మూసీ వరద..చిగురుటాకులా వణుకుతున్న విశ్వనగరం!
posted on Sep 27, 2025 10:16AM

తెలంగాణ వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది వరదతో ఉప్పొంగుతోంది. హైదరాబాద్ లోని జంట జలాశయాలు పూర్తిగా నిండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ మహోగ్రరూపం దాల్చింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ దాదాపుగా నీటమునిగాయి. కుసుంపూర్, పురానాపూల్, చాదర్ ఘాట్, మలక్ పేట్, మూసారాంబాగ్, నాగోల్ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఇక మూసీకి ఆనుకుని ఉన్న అన్ని బ్రిడ్జీలపైనా రాకపోకలను నిలిపివేశారు.
జియాగూడ , కులుసంపూర , చాదర్ ఘాట్ , మూసారాంబాగ్ బ్రిడ్జిల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో వాటిని మూసివేసి రాకపోకలను నిలిపివేశారు.

కాగా మూసీని ఆనుకుని ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లోని భారీ ఎత్తున వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ప్రయాణీకులు బస్టేషన్ లో చిక్కుకుపోయారు. బస్టాండ్ లోపల చిక్కుకున్న ప్రయాణికులను అతి కష్టం మీద తాడు సాయంతో బయటకు తీసుకువచ్చారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా గండిపేట్ గేట్లు ఎత్తడంతో అనూహ్యంగా వరద ముంచెత్తిందని అంటున్నారు. ఇలా ఉండగా నార్సింగి, మంచిరేవుల మధ్య ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డులో వరదలో చిక్కుకున్న నలుగురిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి.

ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో భారీగా వచ్చిన వరదతో సర్వీసు రోడ్డు మీద నుంచి వరద నీరు పొంగి పోర్లతోంది. ఆ మార్గంలో వెళ్లరాదని బారికేడ్లు పెట్టినా పట్టించు కోకుండా ఓ డ్రైవర్ ఆటో ట్రాలీ లో రోడ్ దాటేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ ట్రాలీలో డ్రైవర్ తో పాటు నలుగురు ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి వరద తీవ్రత ఎక్కువ ఉండడంతో ఆటో ట్రాలీ ఆగిపోయింది. అక్కడే ఉన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది అప్రమత్తమై వాళ్ళని సురక్షితం గా కాపాడి, ఆటో ట్రాలీ కి తాడు కట్టిబయటకు తీశారు.