తమిళనాట ద్రవిడ పార్టీల మధ్య గూగుల్ గొడవ
posted on Oct 22, 2025 2:49PM

గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తుందని తెలిసిందో లేదో.. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయ్. దానికి తోడు.. లోకేష్ సైతం ఇందులో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మాట్లాడ్డంతో ఆ మంటలు మరింత చెలరేగుతున్నాయ్.
ఇంతకీ అన్నాడీఏంకే వాదనేంటి? లోకేష్ ఏమంటున్నారో చూస్తే.. మధురైకి చెందిన సుందర్ పిచాయ్, గూగుల్ డేటా సెంటర్ కి విశాఖను కేంద్రంగా చేస్కోవడమేంటి? మనకు మాత్రం విశాఖ తరహా సముద్ర తీరం లేదా? అన్నది అన్నాడీఎంకే వాదన. సుందర్ పిచాయ్- తమిళనాడు తన బర్త్ ప్లేస్ అయినా సరే అలాంటి ఆలోచన రాకుండా చేసింది డీఎంకేనే.. అందుకు అధికార పార్టీ సమాధానం చెప్పి తీరాల్సిందే అన్నది అన్నాడీఎంకే నాయకుల వాదన.
వీరిలా కొట్టుకుంటూ ఉంటే, లోకేష్ క్రాస్ ఎంట్రీ ఇచ్చి ఒక కామెంట్ చేశారు. అదేంటంటే, పిచాయ్ తమ సంస్థ కోసం భారత్ ని ఎంపిక చేసుకున్నారు. అందుకే విశాఖను సెలెక్ట్ చేశారని అన్నారు. దానికి తోడు స్టాలిన్ సర్కార్ చేష్టలు కూడా ఇటీవల ఏమంత సజావుగా లేవు. గూగుల్ థియరీకి. స్టాలిన్ సర్కార్ ఫిలాసఫీకీ చాలానే తేడా ఉంటుంది.
ఇటీవలి కాలంలో తమిళనాడు ప్రభుత్వం ఏకంగా హిందీ సినిమాలు ఇక్కడ ఆడటానికి వీల్లేని విధంగా ఒక చట్టం తేవడానికి ప్రయత్నించింది. అంటే ఇక్కడ హిందీ భాషే కాదు, ఆ సినిమాలు కూడా నిషిద్ధమే అన్నది స్టాలిన్ తీసుకురావడానికి చేస్తోన్న యత్నం. ఒకరకంగా చెబితే ఇది భారత సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. విరుద్ధం. అదే తమిళనాడుకు చెందిన ఏ ఒక్కరూ ఇక్కడ ఉండటానికి వీల్లేదని ఉత్తరాదిలోని హిందీ రాష్ట్రాల వారు ఆలోచిస్తే.. పరిస్థితేంటి?
హ్యుందయ్ కంపెనీనే తీస్కుంటే బార్న్ ఇన్ తమిళనాడు సర్వ్ నేషన్ అన్న స్లోగన్ తో తన కార్ల తయారీ చేస్తుంటుంది. అలాంటి హ్యుందయ్ కార్లను హిందీ వాళ్లు మేము తోలడానికి ఒప్పుకోమంటే ఆ కంపెనీ ఏం కావాలి??? ఇలాంటి ఎన్నో సమస్యలకు కేంద్రంగా తన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు స్టాలిన్. దానికి తోడు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం. మరలాంటపుడు ఆ రాష్ట్ర అధికారిక చిహ్నంలోని గోపురాన్ని తీసేయ్యాల్సింది. అది చేసేందుకు ధైర్యం చాలదు. రీసెంట్ గా విజయ్ సభ తొక్కిసలాటకు కారణం స్టాలిన్ సర్కార్ నిర్వాకమే అన్న కామెంట్లు చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు.
అలాంటి తమిళనాడును నమ్మి 15 బిలియన్ డాలర్లు.. దీన్నే భారతీయ కరెన్సీలో చెబితే అక్షరాలా లక్షా 20 వేల కోట్లకు పైమాట. ఇంత మొత్తం తీస్కొచ్చి ఇక్కడ ధారబోసి.. ఆపై కేంద్ర ప్రభుత్వ సహకారం అందక అల్లాడ్డం కరెక్టు కాదని భావించారేమో.. మధురైకి చెందిన పిచాయ్.. విశాఖే ఇందుకు కరెక్టని భావించినట్టున్నారు.
ఈ విషయమే సింపుల్ గా లోకేష్.. పిచాయ్ భారత్ ను ఎంపిక చేసుకున్నారనే చిన్న కామెంట్ లో ఏర్చి కూర్చి పెట్టి వదిలారని అంటున్నారు కొందరు విశ్లేషకులు. దానికి తోడు తమిళనాడులో ద్రవిడ వాదం ఎక్కువ. ఇంకా గట్టిగా మాట్లాడితే కమల్ వంటి వారు ఏకంగా ఈ ఆరు రాష్ట్రాలు ద్రవిడ దేశంగా ఏర్పడాలన్న వాదన కూడా చేస్తుంటారు. గూగుల్ గ్లోబల్ మైండ్ సెట్ కి, ఇలాంటి విభజన వాదానికి పొంతన లేక పోవడంతో.. పిచాయ్ ఈ డెసిషన్ తీస్కున్నట్టుగా తన సింగిల్ లైన్లో చెప్పుకొచ్చారు లోకేష్.