సర్కార్ సొమ్ము సాక్షి ఖజానాకు ..!

అవును.. ఆయన చెప్పినట్లు .. డబ్బులు ఎవరికీ ఊరికే రావు, అయితే ఆయనకు ఆ విషయం ఇప్పడు తెలిసిందేమో కానీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, డబ్బులు ఉరికే రావనే కాదు, ఏమి చేస్తే వస్తాయో, అందుకు దారి చూపే అక్రమ మార్గాలు ఏమిటో, కూడా బాగా తెలుసునని, ఆయనేమిటో తెలిసిన వారు అంటుంటారు. అందుకే ఆయన, రాజకీయాలలోకి పూర్తి స్థాయి ఎంట్రీ ఇవ్వకముందు నుంచే, తండ్రి (ముఖ్యమంత్రి) చాటు బిడ్డగా ఉండగానే రాజకీయ వ్యాపార సూత్రాలను అవపోసన పట్టారని, అధికారుల అండదండలతో ఇంచక్కా ఊరు పేరు లేని సూట్ కేసు కంపెనీల క్విడ్ ప్రో క్రో పద్దతిలో పెట్టిన కోట్ల రూపాయల పెట్టుబడులతో హైదరాబద్ నుంచి బెంగుళూరు వరకు బెంగుళూరు నుంచి ఇంకెక్కడి దాకానో, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని, అంటారు. 

ఇదిగో అలా జగన్ రెడ్డి మేథోమధన సాక్షిగా పుట్టిన అక్రమ పుత్రికే ‘సాక్షి’ పత్రిక. జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌, అని అంటారు. చట్టవ్యతిరేకంగా 14 కంపెనీలు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా నిధులు సాక్షి’లోకి మళ్లించారననే ఆరోపణలున్నాయి. ఆరోపణలు చేసింది కూడా ఎవరో  కాదు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.

గతంలో సత్యం, మేటాస్ వ్యవహారాలపై చర్చ సందర్భంగా శాసనసభలోనే ఆయన ఈ ఆరోపణలు చేశారు. అంతే కాదు   విదేశీ పెట్టుబడుల పరిమితి చట్టాన్ని ‘సాక్షి’ యాజమాన్యం యధేఛ్చగా ఉల్లంఘించిందని చంద్రబాబు ఆరోపించారు. సత్యం అవకతవకలకు సాక్షీ భూతంగా నిలిచిన ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్‌ ఆధారంగా ప్రభుత్వం ఎలా ప్రకటనలు ఇచ్చిందని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అయితే, పుట్టుక నుంచే ఆరోపణలు ఎదుర్కుంటున్న ‘సాక్షి’ పత్రికకు, వందల కోట్ల రూపాయల ప్రజాధనం ప్రకటనల రూపంలో తరలిపోతూనే ఉందని ప్రతిపక్ష పార్టీలు, ఆరోపిస్తున్నాయి.

 ప్రకటనల రూపంలో ప్రజల సొమ్మును, ‘సాక్షి’ పత్రికకు దోచి పెట్టడమే కాకుండా, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు.. గ్రామ, వార్డు సచివాలయాలు.. ఉద్యోగులతో కూడా సాక్షి పత్రికను కొనిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా, గ్రామ వాలంటీర్ల పేరున ప్రభుత్వం నెల‌కు రూ. 5.32 కోట్ల ప్రజాధనాన్ని ‘సాక్షి’ కి సమర్పిస్తోంది. ఇందుకోసంగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు దినపత్రిక కొనుక్కునేందుకు నెల‌కు రూ. 5.32 కోట్లు చెల్లించేందుకు, రాష్ట్ర ప్ర‌భుత్వం, జూన్ 29న జీవో నంబరు 12ని విడుదల చేసింది.

అయితే, ఇక్కడ ఎక్కడా ‘సాక్షి’ మాత్రమే కొనాలనే నిబంధన అయితే లేదు కానీ, విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఒక పత్రిక కొనుక్కోవాలని వాలంటీర్లకు ప్రభుత్వం సూచించింది. అయితే దాని అర్ధం ఏమిటో వేరే చెప్పనక్కరలేదు.  అంతే కాదు,‘సాక్షి’ కి ప్రకటనల పేరున వైసీపీ నేతల నుంచి కూడా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, అంటున్నారు.. వైసీపీ నేత అయితే స్థాయికి తగ్గట్లుగా ‘సాక్షి’లో సందర్భాన్ని బట్టి ప్రకటనలు ఇచ్చుకోవలసిందే.. వైఎస్ జయంతి,వర్ధంతి, ముఖ్యమంత్రి పుట్టిన రోజు, మరో పండగ పబ్బం, సందర్భం ఏదైనా, ఎవరి స్థాయిని బట్టి వారు, వైసీపీ నేతలు ‘సాక్షి’కి అంతో ఇంతో .. తృణమో ఫణమో సమర్పించుకోవలసిందే, లేదంటే  లెక్కలు మారిపోతాయని పార్టీ నేతలే చెబుతున్నారు.

ఇక కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఇతర వ్యాపార సంస్థలు ప్రభుత్వంలో పనులు కావాలంటే, సాక్షి’ రూట్ సెఫెస్ట్ రూట్ అనే స్థాయిలో, ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఇది ప్రచారం కాదు, నిజం, అంటున్నారు. అందుకే, ‘సాక్షి’ పత్రిక పత్రిక కాదు, ముఖ్యమంత్రి కుటుంబం, అవినీతికి, ‘సాక్షీ’ భూతం ‘సాక్షి’ పత్రిక అంటారు.