తక్షణమే విధుల్లో చేరండి: ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టు ఆదేశం

 

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో గత నాలుగు రోజులుగా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె వలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక తక్షణమే వారిని సమ్మె విరమింపజేయవలసిందిగా కోరుతూ టిడిపి నేత పి.ఎల్.వెంకట్రావు, చిత్తూరు జిల్లా వాసి మహ్మద్‌గౌస్‌ హైకోర్టులో వేర్వేరు లంచ్ మోషన్ పిటిషన్స్ వేసారు.

 

వాటిని విచారణకు స్వీకరించిన జస్టిస్‌ జేసీ భాను సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు అందరూ తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరమని ఆదేశించారు. వారి సమ్మె చట్ట వ్యతిరేకమని, ఒకవేళ సమ్మె కొనసాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసును ఈనెల 12కి వాయిదా వేసారు.

 

కానీ ఆర్టీసీ ఈ.యూ. మరియు టీ.ఎం.యూ. నేతలు తాము హైకోర్టు తీర్పును గౌరవిస్తామని, కానీ కోర్టు తీర్పు కాపీ తమకు అందేవరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. అయినా చట్ట ప్రకారం తాము యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన తరువాత తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విధిలేని పరిస్తితులల్లో సమ్మెకు దిగామని మీడియాకు తెలిపారు. కోర్టు తీర్పు చేతికి వచ్చిన తరువాత సమ్మె విరమించడమా లేక సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవడమా అనే విషయం గురించి ఆలోచిస్తామని అంతవరకు తమ సమ్మె యధాతధంగా కొనసాగుతుందని ఆర్టీసీ ఈ.యూ. నేత పద్మాకర్‌ చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu