ప్రేమను వ్యక్తం చేస్తున్నారా?

◆ప్రపోజ్ డే◆ 

ఈ ప్రపంచంలో ప్రేమ చాలా గొప్పది. మనిషిని అనుభూతి చెందించడంలో కూడా ప్రేమ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఫిబ్రవరి మాసం వచ్చిందంటే ప్రేమికుల మనసులకు మరింత ఉత్తేజం కలుగుతుంది. వాలెంటైన్ వీక్ గా పిలువబడే వారంలో రెండవరోజును ప్రపోజ్ డే గా చెబుతారు. తాము ప్రేమిస్తున్నవారికి తమ మనసులో మాట చెప్పడం, తాము ఆల్రెడీ ప్రేమిస్తున్నవారి మీద మనసులో ఎంత ప్రేమ ఉందొ తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఎక్కడ చూసినా  ప్రేమ జంటలు ప్రేమపావురాల్లా సందడి చేస్తుంటాయి. 


ఇష్టమైన వారిని బయటకు తీసుకెళ్లడం తమ మనసులో మాట చెప్పడంలో ఒక్కొక్కరు ఒకో విధమైన మార్గాన్ని అనుసరిస్తారు. కొందరు పువ్వులు ఇస్తే, మరికొందరు బహుమతులు, ఇంకొందరు చాక్లెట్లు ఇస్తూ మనసును బయట పెడతారు. అయితే ప్రపోజ్ డే రోజు ప్రేమికులు అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయాలు కొన్ని ఉన్నాయి, అవి తప్పక తెలుసుకుని తీరాలి.. అవేంటంటే..


ఒకే.. నాట్ ఒకే..


ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు  తాము ప్రేమించే వారికి మనసులో మాట చెబుతారు. కొందరు ఆ మాట చెప్పడానికి భయపడతారు. అయితే అవతలివారు ఒకే చెబుతారా లేదా నో చెబుతారా అనేది వారి వ్యక్తిగత విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రేమించడం మీ వ్యక్తిగత ఇష్టం అయినప్పుడు ఒకే చెప్పాలా లేదా అనేది వారి వ్యక్తిగత విషయం అని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం అర్ధం చేసుకుంటే ఎదుటి వారు నో చెప్పినా సరే పాజిటివ్ మైండ్ ఉంటుంది. లేకపోతే ప్రపంచం మొత్తం మీద ఉన్న వైరాగ్యం అంతా మీలోకి వచ్చి దేవదాసునో.. లేక పార్వతినో చేస్తాయి.


పాజిటివ్.. నెగిటివ్…


ప్రేమ ఒప్పుకోకపోతే ఇక అవతలి వాళ్లకి పొగరు, వాళ్ళు మిమ్మల్ని అవమానం చేస్తున్నారు వంటి నెగిటివ్ ఆలోచనలు మానుకోవాలి. ఈ కాలంలో అమ్మాయిలు, అబ్బాయిల స్నేహం సాధారణం. అబ్బాయిల అయినా అమ్మాయిలు అయినా స్నేహితుల్లానే ఉండండి. ప్రవర్తనలో స్నేహితులకు బదులు ప్రేమికుల రేంజ్ లో కేరింగ్, ప్రేమ, అఫెక్షన్ చూపించి ఆ తరువాత నాది ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే, నువ్ ఇలా లవ్ యాంగిల్ లో చూస్తావని అనుకోలేదు లాంటి డైలాగ్స్ కొట్టకండి. ఒకవేళ మీ స్నేహితులు మీకు ప్రపోజ్ చేసినా మీకు ఇష్టం లేకపోతే సర్ది చెప్పండి, వారు మిమ్మల్ని అర్థం చేసుకునేవరకు  సమయం ఇవ్వండి. అంతేకానీ స్నేహం అనుకుంటే లవ్ చేస్తావా అని గొడవలకు పోకండి. అలాగని మరీ పూసుకుని రాసుకుని కేర్ టేకార్ గా ఉండకండి. అవసరాలు తీర్చవచ్చు కానీ అన్నిటికీ మీరే అవసరం అనేలా మారకండి. అప్పుడే ప్రేమకు, స్నేహానికి వ్యత్యాసం ఎంతో కొంతం అర్థమవుతుంది.


ప్రపోసల్ స్పెషల్..


నచ్చినవారికి మనసులో మాయా చెప్పడమే కాదు, ఇంప్రెస్ చేయడం కూడా ముఖ్యమే. ప్రేమను ఎంత విభిన్నంగా ఎక్స్ప్రెస్ చేస్తే అవతలి వారు అంతగా ఇంప్రెస్ అవుతారు. నచ్చిన అమ్మాయికి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేదం అదేదో యుద్ధం అనుకోవద్దు. నిజాయితీగా మనసులో మాటను చెబితే అవతలి వారు అర్థం చేసుకుంటారు. ఓవర్ ఏక్షన్ చేసి బొక్కబోర్లా పడితే తరువాత ప్రేమ కాస్త వెక్కిరించినట్టు అవుతుంది.


జస్ట్ మూవ్ ఆన్..


ప్రేమిస్తున్నవారు నో చెప్పారా?? నో ప్రాబ్లెమ్ వారికి వేరొక జీవితం ముడిపడి ఉంది అని మనసుకు చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం కష్టమే. కానీ బలవంతం చేసి ఇష్టం లేని వారి జీవితంలోకి వెళ్లి అశాంతిగా బ్రతకడం కంటే అవతలి వారి నిర్ణయాన్ని గౌరవించి మీరు కదిలిపోవడం మంచిది. రెండు చేతులు కలిస్తేనే  చప్పట్లు అన్నట్టు రెండు మనసులు కలిస్తేనే సంపూర్ణమైన ప్రేమ సాధ్యం. కాబట్టి ప్రేమ రిజెక్ట్ అయితే జైస్ట్ మూవ్ ఆన్ అంతే…


చివరగా చెప్పొచ్చేది ఏమిటంటే.. ప్రేమ అనేది కేవలం ఓ అమ్మాయికో అబ్బాయికో ఆకర్షణతో చెప్పేది , ఆరాధనతో వ్యక్తం చేసేది అనుకుంటే పొరపాటు. పంచడానికి ఈ ప్రపంచంలో ప్రేమ, అభిమానం, ఆప్యాయత  లేనివారు ఎందరో ఉన్నారు. వారికి మీ ప్రేమను అందివ్వవచ్చు మనస్ఫూర్తిగా..


                                          ◆నిశ్శబ్ద.