హరీష్ రావు కారు దిగిపోతారా?
posted on May 9, 2015 2:23PM
.gif)
ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేనల్లుడు హరీష్ రావు చాకులా పనిచేస్తున్నాడని ఎంత మెచ్చుకొన్నప్పటికీ తెరాస ప్లీనరీ సమావేశాలలో ఆయనకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో హరీష్ హార్ట్ అయ్యేరని సమాచారం. అదేవిధంగా కేసీఆర్ తన కుమారుడు కె.తారక రామారావుకే పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నారని మీడియాలో వస్తున్న వార్తలతో ఆ పదవి ఆశిస్తున్న హరీష్ రావు మరింత హార్ట్ అయిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల గురించి ఆయన తన అనుచరులతో చర్చిస్తునట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్టీలో, ప్రజలలో కె.టి.ఆర్ పాపులారిటీ పెంచేందుకే ఆయన అమెరికా యాత్రకి పంపినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. కె.టి.ఆర్. అమెరికాలో తనకున్న పరిచయాలతో, తెలంగాణా యన్.ఆర్.ఐ.లను, అక్కడి పారిశ్రామిక వేత్తలను మెప్పించి తెలంగాణా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురాగలిగితే ప్రజలు కూడా తప్పకుండా మెచ్చుకొంటారు కనుక అప్పుడు ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెడితే హరీష్ రావుతో సహా పార్టీలో నేతలెవరూ అభ్యంతరం చెప్పారని తెరాస అధిష్టానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆ పదవి ఆశిస్తున్న హరీష్ రావు వెంటనే కారు దిగిపోయి కాంగ్రెస్ చెయ్యి పట్టుకొనే అవకాశాలున్నాయని, ఒకవేళ ఆయన కారు దిగిపోతే ఆయనతో బాటే ఆయన అనుచరులు మరో పది మంది వరకు కారు దిగిపోయి ఆయనను ఫాలో అయిపోయే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తెరాసకు పెద్ద దెబ్బే అవుతుంది కనుక పరిస్థితి అంత దూరం పోకుండా కేసీఆర్ ముందే జాగ్రత్తపడవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ముందు ప్లీనరీ సమావేశాల్లోనే కేటీఆర్ కి ప్రమోషన్ డిక్లేర్ చేస్తారని మీడియా కోడై కూసింది. కానీ అటువంటిదేమీ జరుగలేదు. ఇప్పుడు కేటీఆర్ అమెరికా నుండి తిరిగి రాగానే ఆయనకు పట్టాభిషేకం చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరదయినా నిజమో కాదో చూడాలి.