Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆర్థిక లావాదేవీల విషవలయంగా ఇండియాలో వైద్యం.!
posted on: Jul 25, 2026 4:43PM
.webp)
ఇండియా ఒకప్పుడు సేవగా భావించిన వైద్య రంగం, ఇప్పుడు వ్యాపార సరళి దాటి పక్కా ఆర్థిక లావాదేవీల వలయంగా మారిపోయింది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి అనంతర కాలంలో సాధారణ అనారోగ్యానికి కూడా ఆసుపత్రి బాటపట్టాల్సి వచ్చిన పరిస్థితి మధ్యతరగతి కుటుంబానికి ఆర్థికంగా ఒక శిక్షలా పరిణమిస్తోంది. డాక్టర్ల సంప్రదింపు రుసుములు, బెడ్ చార్జీలు, మందుల ధరలు అమాంతం పెరిగిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అసాధారణ ధరల పెరుగుదల వెనుక ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థల లాభార్జన ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్పొరేట్ రంగానికి దీటుగా పెద్ద ఎత్తున గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లు హెల్త్‌కేర్‌లోకి ప్రవేశించడమే ఈ మార్పుకు ప్రధాన కారణం.
2022 నుండి 2024 మధ్య కాలంలో ప్రైవేట్ ఈక్విటీ ద్వారా సుమారు 4.65 బిలియన్ల డాలర్లు.. ఇండియన్ కరెన్సీలో దాదాపు 39 వేల918 కోట్లు, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల రూపంలో 3.2 బిలియన్లు అంటే 27,459 కోట్ల రూపాయలు, ఇంకా ఐపీవోల ద్వారా 7,246 కోట్ల రూపాయలు ఇండియన్ ఆసుపత్రుల రంగానికి తరలివచ్చాయి. పెట్టుబడులు పెరగడం సదుపాయాలను విస్తరించినప్పటికీ, ఆసుపత్రుల యజమాన్యాల ప్రాధాన్యతలు లాభాల ఆర్జన వైపు మొగ్గు చూపడానికి దారితీసింది. ప్రసిద్ధ బహుళజాతి పెట్టుబడి సంస్థలైన బ్లాక్‌స్టోన్, టెమాసెక్, కేకేఆర్ వంటివి దేశంలోని ప్రముఖ రీజినల్, నేషనల్ హాస్పిటల్ నెట్‌వర్క్‌లలో మెజారిటీ వాటాలను దక్కించుకున్నాయి. కేర్ హాస్పిటల్స్, కిమ్స్ హెల్త్, మణిపాల్, హెచ్‌సిజి వంటి పెద్ద ఆసుపత్రుల ప్లాట్‌ఫామ్‌లలో యాజమాన్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫార్మా రంగంలో సైతం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల వాటాలు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు 2026 ప్రారంభం నుండి ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి లభించడంతో విదేశీ నియంత్రణ పెరిగింది.
అయినప్పటికీ, ఇన్సూరెన్స్ పొందిన రోగుల విషయంలో జరుగుతున్న వ్యత్యాసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్న రోగుల నుండి సాధారణ రోగుల కంటే దాదాపు 1.9 రెట్లు ఎక్కువ బిల్లులు వసూలు చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్యాకేజీ కాంపోనెంట్లలో ఏకంగా 2.54 రెట్లు పెంచి వసూలు చేయడం ద్వారా ఆసుపత్రులు అదనపు లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, చివరకు రోగులే ఆ భారాన్ని పెరిగిన ప్రీమియంల రూపంలో చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ భారీ వ్యయాలను నియంత్రించాల్సిన చట్టాలు, నిబంధనలు దేశంలో ఆశించిన స్థాయిలో పటిష్టంగా అమలుకావడం లేదు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 2010 అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా అందుబాటులోకి రాకపోవడంతో ఆసుపత్రి చార్జీలపై కచ్చితమైన ప్రామాణికత కొరవడింది. జాతీయ గణాంకాల ప్రకారం సగటు ఆసుపత్రి చికిత్స వ్యయం గత కొన్నేళ్లలో 88 శాతినికి పైగా పెరిగి 37 వేల858 రూపాయలకు చేరింది. మరోవైపు ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి ఐఆర్డిఐఏ గణాంకాల ప్రకారం క్లెయిమ్‌లు పెరుగుతున్నా, చెల్లింపుల శాతం తగ్గుముఖం పట్టడంతో పాటు, క్లెయిమ్ తిరస్కరణపై 1,37,000 కు పైగా ఫిర్యాదులు దాఖలయ్యాయి.
మరో ప్రధాన సమస్య మందుల లభ్యత, ధరలకు సంబంధించినది. జన్ ఔషధి కేంద్రాల ద్వారా ప్రభుత్వం అదే సాల్ట్, అదే మాలిక్యూల్ కలిగిన నాణ్యమైన జెనరిక్ మందులను 80 నుంచి 90 శాతం తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతున్నప్పటికీ, వైద్యులు బ్రాండెడ్ మందులకే మొగ్గుచూపుతున్నారు. నిబంధనలు జెనరిక్ మందులు రాయాలని చెబుతున్నా అది ఆచరణలో అమలు కాకపోవడాన్ని గతంలో సుప్రీం కోర్టు సైతం తప్పుపట్టింది.
కానీ ఇప్పటికీ ఫార్మా విపణిలో ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా ప్రాధాన్యతలు మారుతూనే ఉన్నాయి. సామాజిక పరంగా ఈ పరిస్థితి దేశంలోని సగటు పన్ను చెల్లింపుదారుడిని, మధ్యతరగతి వర్గాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే మెడికల్ ఇన్‌ఫ్లేషన్ ఏటా పది నుంచి 14 శాతం చొప్పున నమోదుకావడం గమనార్హం. వైద్య అత్యవసర పరిస్థితులు వస్తే ఆస్తులు అమ్ముకోవడం లేదా అప్పుల పాలుకావడం వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 40 మిలియన్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ పెట్టుబడులను పూర్తిగా వ్యతిరేకించలేకపోయినా, రోగుల శ్రేయస్సు దృష్ట్యా కఠినమైన నియంత్రణల ఆవశ్యకత ఉంది. ఆసుపత్రి బిల్లింగ్ విధానంలో పూర్తి పారదర్శకత, ఐటెమైజ్డ్ వివరాల ప్రకటన, జెనరిక్ మందుల వాడకంపై స్పష్టమైన ఆదేశాలు అమలు చేయాల్సి ఉంది. బీమా రంగంలో క్లెయిమ్ తిరస్కరణల నియంత్రణకు ప్రత్యేక విభాగాలు ఏర్పడటంతో పాటు, కేంద్ర ఆరోగ్య శాఖ, బీమా నియంత్రణ మండలులు కలసి సమగ్ర ఆరోగ్య నియంత్రణ చట్రాన్ని రూపొందించాలని నిపుణులు భావిస్తున్నారు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
Private Hospital Costs, Health Insurance, Claim Rejections, Corporate Healthcare, Private Equity Investments






