చ‌లో గుడివాడ.. తీవ్ర ఉత్కంఠ‌.. కొడాలి క‌న్వెన్ష‌న్‌పై టీడీపీ పోరుబాట‌...

గుడివాడ‌లో గ‌డ‌బిడ మొద‌లైంది. సంక్రాంతి వేడుక‌ల పేరుతో ఏకంగా క్యాషినోలే ఏర్పాటు చేయ‌డంపై ప్ర‌జ‌లంతా మండిప‌డుతున్నారు. గుడివాడ‌కు గోవా క‌ల్చ‌ర్ తీసుకురావ‌డంపై ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌జాప‌క్షాన టీడీపీ పోరుబాట ప‌ట్టింది. చ‌లో గుడివాడ అంటూ నిజ‌నిర్థార‌న క‌మిటీ రంగంలోకి దిగింది. 

అయితే, కె క‌న్వెన్ష‌న్‌లో మందు, విందు, చిందు, పేకాట‌, క్యాషినోల‌ను అడ్డుకోని పోలీసులు.. టీడీపీ వాళ్లు వ‌స్తుంటే మాత్రం ఖాకీలు రంగంలోకి దిగిపోయారు. మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం గుడివాడలో భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ బృందం రాక విషయాన్ని తెలుసుకుని.. వైసీపీ శ్రేణులు సైతం కన్వెన్షన్‌ సెంటర్ ద‌గ్గ‌ర‌కు భారీగా చేరుకున్నాయి. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిపై బారికేడ్లు పెట్టారు. రోప్‌పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. గుడివాడ నెహ్రూ చౌక్‌, నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ద‌గ్గ‌ర‌ ప్రత్యేక బలగాలను మోహరించారు. దీంతో.. టీడీపీ నిజనిర్ధారణ బృందం పర్యటనపై ఉత్కంఠ నెల‌కొంది. 

క్యాసినో నిర్వహణపై టీడీపీ ముఖ్య నేతలు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తంగిరాల సౌమ్యతో ఆ పార్టీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గుడివాడలో పర్యటించి క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు సమాయత్తమైంది. 

త‌న‌కు చెందిన కె కన్వెన్షన్‌ సెంటర్‌లో కొడాలి నాని క్యాసినో నిర్వహించారని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ‘‘ఎన్టీఆర్‌ టు వైఎస్సార్‌ పేరిట క్యాసినో నిర్వహించారు. ఎన్టీఆర్‌ పేరుతో అసాంఘిక కార్యకలాపాలను సహించం. సొంత కన్వెన్షన్‌ సెంటర్‌లో గోవా సంస్కృతిని ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లో కరోనా చికిత్స తీసుకున్నా అంటే సరిపోతుందా? ఈ వ్యవహారంలో మంత్రి కొడాలి నానిని తప్పిస్తే న్యాయపోరాటం చేస్తాం. కొడాలి నాని దొరికిపోయిన దొంగ.. వెంటనే ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి’’ అని బొండా ఉమ డిమాండ్‌ చేశారు.