ముగిసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

 

తెలంగాణలో సంచలనంగా మారిన పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరి తరఫు న్యాయవాదులు విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించారు.

ఇప్పటికే ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్‌ల విచారణ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 1న జరగాల్సిన విచారణ వాయిదా పడటంతో, మహిపాల్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఇవాళ స్పీకర్ ఎదుట వాదనలు వినిపించారు.

కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేసింది. కానీ, రోజులు గడుస్తున్నా నిర్ణయం రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో, స్పీకర్ సంబంధిత ఎమ్మెల్యేలకి నోటీసులు పంపారు.

దానం నాగేందర్‌, కడియం శ్రీహరి తప్ప మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అఫిడవిట్‌ల ద్వారా స్పష్టీకరించారు. ఫిర్యాదుదారులు తమ ఆధారాలను సమర్పించగా, విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారా? లేక మరికొంత సమయం కోరుతారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.