పూవర్తికి కు హిడ్మా భౌతిక కాయం.. కన్నీరుమున్నీరుగా విలపించిన గ్రామం
posted on Nov 20, 2025 1:11PM

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతదేహాన్ని ఛత్తీస్ గఢ్ కు తరలించారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో నిన్న హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. పోస్టుమార్టం అనంతరం హిడ్మా, అతని భార్య రాజక్క మృతదేహాలను బంధువులకు అప్పగించారు. హిడ్మా స్వగ్రామం ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఈ నెల 18, 19 తేదీల్లో మారేడుమిల్లి దగ్గర జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో మొత్తం 13 మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తరువాత భౌతిక కాయాలను వారి వారి బంధువులకు అప్పగించారు.
హిడ్మా మృతదేహం సుక్మా జిల్లా పూవర్తి గ్రామం చేరుకోవడంతో మొత్తం గామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మావోయిస్టుల దండయాత్రకు నాయకత్వం వహించిన హిడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామంలోని దాదాపు 50 ఇళ్లలో సగానికి పైగా ఇళ్లకు తాళాలే కనిపిస్తున్నాయి. గ్రామస్థులు భయంతో, దిగ్భ్రాంతితో తమ ఇళ్లకు తాళాలేసుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హిడ్మా మృతదేహాన్ని చూసి నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి మాంజు భోరున విలపించింది 50 ఇళ్లే ఉన్న ఈ చిన్న గ్రామమైన పువర్తిలోనే ఏకంగా 90 మంది యువకులు మావోయిస్టులుగా మారారంటే గ్రామంపై హిడ్మా ప్రభావం ఎంతగా ఉందో అవగతమౌతుంది. ఈ గ్రామానికే చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్స దేవా.. హిడ్మా తరువాత కీలక నాయకుడిగా భావిస్తున్నారు.
మావోయిస్టుల అధీనంలో ఉండే ఈ ప్రాంతంలో దశాబ్దాల తరబడి భద్రతా దళాలకు ప్రవేశం కూడా కష్టమయ్యేది. అయితే ఏడాది క్రితం సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపు స్థాపించడంతో పరిస్థితుల్లో కొంత మార్పు చోటు వచ్చింది. అంతే కాకుండా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ గ్రామం నుంచి ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పోల్ అవ్వలేదంటే ఈ గ్రామంపై మావోయిస్టుల ప్రభావం ఎంత ఉందో అర్ధమౌతుంది.