే పనిచేయండి.

వాతావరణం
పొగని గుర్తుచేసే అన్ని వస్తువులనీ కట్టకట్టి అవతల పారేయండి. మీ సిగిరెట్‌ ప్యాకెట్లు, లైటర్లు, యాష్‌ట్రేలు.... వీటన్నింటినీ చెత్తబుట్టలో పారేయండి. ఇక పొగని గుర్తుచేసే ప్రాంతాలకి (ఉదా॥ సినిమా హాళ్లు, బార్లు...) దూరంగా ఉండండి. మీ స్నేహితులలో తెగ పొగ తాగేవారికి కొన్నాళ్లు దూరంగా ఉండండి. వారి సాన్నిహిత్యంలో మీకు పొగ గుర్తుకురావడం మాట అటుంచి, మీతో మళ్లీ పొగ తాగించేందుకు వాళ్లు విశ్వ ప్రయత్నం చేస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు!

సలహాసంప్రదింపులు
సిగిరెట్టు వ్యసనానికి ముఖ్య కారణం అందులో ఉండే నికోటిన్‌ అనే పదార్థమే! కాబట్టి నికోటిన్‌ వ్యసనం నుంచి తప్పించుకునేందుకు వైద్యుల సలహా తప్పకుండా ఉపయోగపడుతంది. నికోటిన్‌ రిప్లేస్‌మెంట్‌ పేరుతో కొన్నాళ్ల పాటు తక్కువ మోతాదులో నికోటిన్‌ ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. నికోటిన్‌ వ్యసనం నుంచి దూరం చేసేందుకు మందులూ ఉన్నాయి. మన పరిస్థితిని బట్టి మనకి ఎలాంటి చికిత్స అవసరమో వైద్యులు గుర్తిస్తారు. అదీ ఇదీ కాదంటే మనకి కౌన్సిలింగ్ ఇచ్చి, సిగిరెట్‌ వ్యసనం నుంచి దూరమయ్యేందుకు సాయపడే సైకాలజిస్టులూ అందుబాటులో ఉన్నారు. కాబట్టి అవసరం అనుకుంటే ఏమాత్రం మొహమాటం లేకుండా వైద్యుల సాయాన్ని తీసుకోవాలి.

సిద్ధంగా ఉండండి
సిగిరెట్‌ మానేసిన మొదటి రోజు నుంచి తలనొప్పి మొదలుకొని నానారకాల ఇబ్బందులూ మీ శరీరాన్ని పీడించేందుకు సిద్ధంగా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు... వారాల తరబడి నానారకాల సమస్యలూ మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆకలి వేయదు, నిద్ర పట్టదు, దేని మీదా ధ్యాస నిలువదు. నిస్సత్తువ, అజీర్ణం, దగ్గు... మనల్ని కుంగతీస్తాయి.

వీటన్నింటినీ తట్టుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీకు ఇష్టమైన కుటుంబ సభ్యుల కోసం, మీ దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం కొన్నాళ్లపాటు వీటిని భరించక తప్పదని గుర్తుంచుకోండి. ఒకో వారం గడిచేకొద్దీ మీ ప్రయత్నాన్ని మీరే అభినందించుకోండి. మీకు మీరే బహుమతిగా ఇష్టమైన వస్తువులను కొనుక్కోండి.

 

- నిర్జర.