ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
posted on Oct 18, 2025 12:10PM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులను అక్రమంగా నిర్బంధించడం, వారిపై దాడి చేయడం పోలీసులకు ఒక అలవాటుగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కర్నూలు జిల్లా చిప్పగిరి గ్రామానికి చెందిన గొల్ల జయపాల్ యాదవ్‌ను 2016లో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టారని, ఆ దెబ్బల కారణంగా బాధితుడు ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటికీ సరిగా నడవలేని దుస్థితిలో ఉన్నాడని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
తనను చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జయపాల్ 2016లో ఫిర్యాదు చేస్తే, ఇన్నేళ్లయినా ఆ కేసులో తుది నివేదిక దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోలీసుల పనితీరును ఉదహరిస్తూ న్యాయమూర్తి ఇటీవల హైకోర్టులో పనిచేసే డ్రైవర్‌పై మంగళగిరి సీఐ దాడి చేశారు.
మేము జోక్యం చేసుకుని జిల్లా ఎస్పీని పిలిపించి మాట్లాడితే తప్ప కేసు నమోదు చేయలేదన్నారు. జయపాల్ కేసులో కర్నూలు ఎస్పీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించిన తర్వాతే, ఈ నెల 14న పోలీసులు సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.