తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల చేసిన వైద్యులు

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయన పూర్తిగా వైద్య సాయంపైనే ఆధారపడి ఉన్నారు. మరి కొన్ని రోజుల పాటు ఆయన ఆరోగ్యంపై ఏమీ చెప్పలేమని నారాయణ హృదయాలయ ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులిటిన్ పేర్కొంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆయనను కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకువచ్చిన సంగతి విదితమే. ఇక్కడకు చేరుకునే సమయానికి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అప్పటి నుంచి నిపుణులతో కూడిన వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే తారకరత్న పరిస్థితి విషమంగానే ఉంది.

 ప్రస్తుత పరిస్థితుల్లో తారకరత్నను సందర్శించేందుకు ఎవరూ రావొద్దని, వచ్చి చికిత్సకు ఆటంకం కలిగించవద్దని నారాయణ హృదయాలయ బులెటిన్ లో  కోరింది. కుప్పంలో తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శుక్రవారం (జనవరి 28) ప్రారంభమైన సంగతి తెలిసిందే. లోకేష్ కు మద్దతు తెలిపేందుకు వచ్చి పాదయాత్రలో అడుగు కలిపిన తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి విదితమే.

ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి రోడ్డు మార్గంలో తీసుకు వచ్చారు. ఆయనకు మాసివ్ హార్ట్ అటాక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఇలా ఉండగా తారకరత్నను పరామర్శించేందుక మరి కొద్ది సేపటిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెంగళూరు చేరుకుంటారు.