ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ : మంత్రి లోకేశ్

 

విశాఖలో గూగుల్ పెట్టుబడుల ఒప్పందం తర్వాత ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదు. డబుల్ బుల్లెట్ ట్రైన్ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతరామన్, సీఎం చంద్రబాబు, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.

ఏపీ విశాఖలో టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది 'వికసిత భారత్' నిర్మాణ దార్శనికతకు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు.

మరోవైపు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “విశాఖపట్నంలో గూగుల్ తొలి ఏఐ హబ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు ప్రణాళికలను ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది భారతదేశానికి ఒక చారిత్రాత్మక క్షణం” అని పేర్కొన్నారు.

ఈ ఏఐ హబ్ కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు, దేశంలోని అత్యంత ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలతో కూడిన ఒక ఇన్నోవేషన్ సెంటర్‌గా రూపుదిద్దుకోనుందని ఆయన తెలిపారు.

సుందర్ పిచాయ్ వివరించినట్లుగా, ఈ ప్రాజెక్టులో గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీ ఇంధన మౌలిక సదుపాయాలు వంటి అంశాలు ఒకే చోట కలవనున్నాయి. దీని ద్వారా గూగుల్ తమ అత్యాధునిక టెక్నాలజీని భారతీయ సంస్థలు, పరిశోధకులు, వినియోగదారులకు మరింత చేరువ చేయనుందని తెలిపారు.

ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడంతో పాటు, భారతదేశ ఆర్థిక వృద్ధికి కూడా ఈ హబ్ దోహదం చేస్తుందని పిచాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ ఈ నిర్ణయంతో విశాఖపట్నం త్వరలోనే ప్రపంచ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా మారనుందనడంలో సందేహం లేదు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu