'అప్పుల‌ప్ర‌దేశ్‌'పై కేంద్రం క‌న్నెర్ర‌! జీవీఎల్ ఎంట్రీతో జ‌గ‌న్‌కు చెక్ త‌ప్ప‌దా?

జీవీఎల్ న‌ర‌సింహారావు. ఊరికే రారు మ‌హానుభావుడు. ఆయ‌న వ‌చ్చారంటే.. ఎవ‌రికో ఎస‌రు పెడుతున్న‌ట్టే. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఢిల్లీలో తిష్ట‌వేసి.. ఇటు బీజేపీ త‌ర‌ఫున‌, అటు అన‌ధికారికంగా కేంద్ర ప‌క్షాన‌.. ఏపీ వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెడుతుంటారు జీవీఎల్‌. చ‌క్క బెట్ట‌డం కంటే కూడా.. చిక్కు పెట్ట‌డంపైనే ఆయ‌న ఎక్కువ‌గా దృష్టి సారిస్తుంటార‌నే పేరు. కొంత‌కాలంగా ఏపీ విష‌యంలో సైలెంట్‌గా ఉంటూ వ‌స్తున్న జీవీఎల్‌.. మ‌ళ్లీ ఇప్పుడు స్వ‌రం పెంచారు. ఏపీ వ్య‌వ‌హారాల్లో దూకుడు పెంచారు. ఆయ‌న ఎక్కువ ఫైనాన్సియ‌ల్ మేట‌ర్స్‌లోనే.. వేలు పెట్టి కెలుకుతుంటారు. పీడీ బిల్లులేవంటూ ఇటీవ‌ల‌ ఏపీ స‌ర్కారును నిల‌దీశారు. తాజాగా, ఏపీ ప్ర‌భుత్వాన్ని కేంద్రం ముందు దోషిగా నిల‌బెట్టేలా.. అప్పులపై నిప్పులు చెరిగారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అప్పుల‌ప్ర‌దేశ్‌గా మార్చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ అడ్డ‌గోలు విధానాల‌పై స్వ‌యంగా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. 

ఏపీ.. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందనే విషయం దేశం మొత్తం తెలిసిందంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిప‌డ్డారు. కొత్త అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌తీరోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అప్పులకోసమే ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎస్‌డీసీ) ఏర్పాటు చేసినట్టుందని.. అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందంటూ త‌ప్పుబ‌ట్టారు. ఈ విష‌యాల‌న్నిటిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాన‌న్నారు జీవీఎల్‌.

ఎస్‌డీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరణలు చేయాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అప్పుల మంత్రిగా కనిపిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ప్ర‌తీరోజూ కొత్త అప్పుల కోసం పడరాని పాట్లు పడుతున్నారని.. ఏపీ అప్పులపై కాగ్‌, ఆర్బీఐతో ఆడిట్‌ చేయాలని కేంద్రాన్ని కోరతానని జీవీఎల్ అన్నారు. 

జీవీఎల్ అభిప్రాయ‌మే బీజేపీ అభిప్రాయం. కేంద్రం ఏపీని టార్గెట్ చేయాల‌ని అనుకుంటే.. ముందు జీవీఎల్‌ను రంగంలోకి దింపుతుంది. ఆయ‌న‌తో ప్ర‌భుత్వ ప‌రువంతా తీయిస్తుంది. ఆ త‌ర్వాత యాక్ష‌న్‌లోకి దిగుతుంది. జీవీఎల్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే.. కేంద్రం జ‌గ‌న్ స‌ర్కారుకు స‌హాయ నిరాక‌ర‌ణ చేయ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో అభివృద్ధిని అట‌కెక్కించేసి.. ఏపీని అప్పుల కుప్ప‌గా మార్చేసిన సీఎం జ‌గ‌న్ తీరుపై కేంద్రం గుర్రుగా ఉంద‌ని అంటున్నారు. అందుకే, జ‌గ‌న్ ముంద‌రి కాళ్ల‌కు బంధాలేసేందుకే జీవీఎల్‌తో కేంద్రానికి ఫిర్యాదు చేయించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత ఇక అస‌లైన యాక్ష‌న్ మొద‌ల‌వుతుంద‌ని చెబుతున్నారు. అయితే, ఈ చ‌ర్య‌లు కేవలం ఆర్థిక‌ విధానాల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతుందా? లేక‌, సీబీఐ విచార‌ణ‌,  జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దునూ ప్ర‌భావితం చేస్తుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.