వరద విలయంలో ఉత్తరాఖండ్.. సహాయచర్యల్లో ఆర్మీ టీమ్స్ 

కుండపోత వర్షాలతో దేవభూమి ఉత్తరాఖండ్‌ విలవిలలాడుతోంది. కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి.  లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉద్ధృతికి పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుమావూన్ రీజియన్‌లో ఇళ్లు నేల మట్టమయ్యాయి. అనేకమంది శిథిలాల క్రింద చిక్కుకున్నారు. వరదల్లో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు.   

భారీ వర్షాలకు నైనిటాల్‌ జిల్లా అతలాకుతలమైంది. వరద ఉద్ధృతికి నైనిటాల్‌ సరస్సు ఉప్పొంగడంతో సమీప గ్రామాలకు వరద పోటెత్తింది. దీంతో ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైనిటాల్‌‌కు వెళ్ళే దారులన్నీ దిగ్బంధనం కావడంతో మిగిలిన రాష్ట్రంతో సంబంధాలు తెగిపోయాయి. రామ్‌గఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరద ఉద్ధృతికి పలు చోట్ల రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. హల్ద్వానీ ప్రాంతంలో గౌలా నది ఉప్పొంగడంతో ఆ నదిపై ఉన్న వంతెన కొంతమేర కొట్టుకుపోయింది. చంపావత్‌ ప్రాంతంలో చల్తీ నదికి వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది.    

వర్షాల కారణంగా కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ ఆలయాలకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన తర్వాతే యాత్రికులను అనుమతిస్తామని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామి, కేంద్రమంత్రి అజయ్ భట్‌లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.  

రాష్ట్రంలోని వరద బాధితులకు సహాయపడేందుకు మూడు సైనిక హెలికాప్టర్లను పంపిస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. రెండు హెలికాప్టర్లను నైనిటాల్‌కు, ఒక హెలికాప్టర్‌ను గర్వాల్ రీజియన్‌కు పంపుతామన్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని ఈ హెలికాప్టర్ల సహాయంతో రక్షిస్తామని చెప్పారు. ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కోరారు. చార్‌ధామ్ యాత్రకు వెళ్ళే భక్తులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని, వాతావరణ పరిస్థితి మెరుగుపడిన తర్వాత ప్రయాణాన్ని పునఃప్రారంభించవచ్చునని తెలిపారు. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఎడతెరిపిలేని వర్షాల వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని తెలిపారు.